సర్కార్‌కు-రాజ్‌భవన్‌కు దూరం పెరుగుతోందా?

సర్కార్‌కు-రాజ్‌భవన్‌కు దూరం పెరుగుతోందా?
x
Highlights

తెలంగాణ సర్కారుకు-రాజ్ భవన్ వర్గాలకు మధ్య దూరం పెరుగుతోందా నాడున్న సఖ్యత నేడు తగ్గుతోందా బీజేపీ రెండో విడత అధికారంలోకి వచ్చిన తర్వాత, గవర్నర్‌ శైలిలో...

తెలంగాణ సర్కారుకు-రాజ్ భవన్ వర్గాలకు మధ్య దూరం పెరుగుతోందా నాడున్న సఖ్యత నేడు తగ్గుతోందా బీజేపీ రెండో విడత అధికారంలోకి వచ్చిన తర్వాత, గవర్నర్‌ శైలిలో మార్పు వచ్చిందన్న భావన టీఆర్ఎస్‌లో పెరుగుతోందా మున్సిపల్‌ బిల్లును తిప్పిపంపడమే అందుకు తొలి నిదర్శనమంటున్న గులాబీ నేతల మాటలు కరెక్టేనా ఇంతకాలం సీఎం కేసీఆర్‌కు అన్ని విషయాల్లో సహకరించిన గవర్నర్, తన పంథా మార్చుకుంటున్నారా ఇప్పుడంతా ఇలాంటి ప్రశ్నల చుట్టే తెలంగాణ రాజకీయాలు చక్కర్లు కొడుతున్నాయి.

సమైక్య రాష్ట్రంలో గవర్నర్‌గా వచ్చిన ఈ.ఎస్.ఎల్. నర్శింహన్, తొమ్మిది సంవత్సరాలుగా రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణకు, ఆంధ్రప్రదేశ్‌కు ఉమ్మడి గవర్నర్‌గా కొనసాగుతున్నారు. దీంతో రెండు రాష్ట్రాల రాజకీయాలపై పూర్తి అవగాహనకు వచ్చారాయన. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత సీఎం కేసీఆర్‌తో అత్యంత సన్నిహింతంగా ఉన్నారు. ప్రతి విషయంలో రాష్ట్ర సర్కారుకు సలహాలు, సూచనలు చేస్తూ, బాసటగా ఉండేవారు. కీలక విషయాల్లో సీఎం కేసీఆర్ కూడా గవర్నర్‌ను సంప్రదించేవారు. దీంతో ఇరువురి మధ్య మంచి సంబంధాలు కొనసాగాయి. అయితే తాజా పరిణామాలు, రాజ్‌భవన్‌కు, టీఆర్ఎస్‌కు దూరం పెరిగిందా అన్న చర్చను లేవనెత్తుతున్నాయి.

తొలిదఫా మోడీ సర్కారుతో సన్నిహింతగా ఉన్నా, కేసీఆర్ సర్కారు విషయంలో కేంద్రం రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్న పరిణామాలు, రాజకీయవర్గాల్లో వాడివేడి చర్చకు దారి తీస్తున్నాయి. మొన్నటి లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ, నాలుగు స్థానాలు గెలవడంతో, ఇక్కడ బలపడే అవకాశాలపై కసరత్తు చేస్తోంది కమలం. సభ్యత్వ నమోదు కోసం ఏకంగా కేంద్ర హోంమంత్రి, బీజేపీ చీఫ్‌ అమిత్‌ షా తెలంగాణకు రావడంతో, రాజకీయ పరిణామాలు మరింత వేడెక్కడం మొదలైంది. ఇక్కడి టీఆర్ఎస్ సర్కారుతో ఢీ అంటే ఢీ అంటోంది బీజేపీ. రాష్ట్రంలో బలపడేందుకు గవర్నర్‌ కార్యాలయాన్ని వాడుకోవడం బీజేపీ ప్రారంభించిందన్నది తెలంగాణ భవన్‌ ఆరోపణ. ఇందుకు తాజా ఉదంతమే నిదర్శనమంటోంది గులాబీదళం.

దీంతో ప్రస్తుతం ఇంతకాలం రాష్ట్రానికి, కేంద్రానికి అనుసంధానకర్తగా, సఖ్యతగా ఉన్న గవర్నర్ తన వ్యూహం మార్చుకున్నట్టు రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది. మున్సిపల్ ఎన్నికల కోసం తెలంగాణ సర్కారు హడావుడిగా తెచ్చిన మున్సిపల్ చట్టంలోని లోపాలను, బీజేపీ రాష్ట్ర నేతలు గవర్నర్‌ను కలిసి, ఫిర్యాదు చేయటం, వెంటనే తన వద్దకు వచ్చిన బిల్లును ఆమోదించకుండా సవరణలకు సూచించడం అంతటా చర్చనీయాంశంగా మారింది.

గవర్నర్‌ నర్శింహన్, తాజా రాజకీయ పరిస్థితుల్లో కేంద్రం కనుసన్నల్లో వ్యవహరిస్తున్నారని మాట్లాడుకుంటున్నారు గులాబీ నేతలు. సుదీర్ఘకాలం కొనసాగిన గవర్నర్, త్వరలో మారుతారని, వెళ్లే ముందు కేసీఆర్ ప్రభుత్వం తెచ్చిన మున్సిపల్ చట్టంపై కొర్రీలు పెట్టి ఆర్డినెన్స్ తెచ్చేలా చేసారంటున్నారు. ఇది ట్రైలరేనని, మున్ముందు మరింత కఠినంగా వ్యవహరించే రాజ్‌భవన్‌ను చూస్తారన్న చర్చ రాజకీయవర్గాల్లో జరుగుతోంది. ఇటు రాష్ట్ర బీజేపీ నేతలు కూడా ప్రతి విషయంలో సర్కారు నిర్ణయాలకు వ్యతిరేకంగా పోరాటాలు చేస్తూ, గులాబీ ప్రభుత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేసే ప్రయత్నం చేస్తున్నారు.

మొత్తానికి గవర్నర్‌ నరసింహన్, మున్సిపల్ బిల్లు ఆమోదించకుండా తిప్పిపంపిన తర్వాత, గవర్నర్ వ్యవహార శైలిలో మార్పువచ్చిందని అంతా చర్చించుకుంటున్నారు. త్వరలో నరసింహన్‌కు కూడా కేంద్రంలో కీలక పదవి వరిస్తుందని, రాష్ట్రానికి కొత్త గవర్నరుగా సీనియర్ బీజేపీ నేతలు వస్తారని, అప్పుడు తెలంగాణ పాలిటిక్స్‌ మరింత రసవత్తరంగా మారబోతున్నాయన్న చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతోంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories