అనుకున్నదొక్కటి.. అయ్యిందొక్కటి..ఆ మాజీలకు గుర్తింపు ఎప్పుడు?

అనుకున్నదొక్కటి.. అయ్యిందొక్కటి..ఆ మాజీలకు గుర్తింపు ఎప్పుడు?
x
Highlights

వాళ్లిద్దరూ రాజకీయ ఉద్దండులు.. మచ్చలేని నాయకులు. ఒకప్పుడు వేర్వేరు పార్టీల్లో.. రాజకీయ ప్రత్యర్ధులుగా ఉన్నా.. ఇప్పుడు ఒకే పార్టీలో కొనసాగుతున్నారు....

వాళ్లిద్దరూ రాజకీయ ఉద్దండులు.. మచ్చలేని నాయకులు. ఒకప్పుడు వేర్వేరు పార్టీల్లో.. రాజకీయ ప్రత్యర్ధులుగా ఉన్నా.. ఇప్పుడు ఒకే పార్టీలో కొనసాగుతున్నారు. కీలక సమయంలో రాజకీయ జన్మనిచ్చిన పార్టీకి గుడ్ బై చెప్పి.. గులాబీ గూటికి చేరారు. పార్టీ మారిన ఆ ఇద్దరు నేతలకు కీలక పదవులు వస్తాయని అప్పట్లో జోరుగా ప్రచారం జరిగింది. ఐతే మారిన రాజకీయ పరిస్ధితుల్లో వాళ్లిద్దరికి పదవులు దక్కుతాయా లేదా..? అన్నది సందిగ్దంగా మారింది. అనుకుందొక్కటి.. అయ్యిందొక్కటి అనే చర్చ టీఆర్ఎస్ పార్టీలో జోరుగా సాగుతోంది. ఇంతకీ ఎవరా నేతలూ..? ఏంటా కథా... ?

నిజామాబాద్ జిల్లాలో పరిచయం అక్కర లేని రాజకీయ నేతల్లో వీళ్లిద్దరూ ముందు వరుసలో ఉంటారు. ఒకరు మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావు, మరొకరు మాజీ స్పీకర్ కే.ఆర్. సురేష్‌రెడ్డి. మండవ టీడీపీలో కార్యకర్త స్దాయి నుంచి అంచెలంచెలుగా ఎదిగి ఉమ్మడి రాష్ట్రంలో కీలక మంత్రిగా పనిచేశారు. క్లీన్ ఇమేజ్ ఉన్న ఆయన పార్లమెంట్ ఎన్నికలకు ముందు ముఖ్యమంత్రి కేసీఆర్‌తో ఉన్న సాన్నిహిత్యంతో గులాబీ గూటికి చేరారు. సీఎం కేసీఆర్ స్వయంగా మండవ ఇంటికి వెళ్లి పార్టీలోకి ఆహ్వానించారు. సీఎం మండవ ఇంటికి వెళ్లడం రాజకీయంగా అప్పట్లో పెద్ద చర్చే జరిగింది. ఆయన కారెక్కిన అనంతరం ప్రభుత్వం పరంగా ప్రాధాన్యం దక్కుతుందని జోరుగా ప్రచారం కూడా జరిగింది. ఆయన అనుచరులు ఒక అడుగు ముందుకేసి మండవకు మంత్రి పదవి ఖాయమనే ప్రచారం చేశారు.

అయితే ఎంపీ ఎన్నికల్లో కవిత ఓటమితో నేతల అంచనాలు అన్నీ తలకిందులయ్యాయి. దీంతో టీఆర్ఎస్‌లో ఒక్కసారిగా స్తబ్దత నెలకొంది. కవిత ఓటమితో మండవ జిల్లాకు రావడం మానేశారు. అటు టీఆర్ఎస్ అధినేతను కలిసే సాహసం చేయడం లేదంట. ముఖ్యమంత్రితో సాన్నిహిత్యం ఉన్నా కేసీఆర్ కూతురును గెలిపించలేకపోయాననే బాధ మండవను కలిచివేస్తోందనే టాక్ నడుస్తోంది. దీంతో మొన్నటి వరకు ప్రభుత్వంలో ప్రాధాన్యం ఖాయమన్న పార్టీ వర్గాలే ఇప్పుడు ఏమో అధినేత మనసులో మాట పెరుమళ్లకెరుక అంటున్నారు. మండవ వెంకటేశ్వరరావుకు కీలక పదవి కోసం మరి కొద్ది రోజులు వేచిచూడక తప్పని పరిస్ధితి నెలకొందని ఆయన అనుచరులు చర్చించుకుంటున్నారు.

మరో నేత మిస్టర్ క్లీన్‌గా అందరికి సుపరిచితుడు. ఉమ్మడి రాష్ట్రంలో స్పీకర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న నేత కే.ఆర్. సురేష్‌రెడ్డి. కాంగ్రెస్ పార్టీ తరపున నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొంది రెండు నియోజకవర్గాల్లో పట్టు సంపాదించుకున్న నేత అసెంబ్లీ ఎన్నికలకు ముందు సురేష్‌రెడ్డి గులాబీ గూటికి చేరారు. ఆర్మూర్, బాల్కొండ నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ అభ్యర్ధుల గెలుపు కోసం తన వంతు ప్రచారం చేసి సక్సెస్ అయ్యారు. అభివృద్దిలో దూసుకుపోతున్న కారు స్టీరింగ్ మరొకరికి అప్పగించొద్దంటూ సరికొత్త నినాదంతో ప్రచారం చేశారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన వెంటనే సురేష్ రెడ్డికి కీలక పదవి దక్కుతుందని టీఆర్ఎస్ అధినేత జిల్లాలో జరిగిన ప్రచార సభలో చెప్పారు. దీంతో అందరూ ఆయనకు మండలి ఛైర్మన్ ఖాయమనే భావించారు. అదీ కాకుంటే రాజ్యసభ పక్కా అనుకున్నారు. కానీ పార్లమెంట్ ఎన్నికల ఫలితాలతో ఇప్పుడా చర్చ తెరమరుగైంది. సురేష్ రెడ్డి అనుచరులు మా నేతకు పదవి ఎప్పుడొస్తుందని ఆశగా ఎదురుచూస్తుంటే టీఆర్ఎస్ శ్రేణులు మాత్రం క్యూలో ఇంకా చాలా మంది ఉన్నారని సమాధానం ఇస్తున్నారంట. దీంతో ఆ ఇద్దరు రాజకీయ ఉద్దండుల రాజకీయ భవిష్యత్తుపై జిల్లాలో ఆసక్తికర చర్చ జరుగుతుంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories