Nizamabad: నిజామాబాద్ జిల్లాలో వింత ఆచారం.. అక్కడ దొంగలకూ గౌరవం!

Nizamabad: దొంగతనం చేయడం నేరం.. దొంగలను శిక్షించడం ధర్మం. కానీ, నిజామాబాద్ జిల్లా జక్రాన్‌పల్లి మండలం అర్గుల్ గ్రామంలో మాత్రం దొంగతనం ఒక పవిత్రమైన ఆచారంగా సాగుతోంది.

Arun Chilukuri
Published on: 6 Feb 2026 2:47 PM IST
Nizamabad:  నిజామాబాద్ జిల్లాలో వింత ఆచారం.. అక్కడ దొంగలకూ గౌరవం!
X

Nizamabad: దొంగతనం చేయడం నేరం.. దొంగలను శిక్షించడం ధర్మం. కానీ, నిజామాబాద్ జిల్లా జక్రాన్‌పల్లి మండలం అర్గుల్ గ్రామంలో మాత్రం దొంగతనం ఒక పవిత్రమైన ఆచారంగా సాగుతోంది. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి 98వ వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా నిర్వహించే 'దొంగల దోపిడీ మహోత్సవం' భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది. 1928 నుండి అంటే సుమారు వందేళ్లుగా ఈ వింత సంప్రదాయం ఇక్కడ కొనసాగుతోంది.

ఏమిటీ 'దొంగల దోపిడీ'?

ఈ ఉత్సవం అత్యంత ఆసక్తికరంగా సాగుతుంది. ముందుగా గ్రామంలోని చిన్నారులు 'దొంగల' అవతారం ఎత్తుతారు. స్వామివారికి సంబంధించిన వస్తువులు, ఆభరణాలను చిన్నారులు దొంగిలించి, గ్రామంలోని ఆంజనేయ స్వామి ఆలయం వద్దకు వెళ్లి దాక్కుంటారు. గ్రామ పెద్దలు, ప్రజలు డప్పు వాయిద్యాలతో వెళ్లి ఆ దొంగలను వెతికి పట్టుకుంటారు. ఆచారం ప్రకారం వారిని తాళ్లతో బంధించి, ఊరేగింపుగా లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి తీసుకువస్తారు.

ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేయించిన అనంతరం, చిన్నారులు స్వామివారి ముందు నిలబడి "తప్పు అయిపోయింది స్వామి.. మమ్మల్ని క్షమించు, ఇకపై దొంగతనం చేయం" అని వేడుకుంటారు. అనంతరం దొంగిలించిన సొత్తును స్వామివారికి అప్పగిస్తారు.

నమ్మకం ఏమిటి?

తాతల నాటి నుండి వస్తున్న ఈ ఆచారం వెనుక ఒక బలమైన నమ్మకం ఉందని గ్రామస్థులు చెబుతున్నారు. ఈ విధంగా దొంగల దోపిడీ ఉత్సవం నిర్వహించడం వల్ల గ్రామంలో ఎవరికీ దొంగల భయం ఉండదని, అందరూ క్షేమంగా ఉంటారని నమ్ముతారు. చిన్నతనంలోనే తప్పు చేస్తే శిక్ష తప్పదని, దేవుడు చూస్తుంటాడనే భావన పిల్లల్లో కలిగించడం వల్ల వారు చెడు మార్గాల వైపు వెళ్లరని పురోహితులు వివరిస్తున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story