TPCC Issue: టీపీసీసీ చీఫ్ ఎంపికపై కొనసాగుతున్న ఉత్కంఠ

TPCC Issue: టీపీసీసీ చీఫ్ ఎంపికపై కొనసాగుతున్న ఉత్కంఠ
x
Highlights

TPCC Issue: * అనూహ్యంగా తెరపైకి జీవన్ రెడ్డి పేరు * పేరు ప్రకటించడానికి హై కమాండ్ తర్జన భర్జన * టీపీసీసీపై స్వరం మార్చిన రేవంత్ రెడ్డి

గత కొద్దిరోజులుగా టీపీసీసీ చీఫ్ పదవిపై ఎడతెగని చర్చ జరుగుతోంది. అయినా రథసారథిపై ఇంకా సందిగ్ధం కొనసాగుతూనే ఉంది. ఇప్పటివరకు రేసులో రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి పేర్లు బలంగా వినిపించగా అనూహ్యంగా తెరపైకి సీనియర్ నేత, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పేరు వచ్చింది. ఆయన పేరును అధికారికంగా ప్రకటించే టైంలో సీన్‌లోకి జానారెడ్డి వచ్చారు. ఇఫ్పుడు జానారెడ్డి ప్రతిపాదన ప్రాధాన్యం సంతరించుకుంది. దీంతో హై కమాండ్ ఏం చేస్తుందనే ఉత్కంఠ కంటిన్యూ అవుతోంది.

సీనియర్ల వ్యతిరేక స్వరంతో కాంగ్రెస్ హైకమాండ్ వెనుకడుగు వేసిందో... లేక మాణిక్కం ఠాగూర్ రిపోర్టు ఆధారంగానే ముందుకు వెళ్తుందో తెలియదు గానీ మొత్తానికి నిన్న మొన్నటిదాకా టీపీసీసీ చీఫ్ రేసులో ముందు వరుసలో వినిపించిన రేవంత్ రెడ్డి పేరు ఇప్పుడు వెనక్కి వెళ్లినట్లుగా తెలుస్తోంది. కాంగ్రెస్ ఎమ్మెల్సీ, సీనియర్ నేత జీవన్ రెడ్డికి టీపీసీసీ చీఫ్ పదవిని ఇవ్వడానికి అధిష్టానం మొగ్గు చూపుతుంది.

పీసీసీ సారధి కోసం అభిప్రాయ సేకరణ....

గత కొద్ది రోజులుగా తెలంగాణ పీసీసీ సారధి కోసం అభిప్రాయ సేకరణ చేయడంతో పాటు కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ మాణిక్యం ఠాగూర్ సోనియా, రాహుల్ గాంధీ లతో పలుమార్లు సమావేశమై పీసీసీ కొత్త సారధి పై ఓ కొలిక్కి వచ్చినట్లు తెలిసింది. వివాదాస్పదలకు దూరంగా ఉంటూ అందరిని కలుపుకుపోయే వ్యక్తిగా పేరున్న జీవన్ రెడ్డి వైపు అధిష్టానం మొగ్గు చూపుతుంది. టీపీసీసీగా ఆయనను ఖరారు చేసినట్లు తెలుస్తోంది. దీంతో పాటు మహారాష్ట్ర, గుజరాత్ తరహాలో ఇక్కడ కూడా కమిటీలు ఏర్పాటు చేయాలని అధిష్టానం భావిస్తుంది. తుది కసరత్తు పూర్తయిందని పార్టీనేతలు చెప్తున్న అధికారికంగా పేరు ప్రకటించడానికి అధిష్టానం తీవ్రంగా ఆలోచిస్తుంది.

టీపీసీసీ చీఫ్ పదవిపై స్వరం మార్చిన రేవంత్ రెడ్డి...

టీపీసీసీ చీఫ్ పదవిపై చాలా ఆశలు పెట్టుకున్న రేవంత్ రెడ్డి ఇటీవల తన స్వరం మార్చారు. పీసీసీ కంటే తనకు ప్రచార కమిటీ ఛైర్మన్ పదవి అప్పగిస్తే బాగుంటుందని బాహాటంగా నే ప్రకటించారు. దీంతో దీని వెనుక అధిష్టానం బుజ్జగింపులు ఉన్నాయని పార్టీ నేతలు తెలుపుతున్నారు. టీపీసీసీ విషయంలో రేవంత్‌ రాజీపడ్డారా అన్న చర్చకు తెరలేపింది. ఇక కోమటిరెడ్డి వెంకటరెడ్డితో పాటు, జగ్గారెడ్డి, శ్రీధర్ బాబు, బీసీ సామాజిక వర్గం కింద తనకే కేటాయించాలని మధుయాష్కీ భావించిన వీరికి సరైన ప్రాధాన్యత కల్పించాలని అధిష్టానం భావిస్తున్నట్లు తెలిసింది.

రెడ్డి సామాజిక వర్గానికే పీసీసీ, ప్రచార కమిటీ బాధ్యతలు...

పీసీసీతోపాటు ప్రచార కమిటీ బాధ్యతలు కూడా రెడ్డి సామాజిక వర్గానికి ఇవ్వడం పట్ల బీసీ నేతలు కొంత అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దీంతో పేరు ప్రకటించడానికి ఆలస్యం అవుతున్నట్లు పార్టీ నేతల్లో జోరుగా చర్చ జరుగుతుంది. ఇక జీవన్‌ రెడ్డి పేరు ప్రకటిస్తారనుకునే టైంలో టీ పీసీసీ చీఫ్ ఎంపికపై మరో ట్విస్ట్ తెరపైకి వచ్చింది. సీన్‌లోకి మాజీమంత్రి జానారెడ్డి వచ్చారు.

ఇప్పుడే పీసీసీ చీఫ్‌ను నియమించొద్దు అని జానారెడ్డి కోరుతున్నారు. నాగార్జున సాగర్ ఉప ఎన్నిక తర్వాతే ప్రకటించాలని ఆయన హై కమాండ్‌ను కోరారు. నాగార్జున సాగర్ ఉపఎన్నిక పూర్తయ్యే వరకు పీసీసీ అధ్యక్షుడి ఎంపిక వాయిదా వేయాలని హై కమాండ్‌కు జానారెడ్డి విజ్ఞప్తి చేశారు. ఏఐసీసీ తెలంగాణ ఇన్‌చార్జి కార్యదర్శి ఎస్ ఎస్ బోస్ రాజుకు, హై కమాండ్ పెద్దలకు జానారెడ్డి ఫోన్ చేసి తెలిపారు. పీసీసీ ఇష్యూ ప్రభావం నాగార్జున సాగర్ ఉప ఎన్నికపై పడుతుందని వారికి జానారెడ్డి తేల్చిచెప్పారు. ఉప ఎన్నికకు ముందు ప్రకటనతో నేతల్లో ఐక్యత లోపిస్తుందని తెలిపారు. ఇక ఇప్పటికే టీ పీసీసీ చీఫ్ ఎంపికపై సస్పెన్స్ నెలకొనగా.. జానారెడ్డి ప్రతిపాదన ప్రాధాన్యం సంతరించుకుంది. దీంతో హై కమాండ్ ఏం చేస్తుందనే ఉత్కంఠ కంటిన్యూ అవుతోంది. ఏదేమైనా పీసీసీ కొత్త సారధి ఎంపిక గతంలో ఎన్నడూ లేని విధంగా ఆసక్తి నెలకొంది.

Show Full Article
Print Article
Next Story
More Stories