కమలానికి గులాబీ ఆకర్ష్ మంత్రం.. ఎంపీ అర్వింద్ దూకుడుకు చెక్ పెట్టడమే లక్ష్యమా?

కమలానికి గులాబీ ఆకర్ష్ మంత్రం.. ఎంపీ అర్వింద్ దూకుడుకు చెక్ పెట్టడమే లక్ష్యమా?
x
Highlights

ఆ జిల్లాలో కమలం దూకుడుకు చెక్ పెట్టేందుకు అధికార పార్టీ వ్యూహం సిద్దం చేసిందా..? ఆ కార్పొరేషన్ తొలి సమావేశంలోపు మరింత బలం పెంచుకునేందుకు గులాబీ పార్టీ...

ఆ జిల్లాలో కమలం దూకుడుకు చెక్ పెట్టేందుకు అధికార పార్టీ వ్యూహం సిద్దం చేసిందా..? ఆ కార్పొరేషన్ తొలి సమావేశంలోపు మరింత బలం పెంచుకునేందుకు గులాబీ పార్టీ ఆపరేషన్ ఆకర్ష్ కు పదును పెడుతుందా..? గులాబీ గాలానికి కమలం కార్పొరేటర్లు చిక్కుతారా..? అసలు కమలం పార్టీని గులాబీ నేతలు ఎందుకు టార్గెట్ చేశారు? కార్పొరేషన్ లో బలంగా ఉన్న కమల రెక్కలు ఒక్కొక్కటీ తెగిపోవడం ఖాయమా?

నిజామాబాద్ కార్పొరేషన్ ఎన్నికల్లో అధికార పార్టీకి చావుతప్పి కన్ను లొట్టపోయిన పరిస్ధితి ఎదురైంది. రాష్ట్రవ్యాప్తంగా మంచి మెజార్టీతో మున్సిపాలిటీలపై గులాబీ జెండా రెపరెపలాడగా నిజామాబాద్ నగర పాలక సంస్ధ లో మాత్రం ఆ పార్టీ మూడో స్ధానానికి పరిమితమైంది. 28 డివిజన్లలో గెలిచి బీజేపీ మేయర్ పీఠానికి రెండు అడుగుల దూరంలో ఆగిపోయింది. ఎం.ఐ.ఎం. కాంగ్రెస్ కార్పొరేటర్ల సహకారంతో గులాబీ పార్టీ మేయర్ పీఠాన్ని కైవసం చేసుకుంది. ఇంత వరకు బాగానే ఉన్నా అసలు సమస్య ఇక్కడే వచ్చింది. కేవలం 13 మంది కార్పొరేటర్ల బలంతో మేయర్ పీఠంపై గులాబీ జెండా ఎగురవేసిన అధికార పార్టీ నేతలు ఇప్పుడు కమలం పార్టీ కార్పొరేటర్లపై గురి పెట్టారట. అదే ఇందూరు బీజేపీలో కలకలం రేపుతోంది.

కనీసం 10 మందిని తమ పార్టీలో చేర్చుకోవాలనే స్కెచ్ వేశారనే ప్రచారం జోరుగా నడుస్తోంది. పాలకవర్గం తొలి కౌన్సిల్ సమావేశంలోపు 10 మంది బీజేపీ కార్పొరేటర్లకు గులాబీ కండువా కప్పేయాలనే లక్ష్యంతో, కొందరికి టచ్‌లోకి వెళ్లారనే టాక్ వినిపిస్తోంది. టీఆర్‌ఎస్‌లోకి వెళ్లేందుకు కొందరు సుముఖం వ్యక్తం చేయగా మరికొందరు నసేమిరా అన్నారట. ఓ మహిళా కార్పొరేటర్ ఏకంగా ఓ అడుగు ముందుకేసి పార్టీలో సముచిత స్ధానం కల్పిస్తే కండువా కప్పుకునేందుకు సై అన్నారట. ఇలా కొందరికి పదవుల ఎర మరికొందరికి డబ్బులు, పనుల ఎరవేసి కండువా కప్పేసేందుకు గులాబీ నేతలు ప్లాన్ రెడీ చేశారన్న చర్చ జరుగుతోంది.

నిజామాబాద్ కార్పొరేషన్ ఎన్నికల ఫలితాల పట్టికలో బీజేపీ అగ్రస్ధానంలో ఉంది. 60 డివిజన్లకు గాను 28 డివిజన్లలో బీజేపీ కార్పొరేటర్లు విజయం సాధించారు. పార్లమెంట్ ఎన్నికల్లో ఎంపీ అర్వింద్ విజయం సాధించడం, కార్పొరేషన్ ఎన్నికల్లో అర్వింద్ ఒంటి చేత్తో 28 మంది కార్పొరేటర్లను గెలిపించడంతో ఆయన అధికార పార్టీపై దూకుడు పెంచారట. ఒక ఎంపీ ఏకంగా సీఎం కేసీఆర్‌ను టార్గెట్ చేస్తుండటం, అధికార పార్టీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారట. ఇదే విషయంలో సీఎం కేసీఆర్ సైతం జిల్లా ఎమ్మెల్యేలకు తలంటారనే టాక్ నడుస్తోంది. ఎంపీ అర్వింద్ దూకుడుకు బ్రేకులు వేయాలని ఆదేశించారట. దీంతో స్పీడు పెంచిన గులాబీ ఎమ్మెల్యేలు కొందరు అర్వింద్‌పై కౌంటర్ అటాక్ చేస్తుంటే, ఇంకొందరు కార్పొరేషన్‌లో ఆ పార్టీని వీక్ చేయాలనే స్కెచ్ వేశారట. సుమారు 10 మంది కార్పొరేటర్లను గులాబీ పార్టీలో చేర్చుకోవాలని చర్చలు జరిపారట.

ఇంకా జరుపుతునే ఉన్నారట. ఐతే గెలిచిన కార్పొరేటర్లలో మెజార్టీ శాతం ఎంపీకి నమ్మకస్తులు కావడంతో అదంతా ఉత్తుత్తి ప్రచారమని, కమలం పార్టీ నేతలు కొట్టిపారేస్తున్నాంటే గులాబీ నేతలు మాత్రం ఏమో గుర్రం ఎగరావచ్చు అనే లాజిక్ అనేస్తున్నారట.

ఎంపీ అర్వింద్ దూకడుకు చెక్ పెట్టేందుకు అధికార పార్టీ నేతలు రచిస్తున్న వ్యూహాం ఫలిస్తుందా అర్వింద్ గెలిపించుకున్న కార్పొరేటర్లు చేజారే పరిస్ధితి ఉంటుందా టార్గెట్ 10 పై జరుగుతున్న ప్రచారంలో నిజమెంతో తెలియాలంటే మరికొద్ది రోజులు వేచి చూడాల్సిందే.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories