ఒకే గొడుగు కిందకు అన్ని తరహా నీటిపారుదల విభాగాలు

Arun Chilukuri
Updated on: 28 Dec 2020 9:00 PM IST
ఒకే గొడుగు కిందకు అన్ని తరహా నీటిపారుదల విభాగాలు
X

మార్పులకు అనుగుణంగా జలవనరుల శాఖను పునర్ వ్యవస్థీకరించింది తెలంగాణ సర్కార్. అన్ని తరహా నీటిపారుదల విభాగాలను ఒకే గొడుగు కిందకు తీసుకొస్తూ నిర్ణయం తీసుకుంది. జలవనరుల శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించిన సీఎం కేసీఆర్ కీలక నిర్ణయాలకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు.

నీటిపారుదల రంగంలో వచ్చిన మార్పులకు అనుగుణంగా జలవనరుల శాఖను తెలంగాణ సర్కార్ పునర్ వ్యవస్థీకరించింది. ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్ జలవనరుల శాఖకు చెందిన అధికారులతో సమావేశమై రాష్ట్రంలో ఆశాఖ స్వరూపాన్ని ఖరారు చేశారు. భారీ, మధ్య, చిన్నతరహా నీటిపారుదల విభాగాలన్నింటినీ ఒకే గొడుగు కిందికి తేవడంతోపాటు ఒకే ప్రాంతంలో ఉన్న అన్నిరకాల జలవనరుల శాఖ వ్యవహారాలను ఒకే అధికారి పర్యవేక్షించేలా నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రం మొత్తాన్ని 19 జలవనరుల ప్రాదేశిక ప్రాంతాలుగా గుర్తించి ఒక్కొక్క దానికి ఒక్కో సీఈని పర్యవేక్షణ అధికారిగా బాధ్యతలు అప్పగించాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు.

రాష్ట్రంలో 19 ప్రాదేశిక ప్రాంతాలు ఉన్నాయ్. ఆరుగురు ఈఎన్సీలను నియమించి వారికి బాధ్యతలు పంచాలని నిర్ణయించారు. ప్రస్తుతం ముగ్గురు ఈఎన్సీలు ఉండగా కొత్తగా మరో మూడు ఈఎన్సీ పోస్టులను మంజూరు చేశారు. పునర్వ్యవస్థీకరణ కారణంగా మొత్తం 945 అదనపు పోస్టులు అవసరం అవుతాయని అంచనా వేశారు. రాష్ట్రంలో అత్యంత ప్రాధాన్యత అంశంగా నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణాలు చేపట్టామని సీఎం కేసీఆర్ వెల్లడించారు. ప్రధాన ప్రాజెక్టుల్లో భాగంగానే కొద్దిపాటి లింకులను కూడా త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి జిల్లా ఎమ్మెల్యేలతో సమీక్షించారు. ఛనాక కొరాట ప్రాజెక్టు బ్యారేజీ, పంప్‌హౌస్, కెనాల్స్‌ను 2021 జూన్‌లోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

చెన్నూరు లిఫ్ట్ ఇరిగేషన్‌ స్కీమ్‌తో పాటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని అన్ని మధ్యతరహా ప్రాజెక్టులపై సమీక్ష నిర్వహించి, మిగిలిపోయిన పనులను వెంటనే పూర్తి చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఆసిఫాబాద్, బెల్లంపల్లి, మంచిర్యాల నియోజకవర్గాల పరిధిలో ఆయకట్టును అభివృద్ధి చేయడానికి ప్రాణహిత ప్రాజెక్టుపై అవసరమైన చర్యలు వెంటనే చేపట్టాలని అన్నారు. ఆదిలాబాద్ జిల్లాలో కుప్పి ప్రాజెక్ట్, మహబూబ్‌నగర్ జిల్లాలో గట్టు ప్రాజెక్టు, జుక్కల్ నియోజకవర్గ పరిధిలోని నాగమడుగు ఎత్తిపోతల పథకం టెండర్లను వెంటనే పిలిచి పనులు చేపట్టాలని కేసీఆర్ ఆదేశించారు. వరంగల్ జిల్లాలో గోదావరి కరకట్టల పనులను వచ్చే వానాకాలంలోపు పూర్తి చేయాలన్నారు.

అచ్చంపేట ఎత్తిపోతల పథకం చేపట్టాలని దీనికోసం వెంటనే సర్వే నిర్వహించాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. హుజూర్‌నగర్ ఎత్తిపోతల పథకాన్ని మంజూరు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు. ఈమధ్య కురిసిన వర్షాల వల్ల దెబ్బతిన్న అన్ని చెరువులకు శాశ్వత ప్రాతిపదికన మరమ్మతులు చేపట్టాలని అధికారులకు సూచించారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story