గులాబీలో కుంపట్లు రాజేస్తున్న కమిటీల గోల ఏంటి?

గులాబీలో కుంపట్లు రాజేస్తున్న కమిటీల గోల ఏంటి?
x
Highlights

టీఆర్ఎస్‌ కమిటీల లేటు, కుంపట్లు రాజేస్తోంది. ఎవరు మాట్లాడాలో అధికారిక ముద్ర లేక, మౌనాన్ని ఆశ్రయిస్తున్నారు నేతలు. త్వరలో కమిటీల జాబితా విడుదల చేస్తే,...

టీఆర్ఎస్‌ కమిటీల లేటు, కుంపట్లు రాజేస్తోంది. ఎవరు మాట్లాడాలో అధికారిక ముద్ర లేక, మౌనాన్ని ఆశ్రయిస్తున్నారు నేతలు. త్వరలో కమిటీల జాబితా విడుదల చేస్తే, ఇక అన్ని వేదికల మీదా దుమ్మురేపుతామని గులాబీ నాయకులంటున్నారు. ఇంతకీ పార్టీల కమిటీల ప్రకటన ఎందుకు లేట్‌ అవుతోంది దీని వెనక టీఆర్ఎస్‌ బాస్‌ మదిలో వ్యూహముందా.?

అధికార టీఆర్ఎస్ పార్టీ నేతల్లో కన్‌ఫ్యూజన్‌ కాక రేపుతోంది. నిత్యం పార్టీ కార్యక్రమాలతో బిజీబిజీగా ఉండే నాయకులు, ఇప్పుడేం చేయాలో అర్థంకాక, ఇంట్లో కాలయాపన చేస్తున్నారు. దానికంతకటికీ కారణం కమిటీల నియామకంలో కాలయాపన అట. గతంలో గులాబీ పార్టీ సభ్యత్వ నమోదు పూర్తి అవ్వగానే, వెంటనే పార్టీ రాష్ట్రస్థాయి, జిల్లా స్థాయి కమిటీలను నియమించుకునేది. రాష్ట్రస్థాయి నేతలు హైదరాబాద్ కేంద్రంగా పార్టీ కార్యక్రమాల్లో నిమగ్నమయ్యేవారు. ఇక పార్టీ అధికార ప్రతినిధులు నిత్యం టీవి డిబేట్లతో పార్టీ వాయిస్‌ని గట్టిగా వినిపించేవారు. ప్రత్యర్థి పార్టీల నేతలు వేసే కౌంటర్లకి దిమ్మ తిరిగే సమాధానాలు ఇచ్చేవారు. కానీ ఇఫ్పుడు టీవీల్లో గులాబీ నేతల వాయిస్ వినిపించడం లేదు.

పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభించిన పార్టీ అధినేత కేసీఆర్, అదేరోజు పార్టీ కమిటీలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. అధికార ప్రతినిధులు ఎవరూ కూడా అదేరోజు నుంచి టీవీ చర్చా కార్యక్రమాలకు వెళ్లకూడదు అనే ఆదేశాలు జారీ చేశారు. దీంతో అధికార ప్రతినిధులు ఎవరూ కూడా పార్టీ కార్యక్రమాలకు, టీవీ చర్చలకు హాజరుకావడంలేదు. కేవలం టీవీ చర్చలకు కాంగ్రెస్, బిజేపీ, సీపీఐ, సీపీఎం పార్టీలకు చెందిన నేతలు మాత్రమే అటెండ్ అవుతున్నారు.

నిత్యం పార్టీ కార్యక్రమాలు, టీవీ చర్చలతో పార్టీ కోసం పని చేసే నేతలు, ఇప్పుడు ఎలాంటి పనుల్లేక ఖాళీగా ఉంటూ కాలయాపన చేస్తున్నారు. పార్టీ ఎప్పుడు అధికార ప్రతినిధుల లిస్ట్ విడుదల చేస్తుందా అని ఎదురుచూస్తున్నారు. అసలు వచ్చే లిస్టులో తమ పేర్లు ఉంటాయా అనే ఆందోళన గులాబీ నేతల్లో కనిపిస్తోంది. పార్టీ కమిటీల ప్రకటన కోసం నేతలు ఆశగా వెయిట్ చేస్తున్నారు. లిస్ట్ విడుదల ఎప్పుడు ఉంటుందా అని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను, కలిసిన ప్రతిసారి అడుగుతున్నారు. త్వరలోనే కమిటీలను ప్రకటిస్తామని కేటీఆర్ హమీనిస్తుండటంతో అప్పటికప్పుడు కాస్త రిలీఫ్ ఫీలవుతున్నా, మళ్లీ నిరీక్షణే తప్పడం లేదంటున్నారు.

పార్టీ కమిటీలకు సంబంధించిన లిస్ట్‌ను పార్టీ అధినేతకి ఇప్పటికే పంపించినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఆ లిస్ట్‌లో ఉన్న పేర్లు, కేసీఆర్ పరిశీలనలో ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అతి త్వరలోనే కమిటీల ప్రకటన ఉంటుందని కేటీఆర్ సన్నిహితులు చెబుతున్నా, పార్టీ నేతలు మాత్రం నమ్మడంలేదు. పురపాలక ఎన్నికలు జరిగే వరకు తమ పేర్లు ప్రకటించే చాన్న్ లేదంటున్నారు. మొత్తానికి ప్రతిపక్ష పార్టీల ఎత్తులకు పైఎత్తు వేసే లక్ష్యంతోనే కమిటీలపై కేసీఆర్ కాలయాపన చేస్తున్నారని చర్చించుకుంటున్నారు. మొత్తానికి కమిటీల్లేక, పార్టీ తరపున అధికారికంగా వాదించే అవకాశం లేక, నేతలు ఇంటికే పరిమితమవుతున్నారు. నిజంగా మున్సిపల్ ఎన్నికల తర్వాత కమిటీలను ప్రకటిస్తారా లేదంటే అంతకుముందే జాబితా విడుదల చేస్తారా అన్నది వేచి చూడాలి.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories