స్థానిక సంస్థల ఎన్నికలకు రంగం సిద్ధం.. రెండు విడతల్లో ఎంపీటీసీ, జడ్‌పీటీసీ ఎన్నికలు?

స్థానిక సంస్థల ఎన్నికలకు రంగం సిద్ధం.. రెండు విడతల్లో ఎంపీటీసీ, జడ్‌పీటీసీ ఎన్నికలు?
x
Highlights

తెలంగాణలో వచ్చే నెలలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయా.? 42శాతం రిజర్వేషన్లపై ప్రభుత్వం జీవో జారీ చేస్తుందా..? హైకోర్డు గడువుకు ముందే ఈసీ...

తెలంగాణలో వచ్చే నెలలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయా.? 42శాతం రిజర్వేషన్లపై ప్రభుత్వం జీవో జారీ చేస్తుందా..? హైకోర్డు గడువుకు ముందే ఈసీ నోటిఫికేషన్ జారీ చేస్తుందా...? లోకల్ ఎలక్షన్స్‌కు ఎన్నికల సంఘం రెడీగా ఉందా...?

స్థానిక ఎన్నికలపై హైకోర్టు గడువు ముంచుకొస్తుండటంతో ఎన్నికలకు తెలంగాణ సర్కార్ సన్నద్దం అవుతున్నట్లు తెలుస్తుంది. బీసీలకు స్థానిక సంస్థల్లో, విద్య, ఉపాధి, రాజకీయ రంగాల్లో 42శాతం రిజర్వేషన్ల కల్పనకు ప్రభుత్వం జీవో జారీ చేస్తుందని భావిస్తున్నారు. బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని కాంగ్రెస్ పార్టీ మెనిఫెస్టోలో హామీ ఇచ్చింది. 42శాతం రిజర్వేషన్లపై బీసీ సంక్షేమ శాఖ లేదా ప్రణాళిక శాఖ జీవో జారీ చేస్తుందని తెలుస్తోంది. దీని ఆధారంగా పంచాయతీ రాజ్ అధికారులు రిజర్వేషన్లపై జీవో జారీ చేస్తారని అంటున్నారు.

రాష్ట్రంలో గ్రామీణ స్థానిక సంస్థల ఎన్నికల సన్నద్ధత ప్రణాళికను పంచాయతీరాజ్‌ శాఖ విడుదల చేసింది. రిజర్వేషన్ల ఖరారు మార్గదర్శకాలు, ఇతర అంశాలను పేర్కొంది. తెలంగాణలో 12,760 పంచాయతీలు, 1,12,534 వార్డులు, 565 జడ్పీటీసీలు, 5,763 ఎంపీటీసీ స్థానాలకు ప్రత్యక్ష ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలిపింది. ప్రత్యక్ష ఎన్నికల అనంతరం పరోక్షంగా 565 మండల పరిషత్‌లు, 31 జిల్లా పరిషత్‌లకు ఛైర్‌పర్సన్ల ఎన్నికలను నిర్వహిస్తామని పేర్కొంది.

తెలంగాణ సామాజిక, ఆర్థిక, విద్యా, ఉద్యోగ, రాజకీయ, కులగణన సర్వే ప్రాతిపదికన బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తారు. ఎస్సీ, ఎస్టీలకు 2011 జనాభా లెక్కల మేరకు రిజర్వేషన్లు కల్పిస్తారు. తెలంగాణ పంచాయతీరాజ్‌ చట్టం, 2018 ప్రకారం ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళలకు జడ్పీ ఛైర్‌పర్సన్, ఎంపీపీ, ఎంపీటీసీ, జడ్పీటీసీ, సర్పంచి, వార్డు సభ్యుల స్థానాల్లో రిజర్వేషన్లు కల్పిస్తారు. షెడ్యూల్డ్‌ ఏరియాలో ఎంపీటీసీ, వార్డు సభ్యుల రిజర్వేషన్లు ఎస్టీల జనాభా దామాషాలో 50 శాతం తగ్గకుండా ఖరారు చేస్తారు. 100 శాతం ఎస్టీ గ్రామ పంచాయతీల్లో సర్పంచులు, వార్డు సభ్యుల పదవులన్నీ వారికే రిజర్వ్‌ చేస్తారు.

జిల్లా పరిషత్‌ ఛైర్‌పర్సన్ల రిజర్వేషన్లను పంచాయతీరాజ్, గ్రామీణ ఉపాధి కల్పన కమిషనర్‌ ఖరారు చేస్తారు. జడ్పీటీసీ, మండల పరిషత్‌ అధ్యక్ష స్థానాలకు కలెక్టర్‌.. ఎంపీటీసీ, సర్పంచి పదవులకు ఆర్డీవో.. వార్డుల రిజర్వేషన్లను ఎంపీడీవో ఖరారు చేస్తారు. కేటాయింపు ప్రక్రియ.. గత ఎన్నికల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు కేటాయించిన సీట్లను ఈ సారి మినహాయించి, మిగిలిన వాటిలో ఆయా వర్గాలకు రిజర్వేషన్లు కల్పిస్తారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, జనరల్‌ కేటగిరీలలో 50శాతం సీట్లు మహిళలకు కేటాయిస్తారు. గత ఎన్నికల్లో మహిళలకు కేటాయించిన సీట్లను మినహాయించి, మిగిలిన వాటికి లాటరీ పద్ధతి ద్వారా ఈ రిజర్వేషన్లను ఖరారు చేస్తారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు రిజర్వేషన్లు కేటాయించిన తర్వాత మిగిలిన సీట్లను అన్‌ రిజర్వ్‌డ్‌ గుర్తిస్తారు. ఎన్నికల నిర్వహణ తేదీలను ఖరారు చేస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘానికి ప్రభుత్వం సమాచారం ఇవ్వనుందని చర్చ జరుగుతుంది. ముందుగా ఎస్ఈసీ షెడ్యూల్ జారీ చేసి... మరుసటి రోజు నోటిఫికేషన్ విడుదల చేస్తుందని అంటున్నారు. నోటిఫికేషన్ వెలువడితే మూడు వారాల వ్యవధిలో రెండు విడతల్లో ఎంపీటీసీ, జడ్‌పీటీసీ ఎన్నికలు పూర్తి చేయాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. ఇవి ముగిశాక కొన్ని రోజుల వ్యవధిలో గ్రామ పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసి ఆ తర్వాత మూడు వారాల వ్యవధిలోనే ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలనే ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తుంది.

అయితే స్థానిక సంస్థల ఎన్నికలకు ఎస్‌ఈసీ సన్నద్దమైంది. లోకల్ బాడీ ఎలక్షన్స్ కోసం అధికారులు 8నెలల క్రితమే బ్యాలెట్ పేపర్లు ముద్రించారు. రాష్ట్ర వ్యాప్తంగా 50వేల బ్యాలెట్ రిమ్స్, 48వేల బ్యాలెట్ బాక్సులను రెడీ చేశారు. కర్ణాటక, ఏపీ, గుజరాత్ తదితర రాష్ట్రాల నుంచి అదనంగా మరో 18వేల బాక్సులను తెప్పించారు. మైసూరు పెయింట్స్ అండ్ వార్నిష్ కంపెనీ నుంచి ప్రభుత్వం బ్యాలెట్ పేపర్, ఇంకు బాటిల్స్ తీసుకువచ్చింది. ఓటు హక్కు వినియోగించుకున్న తర్వాత ఓటరు ఎడమ చేతి వేలుపై వేసే ఇంక్‌ను పాయిల్స్ బాటిల్ అంటారు. సర్పంచ్ ఎన్నికలకు అవసరమైన లక్ష 48వేల పాయిల్స్ బాటిల్స్‌ను పోలింగ్ కేంద్రాలకు చేరవేశారు. నెలాఖరులోగా నోటిఫికేషన్ సాధ్యం కాకపోతే కసరత్తు వివరాలు హైకోర్టుకు అందజేసి మరింత సమయం కోరే ఛాన్స్ ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories