Ganesh Immersion 2023: నిమజ్జనానికి భారీ ఏర్పాట్లు చేసిన పోలీసులు.. ప్రతి గణేష్ మండపానికి క్యూఆర్ కోడ్

The Police Made Huge Arrangements for the Ganesh  Immersion
x

Ganesh Immersion 2023: నిమజ్జనానికి భారీ ఏర్పాట్లు చేసిన పోలీసులు.. ప్రతి గణేష్ మండపానికి క్యూఆర్ కోడ్ 

Highlights

Ganesh Immersion 2023: ఒకే రోజు ఖైరతాబాద్, బాలాపూర్ వినాయకుల నిమజ్జనం

Ganesh Immersion 2023: నగరంలో ఏటా జరిగే గణేష్‌ నవరాత్రి ఉత్సవాలు, నిమజ్జనం పోలీసులకు ఓ సవాల్ లాంటిది. విగ్రహం ఏర్పాటు దగ్గర నుంచి నిమజ్జనం అయ్యే వరకూ చాలా జాగ్రత్తగా ఉండాలి. అయితే తతంగాన్ని సిటీ కాప్స్‌ ఈసారి పూర్తి ఆన్‌లైన్‌ చేశారు. ప్రతి వినాయక మండపానికీ ఓ ప్రత్యేకమైన క్యూఆర్‌ కోడ్‌ కేటాయిస్తున్నారు. దీంతో తనిఖీల నుంచి నిమజ్జనం వరకు ప్రతి అంశం జవాబుదారీగా ఉంటుందని అధికారులు చెబుతున్నారు. మరోపక్క ఈ ఏడాది ఖైరతాబాద్‌ మహా గణపతితో పాటు బాలాపూర్‌ గణేషుడినీ ఒకే రోజు, గరిష్టంగా సాయంత్రం లోపు నిమజ్జనం చేయించేలా పోలీసులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.

నగర పోలీసు కమిషనరేట్‌ పరిధిలో ఏటా వేల వినాయక మండపాలు ఏర్పాటవుతుంటాయి. దీనికోసం నిర్ణీత సమయం ముందు నుంచి పోలీస్‌ స్టేషన్లలో దరఖాస్తులు అందిస్తుంటారు. ఇప్పటి వరకు ఇదిమాన్యువల్‌గా జరుగుతూ వచ్చింది. ఈసారి పోలీసులు మాన్యువల్‌గా దరఖాస్తులు స్వీకరించినప్పటికీ వాటిని ఆన్‌లైన్‌లో పొందుపరిచారు.

ఇలా ఆన్‌లైన్‌ చేసిన దరఖాస్తులను పరిశీలించేందుకు బషీర్‌బాగ్‌లోని కమిషనరేట్‌ కార్యాలయంలో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేశారు. వీరు ఆన్‌లైన్‌ దరఖాస్తులు, ఠాణాల నుంచి వచ్చిన పత్రాలను పరిశీలించి మండపం ఏర్పాటుకు అనుమతి లేఖ ఇస్తారు. దీనిపై ప్రత్యేకంగా క్యూఆర్‌ కోడ్‌ ముద్రిస్తారు. ఒక్కో విగ్రహానికి ఒక్కో కోడ్‌ కేటాయించేలా ఏర్పాట్లు చేశారు.

ఈ క్యూఆర్‌ కోడ్స్‌ డేటాను పోలీసు అధికారిక యాప్‌ టీఎస్‌ కాప్‌లోకి లింకు ఇస్తున్నారు. దీంతో ఉన్నతాధికారుల నుంచి క్షేత్రస్థాయిలో ఉండే పోలీసుల వరకూ ఎవరైనా సరే తమ ప్రాంతంలో ఎన్ని మండపాలు ఉన్నాయి? ఎక్కడ ఉన్నాయి? ఎప్పుడు ఏర్పాటు అవుతాయి? నిమజ్జనం ఎప్పుడు? ఏ మార్గంలో వెళ్ళి, ఎక్కడ నిమజ్జనం చేస్తారు? తదితర వివరాలను తమ ట్యాబ్స్, స్మార్ట్‌ఫోన్‌లో చూసుకునే అవకాశం ఏర్పడింది.

ఓ ప్రాంతంలో మండపం ఏర్పాటు నుంచి విగ్రహం నిమజ్జనం అయ్యే వరకు ప్రతి దశలోనూ పోలీసుల పర్యవేక్షణ ఉంటుంది. గస్తీ విధులు నిర్వర్తించే బ్లూకోల్ట్సŠ, పెట్రోలింగ్‌ వాహనాల సిబ్బంది నిత్యం ఆయా మండపాల వద్దకు వెళ్లి పరిస్థితులను అంచనా వేయడంతో పాటు తనిఖీలు చేస్తారు.. ఇప్పటి వరకు ఈ విధానం సైతం మాన్యువల్‌గానే సాగుతోంది. అయితే తాజాగా క్యూఆర్‌ కోడ్‌ కేటాయిస్తున్న నేపథ్యంలో గస్తీ సిబ్బంది తనిఖీలప్పుడు తమ ట్యాబ్స్‌ను వినియోగిస్తారు. ఆయా మండపాల వద్దకు వెళ్లి కోడ్‌ను హైదరాబాద్‌ కాప్‌ యాప్‌లో స్కాన్‌ చేస్తారు. దీంతో ఈ తనిఖీలు ఎలా సాగుతున్నాయన్నది ఉన్నతాధికారులకు ఈ యాప్‌ ద్వారానే తెలుస్తుంది.

గణేష్‌ ఉత్సవాల్లో నిమజ్జనం అత్యంత కీలకమైన ఘట్టం. నిర్ణీత సమయంలో ఊరేగింపు ప్రారంభంకావడం నుంచి నిమజ్జనం పూర్తయ్యే వరకు ప్రతి విగ్రహం కదలికల్నీ గమనిస్తుండాలి. క్యూఆర్‌ కోడ్‌తో కూడిన పత్రంతో వచ్చే విగ్రహాలను క్షేత్రస్థాయి సిబ్బంది ఎక్కడిక్కడ పర్యవేక్షిస్తారు. ఆ కోడ్‌ను తమ ట్యాబ్స్, ఫోన్లలో స్కానింగ్‌ చేస్తుంటారు. దీంతో ఏ విగ్రహం, ఏ సమయంలో, ఏ ప్రాంతంలో ఉంది? ఎప్పుడు నిమజ్జనం జరిగింది? ఇంకా ఎన్ని విగ్రహాలు నిమజ్జనం కావాల్సి ఉంది? అనే అంశాలు అందరు సిబ్బంది, అధికారులకు యాప్‌ ద్వారా తెలుస్తుంటాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories