Top
logo

Medical Staff: నాలుగో తరగతి వైద్య సిబ్బందికి శుభవార్త.. జీతాల పెంపుపై కేసీఆర్ సుముఖం

Medical Staff: నాలుగో తరగతి వైద్య సిబ్బందికి శుభవార్త.. జీతాల పెంపుపై కేసీఆర్ సుముఖం
X
Highlights

Medical Staf | కరోనా వేళ వీరంతా కంటి మీద కునుకు లేకుండా పనిచేస్తున్నారు..

Medical Staf | కరోనా వేళ వీరంతా కంటి మీద కునుకు లేకుండా పనిచేస్తున్నారు... ఆస్పత్రిలో పనిచేసి, ఇంటికి వెళ్లిన తరువాత సైతం నిద్రలేని పరిస్థితే.. ఒక పక్క భయం.. మరో పక్క భాద్యత... మార్చి నెలాఖరు నుంచి వీరి సేవలు నిరంతరాయంగా కొనసాగుతూనే ఉన్నాయి. ప్రస్తుతం వీరికి ప్రత్యామ్నాయం లేదు. ఈ విషయాన్ని గుర్తించిన తెలంగాణా ప్రభుత్వం వీరి జీతాలు పెంచేందుకు కసరత్తు ప్రారంభించింది. దీనికి సంబంధించి ఇప్పటికే పలు సంఘాలతో సమావేశమై నిర్ణయాన్ని చర్చించింది. అంతా అనుకూలమైతే మరో రెండు, మూడు రోజుల్లో దీనిపై సీఎం కేసీఆర్ ప్రకటన చేయనున్నారు..

ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేస్తున్న నాలుగో తరగతి వైద్య సిబ్బందికి శుభవార్త. ఔట్‌సోర్సింగ్‌ పద్ధతిలో పనిచేస్తున్న వారందరి వేతనాలు పెంచాలని సర్కార్‌ యోచిస్తోంది. ఈ మేరకు సీఎం కేసీఆర్‌ కూడా సూత్రప్రాయంగా ఆమోదం తెలిపినట్లు వైద్య, ఆరోగ్య శాఖ వర్గాలు తెలిపాయి. కరోనా వేళ ఆయా ఆసుపత్రుల్లో పనిచేస్తున్న పారిశుధ్య కార్మికులు, సెక్యూరిటీ గార్డులు, రోగులకు సేవలందించే సిబ్బంది కీలకపాత్ర పోషిస్తు న్నారు. కరోనా నేపథ్యంలో తమకు ప్రత్యేక ప్రోత్సాహకం అందించాలని వారు ఇటీవల ప్రభుత్వానికి విన్నవించారు. ఈ విషయంపై మంత్రి ఈటల రాజేందర్‌.. బుధ, గురువారాల్లో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు.

అలాగే కార్మిక, ప్రజాసంఘాల నాయకులతోనూ సమావేశమై వారి నుంచి సలహాలు తీసుకున్నారు. ప్రోత్సాహకమిస్తే కరోనా కాలం వరకే పరిమితం అవుతుందని, అలా కాకుండా వేతనం పెంచడం వల్ల శాశ్వత లబ్ధి జరుగుతుందని మంత్రి భావించారు. ఇదే విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లగా కేసీఆర్‌ కూడా సానుకూలంగా స్పందించినట్లు వైద్యాధికారులు తెలిపారు. దీంతో ఆయా ఆసుపత్రుల్లో పనిచేసే ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులందరికీ వేతనాలు పెంచే విషయంపై ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు.

ఆరు వేల మందికి ప్రయోజనం...

వైద్య విద్యా సంచాలకులు (డీఎంఈ), తెలంగాణ వైద్య విధాన పరిషత్‌ (టీవీవీపీ) పరిధిలోని అన్ని ఆసుపత్రుల్లో ఔట్‌సోర్సింగ్‌ పద్ధతిలో నాలుగో తరగతి ఉద్యోగులు పని చేస్తున్నారు. ఇటీవల కొన్నిచోట్ల చేపట్టిన నియామకాలతో కలిపి వీరు దాదాపు 6,000 మంది ఉన్నారు. ప్రైౖ వేట్‌ ఔట్‌సోర్సింగ్‌ ఏజెన్సీల ద్వారా వీరికి వేతనాలు అందుతాయి. ఆసుపత్రిలో ఉన్న ఒక్కో పడకకు రూ. 5 వేల చొప్పున ప్రభుత్వం ఏజెన్సీకి ఇస్తుంది. దీంతో ఒక్కో పారిశుధ్య, రోగుల సహాయకులకు నెలకు రూ. 9,225, సెక్యూరిటీ గార్డులకు రూ. 9,555 చొప్పున చెల్లించాలి. పీఎఫ్‌ కట్‌ చేసి ఇస్తుండటంతో పారిశుధ్య, రోగుల సహాయక సిబ్బందికి నెలకు రూ. 8,400, సెక్యూరిటీ గార్డులకు నెలకు రూ. 8,700 వరకు అందుతోంది. సెలవు పెడితే వేతనం అదే స్థాయిలో కోత పడుతుంది. కరోనా నేపథ్యంలో ఇంత తక్కువ వేతనానికి పనిచేసేందుకు చాలామంది వెనకడుగు వేస్తున్నారు. రిస్క్‌ ఉన్నచోట్ల పనిచేయడం కంటే సొంతూళ్లకు వెళ్లి ఉపాధి కూలీ చేసుకోవడమే బెటర్‌ అన్న భావనతో ఉన్నారు. దీంతో అనేక ఆసుపత్రుల్లో నాలుగో తరగతి ఉద్యోగులు అసంతృప్తితో ఉన్నారు. ఇది ప్రభుత్వ ఆసుపత్రులకు పెద్ద సమస్యగా మారింది.

నిమ్స్‌లో మాదిరిగా వేతనం పెంపు...

ప్రస్తుతం ఈ ఉద్యోగులకు ఫిక్స్‌డ్‌ వేతనం ఇవ్వడంలేదన్న చర్చ జరుగుతోంది. వాస్తవంగా ప్రతీ శాఖలో ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు నిర్ణీత వేతనం ఇస్తుంటారు. కానీ ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేసే నాలుగో తరగతి సిబ్బందికి మాత్రం అలా లేదు. ఇక్కడి వేతన వ్యవస్థే సరిగ్గా లేదన్న అభిప్రాయం ఉంది. ఉదాహరణకు ఒక ఆసుపత్రిలో 100 పడకలు ఉన్నాయనుకుందాం. ఒక్కో పడకకు నిర్ణీత సొమ్ము ప్రాతిపదికన ఔట్‌సోర్సింగ్‌ ఏజెన్సీకి ప్రభుత్వం నిధులు కేటాయిస్తుంది. ఔట్‌ సోర్సింగ్‌ ఏజెన్సీకి ప్రభుత్వం ఉద్యోగులను ఎంపిక చేసే బాధ్యత ఇస్తుంది. తక్కువ కోట్‌ చేసిన ఏజెన్సీకే టెండర్‌లో అవకాశం ఇస్తారు. అయితే ఏజెన్సీని దక్కించుకోవడం కోసం తక్కువకు కోట్‌ చేసేవారున్నారు. ఫలితంగా తక్కువ వేతనం ఇస్తున్నారు. దీంతో ఈ వ్యవస్థనే మార్చాలని, పడకలను బట్టి కాకుండా ఆసుపత్రుల్లో ఎంత మంది సిబ్బంది ఉండాలన్నది కూడా వైద్య, ఆరోగ్యశాఖ నిర్ణయిస్తుంది.

ఈ నేపథ్యంలో ప్రస్తుతం అమల్లో ఉన్న ఒక్కో పడకకు రూ.5 వేల చొప్పున చెల్లించే మొత్తం దాదాపు 40 నుంచి 50 శాతం వరకూ పెరిగే అవకాశాలున్నాయి. ముఖ్యంగా నిమ్స్‌ను ప్రాతిపదికగా తీసుకోవాలని భావిస్తున్నారు. అక్కడ ఔట్‌సోర్సింగ్‌ సిబ్బందికి చెల్లిస్తున్నట్లుగా ఇతర ప్రభుత్వ ఆసుపత్రుల సిబ్బందికీ చెల్లించాలని నిర్ణయించినట్లు సమాచారం. నిమ్స్‌లో పారిశుధ్య సిబ్బందికి నెలకు రూ. 16,980 చొప్పున వేతనం ఉంది. వారి పీఎఫ్‌ కటింగ్‌ పోను దాదాపు రూ. 14,943 చొప్పున వేతనం వస్తుంది. ఇదే విధంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేస్తున్న పారిశుధ్య సిబ్బంది, సెక్యూరిటీ, ఇతర సిబ్బందికి నెలకు సుమారు రూ. 3 వేల నుంచి రూ. 4 వేల వరకూ అదనంగా వేతనాలు పెరిగే అవకాశాలున్నట్లు అధికారులు చెబుతున్నారు.

పెంపు ఇలా ఉండొచ్చు...

రాష్ట్ర వ్యాప్తంగా నాలుగో తరగతి వైద్య సిబ్బంది: 6,000

♦ ప్రస్తుతం ఒక్కొక్కరి వేతనం: రూ.9,400

♦ పీఎఫ్‌ కటింగ్‌పోను చేతికి వచ్చేది: రూ.8,700

♦ ప్రభుత్వం నిర్ణయంతో అదనంగా పెరిగే వేతనం: రూ.4000

♦ పెరిగిన తర్వాత చేతికందే మొత్తం: రూ.12,700

Web TitleTelangna CM Kcr to Increase Salaries for Fourth Class Medical Staff
Next Story