Revanth Reddy: డీజీపీని కలిసిన టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి..

TPCC Chief Revanth Reddy Meet the DGP
x

Revanth Reddy: డీజీపీని కలిసిన టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి..

Highlights

Revanth Reddy: భారత్ జోడోయాత్ర రూట్ మ్యాప్‌ డీజీపీకి వివరించాం

Revanth Reddy: భారత్ జోడో యాత్ర దేశ భవిష్యత్తును మార్చే యాత్ర అని TPCC అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. ఆనాడు గాంధీ చేపట్టిన దండి యాత్రలా.. భారత్ జోడో యాత్ర చరిత్రలో నిలిచిపోతుందన్నారు. చరిత్రలో ఒక కీలకమైన భారత్ జోడో యాత్రలో పాల్గొనడం ఒక గొప్ప అవకాశమని తెలిపారు. హైదరాబాద్ మణికొండలోని AICC కార్యదర్శి సంపత్ నివాసంలో మహారాష్ట్ర భారత్ జోడో యాత్ర పరిశీలన బృందంతో జరిగిన సమావేశానికి రేవంత్ రెడ్డి హాజరయ్యారు. మహారాష్ట్ర భారత్ జోడో యాత్ర పరిశీలన బృందంతో కీలక చర్చలు జరుపుతున్నట్టు రేవంత్ వివరించారు.

మహారాష్ట్ర భారత్ జోడో యాత్ర పరిశీలన బృందం హైదరాబాద్‌కు చేరుకున్నారని, కర్ణాటకలో 22రోజులు, ఏపీలో 4 రోజులు జోడో యాత్ర సాగుతుందని, ఆ తర్వాత అక్టోబర్ 24న రాహుల్ గాంధీ జోడో యాత్ర తెలంగాణలోకి ప్రవేశిస్తుందని రేవంత్ రెడ్డి స్పష్టం చేసారు. తెలంగాణలో యాత్ర ముగిసిన తరువాత మహారాష్ట్రలోకిప్రవేశిస్తుందని పేర్కొన్నారు. జోడో యాత్రపై ఒకరికొకరం సమన్వయం చేసుకోవాలని నిర్ణయించుకున్నామని, తెలంగాణ, మహారాష్ట్ర నేతలతో కలిసి సమన్వయ బృందాన్ని ఏర్పాటు చేసుకోవాలని ఈ సందర్బంగా చర్చించుకున్నట్టు రేవంత్ తెలిపారు.

భారత్ జోడో యాత్రకు అశేష ఆదరణ లభిస్తోందని మహారాష్ట్ర సీఎల్పీ నేత బాలా సాహెబ్‌ తోరాట్‌ స్పష్టం చేశారు. తెలంగాణలాగే మహారాష్ట్రలో జోడో యాత్ర రూట్‌ మ్యాప్‌ తయారు చేస్తామన్నారు. ఇందుకు అందరూ సహకరించాలని కోరారు.

ఇదిలా ఉంటే తెలంగాణలో జరగనున్న రాహుల్ గాంధీ భారత్‌ జోడో పాదయాత్రకు భద్రత కల్పించేందుకు డీజీపీ మహేందర్‌రెడ్డి సానుకూలంగా స్పందించారని రేవంత్‌రెడ్డి వెల్లడించారు. రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్‌ నేతలు డీజీపీ మహేందర్‌రెడ్డిని కలిసి జోడో పాదయాత్రకు భద్రత కల్పించాలని కోరారు. అక్టోబరు 24న కర్ణాటకలోని రాయ్‌చూర్‌ నుంచి తెలంగాణలోని మహబూబ్‌నగర్‌లోకి రాహుల్‌ ప్రవేశిస్తారని రేవంత్‌రెడ్డి తెలిపారు. రాహుల్‌ గాంధీ పాదయాత్ర రూట్‌ మ్యాప్‌ను డీజీపీకి అందజేసినట్టు చెప్పారు. రాష్ట్ర ప్రజలంతా భారత్‌ జోడో యాత్రను విజయవంతం చేయాలని కోరారు. దేశ విభజనకు కుట్ర చేస్తున్న శక్తులను ఎదుర్కోవాలంటే అది కాంగ్రెస్‌తోనే సాధ్యమవుతుందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. ప్రజాస్వామ్య వాదులు రాహుల్‌ పాదయాత్రలో పాల్గొనాలని కోరారు.

Show Full Article
Print Article
Next Story
More Stories