కొత్త దారి అన్వేషణలో తుమ్మల?

Tummala Nageswara Rao TRS
x
కొత్త దారి అన్వేషణలో తుమ్మల?
Highlights

ఎన్టీఆర్‌, చంద్రబాబు హయాంలో మంత్రిగా ఆయన ఒక వెలుగు వెలిగారు. గులాబీ దండులోనూ అదృష్టం వరించి, అమాత్యుడయ్యారు. కానీ ఎప్పుడు...ఎవరికి బ్యాడ్‌ టైం అటాక్‌...

ఎన్టీఆర్‌, చంద్రబాబు హయాంలో మంత్రిగా ఆయన ఒక వెలుగు వెలిగారు. గులాబీ దండులోనూ అదృష్టం వరించి, అమాత్యుడయ్యారు. కానీ ఎప్పుడు...ఎవరికి బ్యాడ్‌ టైం అటాక్‌ చేస్తుందో తెలీదన్నట్టుగా, ఆ‍యన జాతకంలో శని ఎంటరయ్యాడు. ప్రత్యర్థులతో ఒక ఆట ఆడుకున్న ఆయనతోనే, శని ఒలింపిక్‌ గేమ్స్ ఆడుతున్నాడు. శనిని ఎలాగైనా తప్పించుకోవాలని తపిస్తున్న ఆ‍యన, ఇక ఇలాగైతే కాదు, మరో గ్రహానికి పెట్టేబేడా సర్దుకోవాలని తెగ ఆలోచిస్తున్నారట.

కాకలు తీరిన నేత ఇప్పుడెక్కడ? కారులో ఉండలేక ఉక్కిరిబిక్కిరి అవుతున్నారా? ఉండలేక, పోలేక సతమతమవుతున్నారా? రెండోసారి పవర్‌లోకి వచ్చినా ఎలాంటి పదవీలేక అల్లాడిపోతున్నారా?

తుమ్మల నాగేశ్వర రావు. ఖమ్మం జిల్లాలో తిరుగులేని నేతగా పేరు తెచ్చుకున్న లీడర్. ఎన్టీఆర్‌ హయాం నుంచి చంద్రబాబు వరకు ఎదురేలేని నాయకుడిగా చక్రంతిప్పారు. అంతేకాదు, పరిస్థితులను బట్టి పావులు కదిపి, అదృష్టంకొద్దీ గులాబీ దళంలో మంత్రి అయ్యారు. నోటి మాటతో, కంటి చూపుతో శాసిస్తూ, చెలరేగిపోవాలనుకునే తుమ్మలకు, 2018 నుంచి బ్యాడ్‌టైం మొదలైంది. మంత్రిగా వుండి కూడా, గత అసెంబ్లీ ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోవడంతో పరపతి దెబ్బతింది. తాను పెంచిపోషించిన గ్రూపు రాజకీయాలనే తనను బలి తీసుకున్నాయని, ఇప్పటికీ తెగ బాధపడుతుంటారట తుమ్మల.

ఉద్యమ సమయంలో పార్టీకి పెద్దగా పట్టులేని ఖమ్మం జిల్లాలో సీనియర్ నేతగా గుర్తింపు ఉన్న తుమ్మల నాగేశ్వరరావు, 2014లో ఓటమి చెందినా తన అనుభవంతో గులాబీ పార్టీలో చేరి మంత్రి పదవి దక్కించుకున్నారు. ఖమ్మంలో ఎలాగైనా ఖాతా తెరవాలని భావించిన కేసీఆర్, సామాజికవర్గం పరంగా, రాజకీయంగా తుమ్మలకు వున్న పట్టును చూసి, గులాబీ కండువా కప్పి, మంత్రివర్గంలోకి తీసుకున్నారు. నాలుగేళ్లు ఖమ్మం జిల్లా రాజకీయాలను శాసించారు తుమ్మల. 2018 ఎన్నికల్లో మరోసారి ఓటమి చెందడం, పాలేరు నియోజకవర్గం నుంచి విజయం సాధించిన కాంగ్రెస్ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి కారెక్కడంతో తుమ్మల రాజకీయ భవితవ్యం అయోమయంగా మారిందన్న టాక్ మొదలైంది.

ఖమ్మం జిల్లాలో టీఆర్ఎస్ ఒక్క సీటే గెలిచినప్పటికీ తరువాత ఇతర పార్టీల ఎమ్మెల్యేల చేరికతో బలపడింది. ఆ బలం ఎంపీ సీటు గెలవడానికి ఉపయోగపడింది. పార్టీలో సీనియర్ నేతగా ఉన్న తుమ్మల, అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ జిల్లాలో ప‌ట్టు నిలుపుకునే ప్రయత్నం చేస్తున్నారు. దశాబ్దాల రాజకీయ అనుభవం, మాజీ మంత్రి, జిల్లాలో సీనియర్ నేతగా మంచి పట్టు, తనున్న పార్టీ అధికారంలో ఉండటం ఆయనకు కలిసొచ్చే అంశాలే అయినా, ప్రస్తుతం ఏ పదవీ లేకపోవడంతో తుమ్మల అసహనంగా ఉన్నట్లు తెలుస్తోంది.

మంత్రివర్గ విస్తరణలో తుమ్మలకు మళ్లీ మంత్రి పదవి ఇచ్చి ఎమ్మెల్సీని చేస్తారని ఆయన అనుచరులు గట్టి నమ్మకమే పెట్టుకున్నారు కానీ, కేసీఆర్ మాత్రం ఖమ్మం జిల్లాలో కారు గుర్తుపై గెలిచిన ఏకైక ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ కుమార్ కి మంత్రిగా అవకాశమిచ్చారు. దీంతో తుమ్మల వర్గం తీవ్ర అసంతృప్తితో రగిలిపోతోందట.

నిన్నటి వరకు పాలేరు నియోజకవర్గంలో తుమ్మలదే హవా. కానీ ఓటమితో రివర్సయ్యింది. అయినా ఆధిపత్యం కోసం రగిలిపోతున్నారు తుమ్మల. అటు పట్టు కోసం ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి పావులు కదుపుతున్నారు. దీంతో రెండు వర్గాల మధ్య కోల్డ్‌వార్‌ తీవ్రమవుతోంది. పార్టీ సభ్యత్వ నమోదు సందర్భంగా మొదలైన ముసలం, మొన్న నియోజకవర్గంలో ప్రకటించిన పార్టీ కమిటీలు, అనుబంధ కమిటీలు వర్గపోరుకు మరింత ఆజ్యం పోశాయి. ఎంతో అనుభవమున్న తుమ్మలకి రాజ్యసభ సీటు ఇస్తామని అధిష్టానం హామీ ఇచ్చినట్లు జిల్లాలో ప్రచారం జరుగుతోంది. ఇవన్నీ పుకార్లే నంటూ కొట్టిపారేస్తున్న ముఖ్య అనుచరులు మాత్రం, తుమ్మలకు పార్టీ మారాలని సైతం సూచిస్తున్నారట.

ఇప్పటికే తుమ్మల వియ్యంకుడు గరికపాటి రామ్మోహన్ బీజేపీలో చేరి తెలంగాణా బిజెపి రాజకీయాల్లో క్రీయాశీలకంగా మారడంతో ఆయన ద్వారా సంప్రదింపులు జరిపి బీజేపీలో చేరే అవకాశముందని కూడా వార్తలొస్తున్నాయి. ఇవన్నీ గాలి కబుర్లేనంటూ తుమ్మల కొట్టిపారేస్తున్నా, యుద్దం ముందు ప్రశాంత వాతావరణంలా పరిస్థితులు కనిపిస్తున్నాయని రాజకీయ విశ్లేషకులంటున్నారు. మరి తుమ్మల టిఆర్ఎస్‌లోనే వుంటారా లేదంటే పార్టీ మారతారా అన్నది కాలమే సమాధానం చెప్పాలి.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories