గులాబీకి శిక్షల చిక్కులు.. భయం భయంలో నేతలు..

TRS Leaders Scared of Cases
x

గులాబీకి శిక్షల చిక్కులు.. భయం భయంలో నేతలు..

Highlights

TRS Leaders: గులాబీ నేతలను కేసులు వెంటాడుతుంటే శిక్షలు వేధిస్తున్నాయా?

TRS Leaders: గులాబీ నేతలను కేసులు వెంటాడుతుంటే శిక్షలు వేధిస్తున్నాయా? ఎన్నికల సమయంలో నమోదైనవి శిక్షలు పడుతుంటే ఇతరులు వేసిన కొన్ని కేసులు వారి మెడకు చుట్టుకుంటున్నాయా? ఇప్పటికే ఇద్దరు నేతలకు జైలుశిక్ష, జరిమానాలు పడగా ఇప్పుడు మరో ఎంపీపై కేసు నమోదు కావడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారుతోందా? అయితే ఈ కేసులు శిక్షలు, ఎవరి మెడకు ఎప్పుడు ఎలా చుట్టుకుంటుందోనని అధికార పార్టీ నేతలు ఆందోళన చెందుతున్నారా? ఇంతకీ గులాబీ నేతలకు గుబులు పుట్టిస్తున్న ఆ అంశాలేంటి?

మొన్నటికి మొన్న మాజీ మంత్రి దానం నాగేందర్ ఓ వ్యక్తిని బెదిరించిన కేసులో ఆరునెలల జైలు శిక్ష, వెయ్యి రూపాయ‌ల‌ జరిమానా విధించింది ప్రజాప్రతినిధుల కోర్టు. దీంతో ఒక్కసారిగా ప్రజా ప్రతినిధలంతా అలెర్టు అయ్యారు. 2013లో బంజారాహిల్స్‌లో నమోదైన ఈ కేసులో దానం నాగేందర్‌ను దోషిగా తేల్చింది కోర్టు. ఓ వ్యక్తిపై దాడి చేసి గాయపరిచార‌నే ఆరోపణలు రుజువు కావడంతో ఆయనకు జైలుశిక్ష తప్పలేదు. దీనిపై అప్పీలుకు వెళ్లేందుకు అనుమతించిన కోర్టు శిక్ష అమలను నెల రోజులు వాయిదా వేసింది. దీంతో దానం ఊపిరి పీల్చుకున్నారు.

తాజాగా ఎంపీ మాలోతు కవితపై కూడా ఆరునెలల జైలుశిక్ష, పదివేల రూపాయల జరిమానా విధించింది ప్రజాప్రతినిధుల కోర్టు. అయితే ఎంపీ కవితపై 2019 లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో ఓటర్లకు డబ్బులు పంచారన్న ఆరోపణలపై నమోదైన కేసులో కోర్టు ఈ తీర్పునిచ్చింది. కోర్టు విధించిన జరిమానాను కవిత చెల్లించగా న్యాయస్థానం ఆమెకు బెయిల్ మంజూరు చేసింది.

ఇక వరంగల్‌కు చెందిన రాజ్యసభ సభ్యుడు బండ ప్రకాశ్‌పై కూడా కేసు నమోదు అయింది. ఎంపీ బండ ప్రకాశ్‌ ఆదాయపు పన్ను ఎగవేత ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఆదాయపు పన్నులో చీటింగ్ చేశారంటూ ఓ వ్యక్తి కోర్టుకెక్కడంతో విచారించిన కోర్టు ఆయనపై చీటింగ్ కేసు నమోదు చేయాలని పోలీసులను ఆదేశించింది. దీంతో ఎంపీతో పాటు మరో ఇద్దరిపై వివిధ సెక్షన్ల కింద హన్మకొండ సుబేదారి పోలీసులు కేసు నమోదు చేశారు. వరంగల్ అర్బన్ జిల్లాకు చెందిన బండ ప్రకాశ్‌ నగరంలో గల అల్లూరి ట్రస్ట్, అల్లూరి ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌కు ఆయన సెక్రటరీగా ఉండేవారు. అయితే, 2016-17, 2017-18 ఆర్థిక సంవత్సరాల్లో ఈ ట్రస్ట్ ఆదాయపన్ను చెల్లింపుల్లో అవకతవకలకు పాల్పడిడంతో పాటు నిధుల దుర్వినియోగం అయినట్టు ట్రస్ట్‌కు చెందిన వ్యక్తి కోర్టుకెక్కాడు. పిటిషన్‌‌పై విచారణ జరిపిన న్యాయస్థానం బండా ప్రకాష్‌తో పాటు సంస్థలో పనిచేసే ఆడిటర్లు అత్తలూరి సత్యనారాయణ, అత్తలూరి వంశీధర్‌‌లపై కూడా కేసు నమోదు చేసింది.

ఏమైనా మొత్తానికి గులాబీ నేతలు వరసుగా కోర్టులు శిక్షలు, జరిమానాలు, కేసులు ఎదుర్కొంటుండంతో క్యాడర్‌లో కాస్త కంగారు మొదలైందట. అధిష్టానానికి కూడా ఇబ్బందికరంగా మారిందట. వీరందరికీ రెండేళ్లకు మించి శిక్ష పడితే ప్రజాప్రతినిదులపై అనర్హత వేటు పడుతుంది. ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హులవుతారు. కానీ ఎవరికి కూడా ఎన్నికల్లో అనర్హత పడేంతటి కేసులు కాకపోవడంతో ఊపిరి పీల్చుకుంటున్నారు. కాకపోతే ఎటొచ్చి ఇబ్బంది సొంత పార్టీ వాళ్లకు కాగా, ప్రతిపక్షాలకు అవకాశం ఇచ్చినట్టేనన్న చర్చ పార్టీలో జరుగుతోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories