Top
logo

త్వరలో మెజారిటీ ఎమ్మెల్యేలకు పదవుల పందేరం

త్వరలో మెజారిటీ ఎమ్మెల్యేలకు పదవుల పందేరం
X
కేసీఆర్
Highlights

టీఆర్ఎస్‌లో ఇప్పుడు ఒకటే చర్చ. ఆ బృహత్తర కార్యక్రమం, మూడాలకు ముందా సంక్రాంతి తర్వాతనా డిసెంబర్ 13 తర్వాత...

టీఆర్ఎస్‌లో ఇప్పుడు ఒకటే చర్చ. ఆ బృహత్తర కార్యక్రమం, మూడాలకు ముందా సంక్రాంతి తర్వాతనా డిసెంబర్ 13 తర్వాత మంచిరోజులు లేవ్. ఆలోపే ఆ శుభవార్త వినాలి ఆ పండగ జరగాలని ఎమ్మెల్యేలు ఉత్సాహంతో ఎదురుచూస్తున్నారు. ఇంతకీ డిసెంబర్‌ 13 కంటే ముందే, టీఆర్ఎస్‌‌లో ఏదో జరగబోతోందా మూడాలకు ముందే ముహూర్తం ఫిక్సవుతున్న కార్యక్రమం ఏంటి...? కేసీఆర్ ఎలాంటి తీపికబురు చెబతారని గులాబీ నేతలు ఎదురుచూస్తున్నారు?

నామినేటెడ్ పదవుల భర్తీకి సీఎం కేసీఆర్ కసరత్తు మొదలు పెట్టారు. రైతు సమన్వయ సమితి చైర్మన్ పదవిని ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డికి కట్టబెట్టారు. శాట్స్ చైర్మన్ గా వెంకటేశ్వర్ రెడ్డి పదవి కాలాన్ని పొడిగించారు. మరోవైపు కార్పొరేషన్ చైర్మన్ల నియామకం కోసం ఆర్డీనెన్స్‌ జారీ చేసింది ప్రభుత్వం. ఎమ్మెల్యేలకు ఆయా పదవులను కట్టబెట్టేందుకు అడ్డుగా ఉన్న ఆఫీస్ ఆఫ్ ది ప్రాఫిట్ క్లాజ్ ను ఎత్తేసింది. తద్వారా ఎమ్మెల్యేలను కార్పొరేషన్ చైర్మన్ల పదవుల్లో నియమించేందుకు మార్గం సుగుమమైంది. దీంతో మెజారిటీ పదవులు ఎమ్మెల్యేలకు దక్కుతాయనే చర్చ పార్టీలో ఊపందుకుంది.

మంత్రి వర్గ విస్తరణ సమయంలోనే ఎమ్మెల్యేలకు క్యాబినేట్ ర్యాంక్ పదువులు కట్టబెడతామని కేసీఆర్ హామీ ఇచ్చారు. సీనియర్ ఎమ్మెల్యేలందరికీ మంత్రి పదవులు సాధ్యం కాకపోవడంతో వారికి తగిన న్యాయం చేస్తామని మాట ఇచ్చారు. దీనికి అనుగుణంగా పలువురు సీనియర్లకు కీలక కార్పొరేషన్లకు కట్టబెట్టే యోచనలో కేసీఆర్ ఉన్నారట. డిసెంబర్ 13లోపే పదవుల భర్తీ చేపట్టాలని గులాబీ బాస్ యోచిస్తున్నారట. ఆ తర్వాత మూడాలు మొదలవుతాయి. సంక్రాంతి ముగిసే వరకు మంచి రోజులు లేవు. అందుకే పది రోజుల్లో నామినేటెడ్ నియమాకాలు చేపట్టే యోచనలో ఉన్నారు. దీంతో ప్రాముఖ్యత గత కార్పొరేషన్ పదవుల కోసం సీనియర్ ఎమ్మెల్యేలు ఆశగా ఎదురు చూస్తున్నారట.

ఆర్టీసీ చైర్మన్ పదవి నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌కి దక్కే చాన్స్ ఉందని సమాచారం. రైతు సమన్వయ సమితి చైర్మన్ గా బాజిరెడ్డికి అవకాశం కల్పిస్తారని అంతా భావించినప్పటికీ ఇప్పుడు ఆయన పేరు ఆర్టీసీ చైర్మన్ పదవి పరిశీలనలో ఉంది. ఇక ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పదవి కోసం వర్దన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్ పేరు బలంగా వినిపిస్తోంది. ఎస్టీ కార్పోరేషన్ చైర్మన్ పదవి దేవర కొండ ఎమ్మెల్యే రవీంద్ర నాయక్‌కు దక్కొచ్చని తెలుస్తోంది. మహిళా కమిషన్ లేదా ఉమెన్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్ పర్సన్ పదవి మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవెందర్ రెడ్డిని వరించ వచ్చని సమాచారం. ఇలా సుమారు 30 మంది ఎమ్మెల్యేలకు కార్పొరేషన్ చైర్మన్ల పదవులు దక్కే చాన్స్ ఉంది. ఇక మరో 20 మంది ఎమ్మెల్యేల సేవలను ప్రభుత్వంలో వినియోగించుకునే విధంగా పార్లమెంట్ కార్యదర్శులుగా వారిని నియమిస్తారని తెలుస్తోంది. న్యాయపరమైన చిక్కులు లేకుండా సహాయ మంత్రుల హోదాలో ప్రతి మంత్రికి ఒక సీనియర్ ఎమ్మెల్యే సహాయపడే విధంగా పదవులు ఇస్తారని తెలుస్తోంది. వీరికే కాకుండా పార్టీ సీనియర్లకు తగిన న్యాయం చేసే విధంగా పదవులు కట్టబెడతారని సమాచారం.

అయితే మూడాలు మొదలు కాకముందే నామినేటేడ్ పదవుల భర్తీ ప్రక్రియను పూర్తి చేస్తారని పార్టీలో ప్రచారం సాగుతుండగానే మున్సిపల్ ఎన్నికల తర్వాత పదవులను భర్తీ చేస్తారనే వాదన మరోవైపు వినిపిస్తోంది. మున్సిపల్ ఎన్నికల వేళ, గులాబీ బాస్ కొందరికి పదవులు కట్టబెట్టి మిగతావారిలో అసంత్రుప్తి మిగిల్చే బదులు పుర పోరు ఫలితాలు, నేతల పనితీరు ఆధారంగా నియామకాలు చేస్తారని కొందరు నేతలు అభిప్రాయపడుతున్నారు. దీంతో నియామకాల పర్వం మరో రెండు నెలలు వాయిదా పడే అవకాశాలున్నాయి. అయితే పదవుల పంపకాలు ఎప్పుడున్నా సరే గౌరవ మార్యదాలు, కాబినెట్ ర్యాంక్ ఉన్న కార్పొరేషన్ల పదవులను దక్కించుకోవాలన్ని పట్టుదల మాత్రం గులాబీ నేతల్లో కనిపిస్తోంది.

Web TitleTRS leader pins hopes on nominated posts likely to be given soon
Next Story