ఇంకా ఖాళీ కాలేదు అయినా ఆ సీటుపై కన్నేసిన ఇద్దరు నేతలెవరు?

ఇంకా ఖాళీ కాలేదు అయినా ఆ సీటుపై కన్నేసిన ఇద్దరు నేతలెవరు?
x
Highlights

ఆ ఇద్దరు ఇప్పుడు ఓ సీటుపై కన్నేశారు. అది ఖాళీ అయితే తమకు అవకాశం దక్కుతుందని గంపెడాశలతో ఎదురు చూస్తున్నారు. ఐతే ఆ సీటు ఖాళీ కాదు వాళ్ల ఆశలు నెరవేరదు...

ఆ ఇద్దరు ఇప్పుడు ఓ సీటుపై కన్నేశారు. అది ఖాళీ అయితే తమకు అవకాశం దక్కుతుందని గంపెడాశలతో ఎదురు చూస్తున్నారు. ఐతే ఆ సీటు ఖాళీ కాదు వాళ్ల ఆశలు నెరవేరదు అన్నట్లుగా మారింది అక్కడి పరిస్ధితి. ఇందూరు నేతలను ఊరిస్తున్న ఆ సీటేంటి.....? ఎవరా ఇద్దరు....!

నిజామాబాద్ జిల్లా స్ధానిక సంస్ధల కోటాలో గెలిచిన ఎమ్మెల్సీ భూపతి రెడ్డి రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డితో విబేధాలతో టీఆర్ఎస్ అసంతృప్తి నేతగా ముద్ర వేసుకున్నారు. గులాబీ నేతలతో ఉన్న విబేధాలతో కారు దిగి హస్తం గూటికి చేరారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బాజిరెడ్డిపై కాంగ్రెస్ అభ్యర్ధిగా గట్టి పోటినిచ్చారు. టీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్సీ పదవి పొంది కాంగ్రెస్ గూటికి చేరిన భూపతి రెడ్డిని డిస్ క్వాలిఫై చేయాలని గులాబీ నేతలు ఫిర్యాదు చేశారు. దీంతో భూపతి రెడ్డిపై అనర్హత వేటు పడింది. ఐతే భూపతిరెడ్డి న్యాయం కోసం సుప్రీం కోర్టుకు అప్పీల్ కు వెళ్లారు. ఐతే ఆ తీర్పు ఎలా ఉంటుందో తెలియదు, కానీ ఆయన సీటు ఖాళీ కావడం ఖాయమన్న చర్చ జరుగుతోంది.

ఖాళీ అయ్యే ఆ సీటు కోసం, జిల్లాకు చెందిన ఇద్దరు నేతలు ఆశలు పెట్టుకున్నారట. అది‌ ఖాళీ అయితే ఆ అవకాశం తమకే దక్కుతుందని ఎవరికి వారే తమ అనుచరులకు చెప్పుకుంటున్నారట ఆ ఇద్దరు నేతలు. మొదటి వరుసలో మాజీ స్పీకర్ సురేష్ రెడ్డి ఉంటే, రెండో వరుసలో టీడీపీ నేత మాజీ ఎమ్మెల్సీ అరికెల నర్సారెడ్డి రేసులో ఉన్నారట. ప్రస్తుతం వీళ్లిద్దరూ గులాబీ పార్టీలో ఉండటంతో ఎవరికి వారే ఖాళీ అయ్యే ఎమ్మెల్సీ సీటు కోసం ఖర్చీఫ్ వేశారట. ఇప్పటికే సురేష్ రెడ్డి కన్నతల్లి లాంటి కాంగ్రెస్‌ను వదిలి, గులాబీ గూటికి ఎందుకొచ్చానని తన ఆత్మీయుల వద్ద తెగ ఫీలవుతున్నారట. ఒకవేళ సీఎం కేసీఆర్, సురేష్ రెడ్డికి ఎమ్మెల్సీగా అవకాశం ఇస్తే కేబినెట్ విస్తరణకు లైన్ క్లియర్ చేసుకోవచ్చనే ఆలోచనలో ఉన్నారట. దీంతో తన మనసులో మాటను అదిష్టానానికి కూడా ఇప్పటికే చెప్పిన ఆయన, ఈసారి తప్పకుండా అవకాశం వస్తుందని ఆశిస్తున్నారట.

ఇక ఇదే ఆశల పల్లకిలో ఊగుతున్నారు, మరో నేత మాజీ ఎమ్మెల్సీ అరికెల నర్సారెడ్డి. ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌ను వీడి కారెక్కారు. ఎమ్మెల్సీ పదవి హామితో గులాబీ గూటికి చేరారనే ప్రచారం అప్పట్లో జరిగింది. భూపతి రెడ్డి సీటు ఖాళీ అయితే, అది తనకు వస్తుందనే ధీమాతో ఉన్నారట ఆ మాజీ ఎమ్మెల్సీ. గతంలో ఎమ్మెల్సీగా పని చేసిన అనుభవం ఉండటంతో, తనకే ఆ పదవి వస్తుందన్న ఆశతో ఎదురుచూస్తున్నారట అరికెల. ఈ విషయంలో పార్టీ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్‌తో పలుమార్లు భేటి అయ్యారట. ఆయన నుంచి స్పష్టమైన హామి రాకపోయినప్పటికీ, తన అనుచరులకు ధీమాగా చెప్పుకుంటున్నారట.

ఖాళీ అయ్యే ఎమ్మెల్సీ సీటుపై ఆశలు పెట్టుకున్న ఆ ఇద్దరి నేతల కల నెరవేరాలంటే సుప్రీంకోర్టు తీర్పు వచ్చే వరకు వేచి చూడాల్సిందే. కానీ జిల్లాలో మాత్రం ఇప్పటికే, ఆ ఆ సీటు తనదే అంటూ, ఇద్దరు నేతలు పోటీ పడుతున్నారు. దీంతో ఆ సీటు ఇప్పుడు హాట్ కేకుగా మారింది. ఎవరిని వరిస్తుందో తెలియాలంటే మరికొద్ది రోజులు వేచి చూడాల్సిందే.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories