Top
logo

టీఎస్‌ఆర్టీసీ మనుగడపై ఉద్యోగుల్లో ఆందోళనా?

టీఎస్‌ఆర్టీసీ మనుగడపై ఉద్యోగుల్లో ఆందోళనా?
X
Highlights

ప్రగతి రథ చక్రాన్ని పరుగులు పెట్టించే సారథులు. ప్రజా జీవితంతో మమేకమైన కార్మికులు. ఇష్టపడుతూ, కష్టపడుతూ సంస్థను ...

ప్రగతి రథ చక్రాన్ని పరుగులు పెట్టించే సారథులు. ప్రజా జీవితంతో మమేకమైన కార్మికులు. ఇష్టపడుతూ, కష్టపడుతూ సంస్థను అమ్మలా భావించిన ఉద్యోగులు. బస్సును కన్నకొడుకులా చూసుకున్న బంధం వారిది. మరి ఇప్పుడు వారిని కదిలిస్తే, వారేమంటారు.? నిన్న సమ్మె, నేడు కరోనా ఇంతటి విపత్కర పరిస్థితుల్లో, వారి గుండెలో గూడుకట్టుకున్న వేదనేంటి? ఇప్పటికిప్పుడు ఒక్క చాన్స్ ఇవ్వాలని వారు అడుగుతున్నదేంటి?

తెలంగాణ ఆర్టీసీకి దెబ్బదెబ్బ మీద పడుతోంది. మొన్నటి వరకు సమ్మెతో అపారనష్టం. ఆ తర్వాత వెనువెంటనే కరోనా ఎఫెక్టు. వరుస దెబ్బలతో ఆర్టీసీకి భవిష్యత్ ఉంటుందా అని ఉద్యోగుల్లో ఆందోళన మొదలైంది. తమ డిమాండ్లు పరిష్కరించాలని సమ్మెకి వెళ్లిన కొద్దినెలల్లోనే, సీఎం హామీతో గాడిన పడుతుందనుకున్న ఆర్టీసీ మీద, కరోనా కాటు వేసింది. దీంతో దాదాపు ఆరు నెలలు డిపోలకే బస్సులు పరిమితం కావడంతో, ప్రస్తుతం ఉద్యోగులకు జీతాలిచ్చే పరిస్థితి కూడా సంస్థకు లేదు. ఆదాయం లేక ఆర్టీసీ ఉనికే ప్రశ్నర్థకంగా మారింది. సంస్థ అభివృద్ది కోసం తెచ్చిన నిధులు కూడా ఉద్యోగుల జీతాలకే అయిపోవడంతో, ప్రస్తుతం ఖజానా మొత్తం ఖాళీ అయ్యింది. దీంతో ఆర్టీసీ వ్యయాన్ని తగ్గించుకోవాలన్న యాజమాన్యం ప్రణాళికలో భాగంగా, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను తొలగించి, ప్రస్తుతం పాత బస్సులు తీసివేయగా, మిగిలిపోయిన ఉద్యోగులను వారి స్థానాల్లో వినియోగిస్తుండటంతో, ఉద్యోగులకు వెట్టిచాకిరే దిక్కయ్యింది. మిగిలిన వారిని బస్‌పాస్ కౌంటర్లు, సెక్యూరిటిగార్డులు, పెట్రోల్ పంపులు లాంటివాటికి సర్థుబాటు చేశారు. ఇంకా చాలామందికి పనుల్లేక బస్టాండ్లలో ప్రయాణికులను ఎక్కించడానికి ఉపయోగిస్తుండటంతో, ఉద్యోగుల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. దీంతో పాటు ఉన్నతాధికారుల వేధింపులు కూడా ఎక్కువయ్యాయి. అందుకే ఇక ఆర్టీసీ ఉద్యోగాన్ని వదిలేద్దాం అన్న ఆలోచన చేస్తున్నారట ఎంప్లాయీస్.

ఆర్టీసీ ఉద్యోగ పదవీ విరమణ వయస్సు 58 ఉన్నప్పటికీ, సమ్మె తర్వాత ప్రభుత్వం దానిని 60కి పెంచింది. అయినా వారికి పెన్షన్ లేదు. సమ్మె సమయం నుంచే, చాలామంది ఉద్యోగులు వీఆర్ఎస్‌ గురించి ఆలోచించారు. స్వచ్చంద పదవీ విరమణంలో భాగంగా ఒక మంచి పథకం ప్రకటిస్తే, వేలాది మంది ఉద్యోగులు, వెళ్లిపోవడానికి సిద్దంగా ఉన్నారు. అధికారికంగా 'గోల్డెన్ షేక్ హ్యండ్' లాంటి ఏదైనా స్కీము తీసుకువస్తే, ఇప్పటికిప్పుడు ఆర్టీసీ నుండి దాదాపు ఏడువేలమంది స్వచ్చంద పదవీ విరమణకు రెడీగా వున్నారట. ఇలాంటి పథకాలు బిఎస్ఎస్ఎల్, ఎస్బీహెచ్, సింగరేణి లాంటి సంస్థల్లో పెట్టారు. ఉద్యోగులతో ఆయా సంస్థలు వన్ టైం సెటిల్మెంట్ కూడా చేసుకుంటున్నాయి. ఆర్టీసీలోనూ అలాంటి పథకమే తెస్తే, ఇంటికెళ్లిపోవడానికి వేలాదిమంది ఉద్యోగులు సంసిద్దంగా వున్నారట.

రోజురోజుకు తెలంగాణ ఆర్టీసీ పీకల్లోతు కష్టాల్లోకి కూరుకుపోతోంది. వీటికి తోడు రవాణా వ్యవస్థపై కేంద్ర ప్రభుత్వ చట్టాలు, ప్రైవేట్ వాహనాలకు విచ్చలవిడిగా అనుమతినిస్తుండటంతో, ప్రజారవాణా నిర్వీర్యమవుతోంది. ప్రభుత్వ మద్దతు పెద్దగా లేకపోవడంతో, ప్రగతి రథచక్రం కుంటుపడుతోంది. ఇప్పటికే వేల కోట్ల అప్పు కావడంతో, ఆర్టీసీ ఉనికే ప్రశ్నర్థకంగా మారింది. అందులో పని చేస్తున్న కార్మికుల పరిస్థితి కూడా అంతే. అందుకే వీఆర్‌ఎస్‌ తీసుకుని ఇంటిపట్టున వుండటమో, మరో బతుకు దెరువు చూసుకోవడమో మేలని ఆర్టీసీ ఎంప్లాయీస్‌ ఆవేదనగా మాట్లాడుకుంటున్నారట.


Web TitleTelangana RTC employees fear about job
Next Story