తెలంగాణా లోకల్ వార్తలు@12pm: హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్ కు చేదు అననుభవం.. రైతుల ఆందోళన..

తెలంగాణా లోకల్ వార్తలు@12pm:  హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్ కు చేదు అననుభవం.. రైతుల ఆందోళన..
x
Highlights

Telangana Local news upto 12 PM: ఈరోజు ఉదయం నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకూ తెలంగాణలో వివిధ ప్రాంతాల్లో జరిగిన సంఘటనల సంక్షిప్త సమాచారం

మెదక్ జిల్లాలో రైతుల ఆందోళన!

మెదక్ జిల్లా చిన్న శంకరంపేట్ మండలం జంగారాయి గ్రామంలో రైతులు ఆందోళన చేపట్టారు. సన్నరకం వరి సాగు చేసిన రైతులకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేశారు. గ్రామంలోని సహకార సంఘం కార్యాలయానికి తాళం వేసి గేటు ఎదుట బైఠాయించారు. పండించిన పంటకు మద్దతు ధర లభింకపోవడంతో తీవ్ర అసహానానికి గురైన రైతులు... ధాన్యాన్నికి నిప్పు పెట్టి తమ నిరసనను వ్యక్తం చేశారు.

సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం

జీహెచ్‌ఎంసీ శానిటేషన్‌ వర్కర్ల వేతనాలు పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో వారంతా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్‌ వద్ద ముఖ్యమంత్రి కేసీఆర్‌ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో పారిశుధ్య కార్మికులు, ఎంటమాలజీ కార్మికులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. పారిశుధ్య కార్మికుల కోసం భవిష్యత్తులో మరిన్ని మంచి నిర్ణయాలు తీసుకుంటామని మంత్రి శ్రీనివాస్‌ గౌడ్ తెలిపారు.

హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్ కు చేదు అనుభవం

హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్‌కు చర్లపల్లి డివిజన్‌లో చేదు అనుభవం ఎదురైంది. వరద సాయం పంపిణీకి వెళ్లిన బొంతు రామ్మోహన్‌ను స్థానికులు నిలదీశారు. ఇన్నేళ్లలో ఎప్పుడైనా తమ వద్దకు వచ్చారా? అంటూ ప్రశ్నించారు. తమ డివిజన్‌లో అభివృద్ధి పనులు ఎందుకు చేయలేదని కాలనీ వాసులు మేయర్ బొంతు రామ్మోహన్‌ను నిలదీశారు. వరద సాయం కూడా తమకు సరిగా అందలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

ములుగు జిల్లాలో విషాదాన్ని మిగిల్చిన పుట్టినరోజు వేడుకలు

స్నేహితుడి పుట్టినరోజు సందర్భంగా కొంత మంది యువకులు గోదావరి స్నానానికి వెళ్లారు. ప్రమాదవశాత్తు నలుగురు యువకులు గోదావరిలో పడి గల్లంతయ్యారు. వెంకటాపురం మండలం మరికాల గోదావరి రేవు వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే ఇప్పటికే ప్రకాష్, కార్తీక్, శ్రీకాంత్ మృతదేహాలు లభ్యంమవగా.. అన్వేష్ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. మృతులంతా ఒకే గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు.

కూకట్ పల్లిలో అగ్నిప్రమాదం

హైదరాబాద్‌ కూకట్‌పల్లి కేపీహెచ్ బీ కాలనీలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఓ హార్డ్‌వేర్ షాపులో తెల్లవారుజామున ఈఘటన జరిగింది. ఎలక్ట్రికల్, హార్డ్‌వేర్ షాపులో మంటలు చెలరేగడంతో స్థానికులు ఫైర్‌ సిబ్బందికి సమాచారం అందించారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పివేసేందుకు ప్రయత్నిస్తున్నారు. షార్ట్ సర్క్యూట్ వల్ల అగ్నిప్రమాదం సంభవించి ఉంటుందని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. హార్డ్ వేర్ షాపు కావటంతో లోపల ఉన్న ఎలక్ట్రికల్ వస్తువులు, పెయింట్ డబ్బాలు, ఫ్లై వుడ్ ఉండటంతో మంటలు షాపులోని మూడు అంతస్తులకు వ్యాపించాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories