Telangana HC notice over Online Classes: ఆన్‌లైన్‌ క్లాస్‌ల పిటిషన్‌పై హైకోర్టులో విచారణ

Sumitra
Published on: 3 July 2020 5:02 PM IST
Telangana HC notice over Online Classes: ఆన్‌లైన్‌ క్లాస్‌ల పిటిషన్‌పై హైకోర్టులో విచారణ
X

Telangana HC notice over Online Classes: గత కొద్ది రోజులుగా ఆన్ లైన్ క్లాసుల నిర్వహణ గురించి హైకోర్టులో విచారణ కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే శుక్రవారం కూడా మరో సారి హైకోర్టు విచారణ చేపట్టింది. ఈ ఏడాది విద్యాసంవత్సరం ప్రారంభం కాకముందే ఆన్‌లైన్‌ క్లాసెస్‌ ఎందుకు నిర్వహిస్తున్నారని కోర్టు ఈ విచారణలో భాగంగా ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. అంతేగాక ఆన్‌లైన్‌ క్లాసుల వల్ల ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు, ఆర్థికంగా వెనుకబడిన విద్యార్ధులకు ఎలాంటి న్యాయం జరుగుతుందో ఈ నెల 13వ తేదీలోగా లిఖితపూర్వకంగా నిర్థిష్ట ప్రణాళికను సమర్పించాలని ప్రభుత్వాన్ని న్యాయస్థానం ఆదేశించింది. కాగా అడ్వకేట్ జనరల్ మాట్లాడుతూ ఈ ఏడాది విద్యా సంవత్సరాన్ని ఇంకా ప్రారంభించలేదని క్యాబినెట్‌ సమావేశం అనంతరం దీనిపై తుది నిర్ణయం తీసుకుంటుందని హైకోర్టుకు తెలిపారు.

అంతే కాక ఇండిపెండెంట్‌ స్కూల్‌ మేనేజ్‌మెంట్‌ అసోషియేషన్‌ ఇంప్లీడ్‌(ఇస్మా) ఆన్‌లైన్‌ క్లాసెస్‌పై హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. ఆన్‌లైన్‌ క్లాసుల పేరుతో విద్యార్థుల తల్లిదండ్రులను ఒత్తిడి చేయడం లేదని, ఇది వారికి ఆప్షన్‌ మాత్రమేనని ఇస్మా పిటిషన్‌లో పేర్కొంది. సీబీఎస్ఈ మార్గదర్శకాలకు అనుగుణంగా రెండు నెలల క్రితమే విద్యా సంవత్సరం ప్రారంభించిందని ఇస్మా తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. సీబీఎస్ఈపై రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి నియంత్రణ లేదని ఇస్మా న్యాయవాది కోర్టుకు స్పష్టం చేశారు. పూర్తి​ వివరాలతో కౌంటర్‌ దాఖలు చేయాలని ఇస్మాకు ఆదేశిస్తూ తదుపరి విచారణను ఈనెల 13వ తేదీకి వాయిదా వేసింది.


Sumitra

Sumitra

Next Story