Hyderabad: నెలరోజుల రెక్కీ.. ఆన్లైన్ లో ఆయుధం.. సునీత హత్యలో మాజీ భర్త పక్కా ప్లాన్!

Hyderabad: వనస్థలిపురంలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ సునీత దారుణ హత్య కేసులో విచారణ ముమ్మరం చేసిన పోలీసులు నిందితుడు దేవరకొండ మహేష్‌ను అదుపులోకి తీసుకున్నారు.

Arun Chilukuri
Published on: 19 Feb 2026 11:49 AM IST
Hyderabad: నెలరోజుల రెక్కీ.. ఆన్లైన్ లో ఆయుధం.. సునీత హత్యలో మాజీ భర్త పక్కా ప్లాన్!
X

Hyderabad: నెలరోజుల రెక్కీ.. ఆన్లైన్ లో ఆయుధం.. సునీత హత్యలో మాజీ భర్త పక్కా ప్లాన్!

Hyderabad: వనస్థలిపురంలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ సునీత దారుణ హత్య కేసులో విచారణ ముమ్మరం చేసిన పోలీసులు నిందితుడు దేవరకొండ మహేష్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఈ విచారణలో నిందితుడు చేసిన ప్లాన్ విని పోలీసులే విస్తుపోతున్నారు. తనతో విడాకులు తీసుకుని మరో వ్యక్తితో సంతోషంగా ఉందన్న కక్షతోనే సునీతను అంతం చేసినట్లు నిందితుడు అంగీకరించాడు.

హత్య చేయడానికి మహేష్ అత్యంత కిరాతకమైన ప్లాన్ వేశాడు. ఇందుకోసం ఒక ఈ-కామర్స్ యాప్‌లో కొబ్బరి బొండాలు నరికే కత్తితో పాటు, చెట్లను కత్తిరించేందుకు ఉపయోగించే ఎలక్ట్రిక్ చైన్ సా (Electric Chain Saw) కొనుగోలు చేశాడు. నిందితుడు కేవలం కత్తులతోనే కాకుండా, వెంట పెట్రోల్ కూడా తీసుకెళ్లి ఘాతుకానికి పాల్పడ్డాడు.

కెనడా నుంచి కక్ష దాకా.. అసలేం జరిగింది?

2022లో సునీత, మహేష్ వివాహం చేసుకుని కెనడా వెళ్లారు. అయితే పెళ్లయిన ఎనిమిది నెలలకే మనస్పర్థలు రావడంతో సునీత ఇండియాకు తిరిగి వచ్చి మహారాష్ట్రలోని బ్రహ్మపురి పోలీసు స్టేషన్‌లో వేధింపుల కేసు పెట్టింది.

సునీత పెట్టిన కేసు కారణంగా మహేష్‌పై లుక్ అవుట్ నోటీసులు జారీ అయ్యాయి. దీంతో అతడు కెనడా నుంచి ఇండియాకు రావాల్సి వచ్చింది. కేసులు ఉండటంతో తిరిగి కెనడా వెళ్లేందుకు చేసిన ప్రయత్నాలు విఫలమై, వీసా రిజెక్ట్ అయ్యింది. 2024లో వీరిద్దరూ విడాకులు తీసుకోగా, 2025లో సునీత సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఉడుకుల శ్రీనాథ్‌ను ప్రేమించి రెండో వివాహం చేసుకుంది.

తమ విడాకులకు సునీతనే కారణమని, ఆమె వల్ల తన కెరీర్ నాశనమైందని భావించిన మహేష్ ఆమెపై కక్ష పెంచుకున్నాడు. సునీత తన రెండో భర్తతో సంతోషంగా ఉండటం చూడలేకపోయాడు. సునీత కదలికలపై సుమారు నెల రోజుల పాటు రెక్కీ నిర్వహించిన మహేష్, అదను చూసి కిరాతకంగా హత్య చేశాడు. ప్రస్తుతం పోలీసులు నిందితుడిని రిమాండ్‌కు తరలించేందుకు సిద్ధమవుతున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story