Top
logo

Agriculture Bill: వ్యవసాయ బిల్లుపై మా మద్దతు ఉండదు.. టీఆర్ఎస్ పార్టీ నిర్ణయం

Agriculture Bill: వ్యవసాయ బిల్లుపై మా మద్దతు ఉండదు.. టీఆర్ఎస్ పార్టీ నిర్ణయం
X
Highlights

Agriculture Bill | కేంద్రం ప్రవేశపెట్టిన మూడు వ్యవసాయ బిల్లులపై తమ మద్దతు ఉండబోదని టీఆర్ఎస్ పార్టీ స్పష్టం చేసింది.

Agriculture Bill | కేంద్రం ప్రవేశపెట్టిన మూడు వ్యవసాయ బిల్లులపై తమ మద్దతు ఉండబోదని టీఆర్ఎస్ పార్టీ స్పష్టం చేసింది. ఇప్పటికే ఈ బిల్లులు పార్లమెంటులో ఆమోదం పొందగా, రాజ్యసభకు రానున్నాయి. ఈ నేపథ్యంలో తమ పార్టీ వైఖరిని స్పష్టం చేస్తూ నిర్ణయాన్ని ప్రకటించాయి. కేంద్ర ప్రభుత్వం సోమవారం లోక్‌సభలో ప్రవేశపెట్టిన వ్యవసాయ రంగానికి సంబంధించిన ఈ మూడు బిల్లులను విపక్షాలు, రైతు సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. పంజాబ్, హరియాణా, ఉత్తరప్రదేశ్, ఒడిశా, తెలంగాణ రాష్ట్ర రైతులు వీటిని వ్యతిరేకిస్తూ ఆందోళన బాట పట్టారు. నిరసన ప్రదర్శనలతో హోరెత్తిస్తున్నారు.

ఇన్నాళ్లూ ఆర్డినెన్స్‌ రూపంలో ఉన్న వీటిని బిల్లులుగా మార్చి రైతన్నల కడుపుకొట్టి, కార్పోరేట్లకు అండగా ఉండేందుకే కేంద్రం వ్యూహం పన్నినట్టు ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. రైతుల ప్రయోజనాలను దెబ్బతీసే విధంగా ఉన్న వ్యవసాయ బిల్లును రాజ్యసభలో వ్యతిరేకిస్తామని టీఆర్‌ఎస్‌ పార్టీ ఎంపీలు తెలిపారు. లోక్‌సభలోనూ ఈ బిల్లును తాము వ్యతిరేకించామని, కానీ బీజేపీకున్న సంఖ్యా బలం వల్ల అక్కడ ఆమోదం పొందిందని టీఆర్‌ఎస్‌ లోక్‌సభాపక్ష నేత నామా నాగేశ్వరరావు పేర్కొన్నారు. ఎంపీ కె.కేశవరావు ఆధ్వర్యంలో రాజ్యసభలో ఈ బిల్లును ఆమోదం పొందకుండా తమ పార్టీ అడ్డుకుంటుందని ఆయన వెల్లడించారు.

శనివారం ఢిల్లీలో విజయ చౌక్‌ వద్ద విలేకరులతో ఎంపీలు కేశవరావు, మన్నె శ్రీనివాస్‌రెడ్డి, జోగినిపల్లి సంతోష్‌ కుమార్, ఆర్‌.రాములు, బడుగుల లింగయ్య యాదవ్, సురేశ్‌రెడ్డి, పి.దయాకర్, మాలోత్‌ కవిత మాట్లాడారు. దేశ రైతాంగాన్ని దెబ్బతీసేలా ప్రధాని మోదీ ప్రభుత్వం వ్యవహరిస్తోందని, వారిని బిచ్చగాళ్లను, కూలీలను చేయాలనుకుంటోందా అని నామా ప్రశ్నించారు. ఈ బిల్లుల వల్ల దేశంలో చిన్న రైతులు దెబ్బతింటారని పేర్కొన్నారు.

గతంలో జమీందారీ వ్యవస్థ ఉండేది.. ఇప్పుడు కంపెనీ వ్యవస్థ తెస్తున్నారు అని మండిపడ్డారు. దిగుమతి సుంకాన్ని 50 శాతం నుంచి 35 శాతానికి తగ్గించి 50 లక్షల టన్నుల మొక్కజొన్న దిగుమతికి కేంద్రం అనుమతిచ్చిందన్నారు. తెలంగాణలో కేసీఆర్‌ ప్రభుత్వం గ్రామాల్లో కాటాలు పెట్టి రైతుల దగ్గరకు వెళ్లి 9 లక్షల టన్నుల మొక్కజొన్నను రూ.1,750 కనీస మద్దతు ధరకు కొనుగోలు చేసిందన్నారు. మరోవైపు తమ రాష్ట్రంలో రూ.700 కూడా మొక్కజొన్నను కొనే పరిస్థితి లేదని బీజేపీ ఎంపీ చెబుతున్నారని పేర్కొన్నారు.

ఈ దిగుమతి వల్ల బిహార్, తెలంగాణ, ఏపీ, కర్ణాటక, యూపీ మొత్తం పది రాష్ట్రాల్లోని రైతులకు నష్టం కలుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలోని రైతుల కంటే విదేశీ రైతులపై అంత ప్రేమ ఎందుకని నామా ప్రశ్నించారు. కరోనా, జీడీపీ తగ్గుదలతో అతలాకుతలమవుతోన్న దేశంలో రైతు వ్యతిరేక బిల్లులు ఎందుకు తెస్తున్నారని అడిగారు. తెలంగాణ ప్రభుత్వం రైతులకు అండగా వ్యవహరిస్తుంటే, మోదీ ప్రభుత్వం కాంట్రాక్టు ఫార్మింగ్, ట్రేడ్‌ అగ్రిమెంట్లంటూ రైతులకు వ్యతిరేకంగా పనిచేస్తోందన్నారు.

కార్పొరేట్లను పోషించేందుకే..

రైతుల నడ్డి విరగ్గొట్టే వ్యవసాయ బిల్లును రాజ్యసభలో వ్యతిరేకిస్తామని లింగయ్య యాదవ్‌ తెలిపారు. కేంద్రం తీసుకున్న నిర్ణ యంతో దేశంలో ఉన్న 70 శాతం రైతులకు నష్టం వాటిల్లుతుంన్నారు. కార్పొరేట్‌ సంస్థలను పోషించేందుకే ఇదంతా జరుగుతోందని ఆరోపించారు. రైతు వ్యతిరేక చర్యలు చేపట్టిన ఏ ప్రభుత్వం బాగుపడలేదన్నారు. ఇంతకాలంగా బీజేపీతో కలసి ఉన్న అకాలీదళ్‌ మంత్రి వ్యవసాయ బిల్లుపై రాజీనామా చేశారంటే సమస్య తీవ్రత ప్రభుత్వానికి అర్థం కావడం లేదా అని పి.రాములు అన్నారు.

పెద్ద కంపెనీలకు అనుకూలంగా..

ప్రతి విషయంపైనా చీటికీమాటికీ ఆర్డినెన్స్‌లు తెస్తూ రాజ్యాంగానికి వ్యతిరేకంగా బీజేపీ ప్రభుత్వం వ్యవహరిస్తోందని, ఆర్డినెన్స్‌ల రాజ్యంగా ఆ పార్టీ మారిందని కేశవరావు పేర్కొన్నారు. మోదీ ప్రభుత్వం వ్యవసాయాన్ని పెద్ద కంపెనీలకు అనుకూలంగా మారుస్తోందని ఆరోపించారు. మొక్కజొన్న రైతుల ప్రయోజనాలను దెబ్బతీసేలా దిగుమతి సుంకాన్ని తగ్గించి 50 లక్షల టన్నుల మొక్కజొన్నను దిగుమతికి అనుమతించిందన్నారు.


Web TitleTelangana Government Takes Decision not To Support Agriculture Bill to be Implement by Central Government
Next Story