కేంద్రం, రాష్ట్రాల మధ్య నిధులపై రగడ.. తెలంగాణ సర్కారు వాదనేంటి ? కేంద్రం అంటున్నదేంటి ?

కేంద్రం, రాష్ట్రాల మధ్య నిధులపై రగడ.. తెలంగాణ సర్కారు వాదనేంటి ? కేంద్రం అంటున్నదేంటి ?
x
కేంద్రం, రాష్ట్రాల మధ్య నిధులపై రగడ
Highlights

పన్నుల నుంచి వచ్చిన ఆదాయం పంచుకునే విషయంలో కేంద్రం, రాష్ట్రాల మధ్య గొడవలు రావడం కొత్త విషయమేం కాదు. దశాబ్దాలుగా ఉంటూ వచ్చిందే. ప్రస్తుత రాజకీయ...

పన్నుల నుంచి వచ్చిన ఆదాయం పంచుకునే విషయంలో కేంద్రం, రాష్ట్రాల మధ్య గొడవలు రావడం కొత్త విషయమేం కాదు. దశాబ్దాలుగా ఉంటూ వచ్చిందే. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో మాత్రం ఈ అంశం మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. తాజాగా తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర నిధుల మొత్తం గణనీయంగా తగ్గిపోయింది. అదే సమయంలో పార్లమెంట్ లో కేంద్ర మంత్రులు వాడిన పదజాలంపై టీఆర్ఎస్ నాయకులు అభ్యంతరం వ్యక్తం చేశారు. తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఇటీవల ఇదే అంశంపై చేసిన వ్యాఖ్యలు మరింత వేడి రగిల్చాయి. చక్కటి పనితీరు కనబరుస్తున్న రాష్ట్రాలను శిక్షిస్తున్నారన్న వాదన కూడా తెరపైకి వచ్చింది.

వివిధ రాష్ట్రాల్లో సంక్షేమ పథకాలకు, అభివృద్ధి పనులకు ప్రాధాన్యం పెరిగింది. దీంతో కేంద్రానికి వచ్చిన నిధుల్లో అధిక వాటాను రాష్ట్రాలు డిమాండ్ చేయడం మొదలైంది. కేంద్రం, రాష్ట్రాల మధ్య నిధుల పంపకం కేంద్రానికి కొత్త తలనొప్పులు తీసుకువచ్చింది. తాజాగా కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్, తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ మధ్య చోటు చేసుకున్న మాటల యుద్ధం కూడా ఇలాంటిదే. అటు కేటీఆర్, ఇటు నిర్మలా సీతారామన్ లకు తోడుగా ఆయా పార్టీల నాయకులు కూడా రంగంలోకి దిగారు. విమర్శలు, ప్రతి విమర్శలు చేసుకుంటున్నారు. నిధుల పంపిణి అంశంతో పాటుగా ఫెడరల్ వ్యవస్థ, కేంద్రం, రాష్ట్రాల మధ్య సంబంధాలు, కేంద్రం వివక్ష లాంటి మరెన్నో అంశాలు కూడా ఈ సందర్భంగా చర్చకు వచ్చాయి. అసలు ఈ నిధుల గొడవకు కారణాలేంటో చూద్దాం.

తెలంగాణకు సంబంధించినంత వరకూ కేంద్ర బడ్జెట్ పూర్తి నిరాశాజనకంగా ఉందని కేటీఆర్ అన్నారు. రావాల్సిన దాని కన్నా ఎక్కువే ఇచ్చామని కేంద్రమంత్రులు చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు. తెలంగాణ గత ఐదేళ్ళలో కేంద్ర ప్రభుత్వానికి పన్నుల రూపంలో రెండు లక్షల 70 వేలు కోట్ల రూపాయలు చెల్లించిందన్నారు. కేంద్రం నుంచి వచ్చింది మాత్రం ఒక లక్షా 15 వేల కోట్లు మాత్రమే అని అన్నారు. దాదాపు ఒక లక్షా 60 వేల కోట్ల రూపాయలు దేశ నిర్మాణం కోసం తెలంగాణ ప్రజలు అందించారన్నారు. వాస్తవాలను దాచేసి తామేదో ఇచ్చామన్నట్లు చెప్పడం సరికాదని హితవు పలికారు. సందర్భం వచ్చినప్పుడు పార్లమెంట్ లో కూడా అదే విషయం స్పష్టం చేస్తామన్నారు.

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వాదన మాత్రం మరోలా ఉంది. రాష్ట్రాల వాటా ఎందుకు తగ్గిందో ఆమె వివరించారు. అలా తగ్గడంతో తమ మంత్రిత్వశాఖ ప్రమేయం లేదన్నారు. చక్కటి పనితీరు కనబరుస్తున్న రాష్ట్రాలకు ప్రోత్సహకాలు ఇవ్వాలన్నదే ఫైనాన్స్ కమిషన్ ఉద్దేశమని కూడా అన్నారు. రాష్ట్రాలకు నిధులు ఎందుకు తగ్గాయో ఆమె వివరించారు. దేశంలో ఒక రాష్ట్రం తగ్గినప్పటికీ, కొత్తగా రెండు కేంద్రపాలిత ప్రాంతాలు వచ్చాయని అన్నారు. ఆ రెండు ప్రాంతాలకు నిధులు సర్దుబాటు చేసేందుకు రాష్ట్రాలకు గల మొత్తం వాటాను 42 శాతం నుంచి 41 శాతానికి తగ్గించాల్సి వచ్చిందన్నారు. నిధుల కేటాయింపు అంశం తమ మంత్రిత్వ శాఖ పరిధిలోని అంశం కాదన్నారు. ఆ పని చేసేది ఫైనాన్స్ కమిషన్ అని అన్నారు. చక్కటి పనితీరు కనబరుస్తున్న రాష్ట్రాలను పనిష్ చేస్తున్నారన్న వాదన కూడా సరైంది కాదన్నారు. వృద్ధి చెందే రాష్ట్రాలకు ప్రోత్సాహకాలు అందిచాలని ఫైనాన్స్ కమిషన్ భావిస్తున్నదని అన్నారు.

ఇక పార్లమెంట్ లో గివెన్ అనే పదం ఉపయోగించడం పట్ల వ్యక్తమైన వ్యతిరేకతను కూడా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తోసిపుచ్చారు. ఆ పద ప్రయోగం వాడుకలో ఉందని అన్నారు. దానిపై అభ్యంతరాలుంటే స్పీకర్ కు తెలియజేయాలని సూచించారు. ఆ పదం వాడుకపై రాద్ధాంతం చేయడం మంచిది కాదన్నారు. తెలంగాణకు కేంద్రం సహకరించడం లేదనడం సరికాదన్నారు. కేంద్రం నుంచి గణనీయ సాయం తెలంగాణకు అందుతోందని అన్నారు. ఈ మాటలు ఎలా ఉన్నప్పటికీ తాజా నిధుల కేటాయింపు మాత్రం జాతీయస్థాయిలోనే వివిధ అంశాలపై చర్చకు తెర తీసింది.

కేంద్ర బడ్జెట్ ను ప్రవేశపెట్టడానికి కొన్ని రోజుల ముందు నుంచే రాష్ట్రాలకు ఈ దఫా వచ్చే నిధుల తగ్గుదలపై అనుమానాలు మొదలయ్యాయి. ఫిబ్రవరి 1న పార్లమెంట్ లో పదిహేనో ఫైనాన్స్ కమిషన్ మొదటి నివేదికను ప్రవేశపెట్టారు. ఆ నివేదికనే తాజా వివాదాలకు కారణమైంది.

ఫైనాన్స్ కమిషన్ నివేదికను చూడగానే కర్నాటక, ఉత్తరప్రదేశ్, కేరళ, తెలంగాణ రాష్ట్రాల వాటా తగ్గిపోతుందన్న భావన మొదలైంది. 2011 జనాభా లెక్కలను పరిగణనలోకి తీసుకోవడం పై అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. జనాభా అధికంగా ఉండే ఉత్తరాది రాష్ట్రాలకే నిధులు ఎక్కువగా లభించే అవకాశం ఏర్పడింది. జనాభా నియంత్రణకు కృషి చేసిన దక్షిణాది రాష్ట్రాలకు నిధుల వాటా తగ్గుతుందన్న అనుమానాలు వెలువడ్డాయి. అయితే కథ ఇక్కడితోనే ముగిసిపోలేదు. ఫైనాన్స్ కమిషన్ ఇటీవల ఇచ్చింది మధ్యంతర నివేదిక మాత్రమే. అది 2020 ఏప్రిల్ 1తో మొదలయ్యే ఆర్థిక సంవత్సరం ఒక్కదానికి మాత్రమే వర్తిస్తుంది. తుది నివేదిక వెలువడితే అసలు కథ మొదలవుతుంది.

వృద్ధి రేటు తగ్గిపోవడం, జీఎస్టీ నుంచి అనుకున్నంత ఆదాయం రాకపోవడం లాంటి అంశాలన్నీ పంపకంలో రాష్ట్రాలకు నిధులు తగ్గిపోయేందుకు కారణమయ్యాయి. జీఎస్టీ ఆదాయం వస్తున్న కొద్దీ దాన్ని మళ్లీ రాష్ట్రాలకు పంచుతామని కేంద్రం అంటోంది. కాకపోతే 2023 తర్వాత పరిస్థితి ఏమిటన్నది కూడా ఆలోచించాల్సిందే. రాష్ట్రాలతో కుదిరిన ఒప్పందం మేరకు 2023 వరకు జీఎస్టీ వల్ల తగ్గిన ఆదాయంలో కొంత మొత్తాన్ని కేంద్రం ఆయా రాష్ట్రాలకు పరిహారంగా ఇస్తుంది. మరి ఆ తరువాత జీఎస్టీ తగ్గితే రాష్ట్రాల పరిస్థితి ఏంటి అనేది కూడా ఆందోళన కలిగించే అంశమే. ఇప్పటి వరకూ ఫైనాన్స్ కమిషన్ ఇన్ కమ్ డిస్టెన్స్, జనాభా, విస్తీర్ణం, అటవీ ప్రాంతం లాంటి అంశాలను మాత్రమే పరిగణనలోకి తీసుకుంది. తాజాగా కొత్తగా డెమొగ్రాఫిక్ పర్ ఫార్మన్స్, టాక్స్ ఎఫర్ట్ లను కూడా పరిగణనలోకి తీసుకుంది. ఇక స్థానిక సంస్థలకు కేటాయించే నిధుల విషయంలో ఫైనాన్స్ కమిషన్ చెప్పినదాన్ని యధాతథంగా కేంద్రం ఆమోదించడం ఆనవాయితీగా వచ్చింది. ఈసారి మాత్రం ఆ సిఫారసులను ఆమోదించకుండా, కొత్త సూత్రాలను వర్తింపజేయాలని కోరడం ఓ విశేషం.

బీజేపీ మొదటి నుంచి కూడా బలమైన కేంద్ర ప్రభుత్వాన్ని కోరుకుంటున్నది. అది ఆ పార్టీ సిద్ధాంతం. మరో వైపున ప్రాంతీయ పార్టీలు మాత్రం బలమైన రాష్ట్ర ప్రభుత్వాలను కోరుకుంటున్నాయి. ఆ వివాదమే ఇప్పడు నిధుల పంపకం విషయంలో కూడా కనిపిస్తోంది. ఫైనాన్స్ కమిషన్ తుది నివేదిక అక్టోబర్ లో వచ్చే అవకాశం ఉంది. ఈ లోగా ఎన్నో పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది. బలమైన రాష్ట్ర ప్రభుత్వాలను కోరుకునే విపక్షాలు ఏకతాటిపైకి రావచ్చు. లేదంటే ప్రస్తుత విధానంలో తమకు అన్యాయం జరుగుతోందని దక్షిణాది రాష్ట్రాలు గొంతెత్తవచ్చు. మరో వైపున బలమైన కేంద్రప్రభుత్వం అవసరమని చెబుతూ రాష్ట్రాలను బలహీనం చేసేందుకు కేంద్రప్రభుత్వం ప్రయత్నించవచ్చు. మొత్తం మీద పదిహేనో ఫైనాన్స్ కమిషన్ నివేదికతో కేంద్రం, రాష్ట్రాల మధ్య నిధుల పంపకం విషయంలో పెను మార్పులు వచ్చే అవకాశం ఉంది.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories