రేవంత్‌కు పీసీసీ దక్కకుండా సొంత పార్టీ నేతల పావులు

రేవంత్‌కు పీసీసీ దక్కకుండా సొంత పార్టీ నేతల పావులు
x
Revanth Reddy (file Photo)
Highlights

పీసీసీ పీఠం ఎవరికైనా కట్టబెట్టండి అతనికి తప్ప. పదిమందిలో ఎవరినైనా కుర్చీపై కూర్చోబెట్టండి ఆ ఒక్క నాయకుడు తప్ప. అలా కానీ పక్షంలో, అతనికే మీ ఓటు అంటే,...

పీసీసీ పీఠం ఎవరికైనా కట్టబెట్టండి అతనికి తప్ప. పదిమందిలో ఎవరినైనా కుర్చీపై కూర్చోబెట్టండి ఆ ఒక్క నాయకుడు తప్ప. అలా కానీ పక్షంలో, అతనికే మీ ఓటు అంటే, ఇక అసలు పోటు చూస్తారంటూ, కొందరు కాంగ్రెస్ ‌నాయకులు తెగేసి చెప్పేస్తున్నారు. ఆ ఒక్కడంటే, వారికి ఎందుకంత ఫైరింగ్...? ఎవరైనా ఓకే ఆ లీడర్‌ తప్ప అని ఎందుకంటున్నారు?

ఏ నాయకుడైనా తన సుధీర్ఘ రాజకీయ జీవితంలో పార్టీ పరంగానో ప్రభుత్వం పరంగానో అత్యున్నత స్థాయికి చేరుకోవాలని కోరుకోవడం సహజం. ఇది ప్రతి పార్టీలో, ప్రతీ లీడర్‌లో వుండే సహజమైన ఆకాంక్ష. తాజాగా తెలంగాణ కాంగ్రెస్‌లో ఎంతోమంది కార్యకర్త నుంచి ఉన్నతస్థాయికి ఎదిగారు. వారిలో చాలామంది ఇప్పుడు పార్టీ పగ్గాలు చేపట్టేందుకు రెడీ అంటున్నారు. తమ సర్వీస్ ను దృష్టిలో పెట్టుకుని ఒక్క ఛాన్స్‌ ఇవ్వాలంటూ అధిష్టానం ముందు ప్రదక్షిణలు చేస్తున్నారు. ఇలా ప్రయత్నాలు చేస్తున్న వారి సంఖ్య పదికి పైగా ఉన్నా అందులో ఎవరికి వచ్చినా సరే కలసికట్టుగానే పని చేస్తామని చెప్పుకుంటున్నారు. ఇంత వరకు బాగానే ఉంది. కానీ తమతో పాటు ప్రయత్నం చేస్తున్న ఆ వ్యక్తికి వస్తే మాత్రం తామిక పార్టీలో ఉండాలా వద్దా నిర్ణయించుకుంటామని హెచ్చరిస్తున్నారు. ఇంతకీ ఎవరా నాయకుడు?

అవును. ఫైర్‌ బ్రాండ్‌ లీడర్, వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి. అయితేగియితే, తమలో ఎవర్నో ఒకర్ని చెయ్యండి కానీ, నిన్నమొన్న పార్టీలోకి వచ్చి, వెంటనే ఏదో అయిపోవాలని తపిస్తూ, సొంత అజెండాతో ముందుకుపోతున్న రేవంత్‌ను పీసీసీ చీఫ్‌ చేస్తే ఊరుకునేది లేదని బాహాటంగానే వార్నింగ్ ఇస్తున్నారు కాంగ్రెస్ సీనియర్ మోస్ట్ నాయకులు.

తనకు వ్యతిరేకంగా పార్టీలో ఇంత జరుగుతున్నా, రేవంత్‌ రెడ్డి మాత్రం ఎలాగైనా పీసీసీ పీఠం దక్కించుకోవాలని, ఢిల్లీ స్థాయిలో ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్నారు. తన మామ దివంగత నేత, జైపాల్ రెడ్డి ద్వారా వచ్చిన పరిచయాలతో ఢిల్లీలో లాబీయింగ్‌ మొదలుపెట్టారట. అయితే మొదట్లో పరవాలేదు అనుకుని, అధిష్టాన పెద్దలతో పాటు స్టేట్ కాంగ్రెస్‌లోని కొందరు సీనియర్లు సపోర్ట్ చేశారట. పార్టీ కేదో మంచి జరుగుతుందనుకుంటే, మద్దతివ్వాలని మాజీ ఉప ముఖ్యమంత్రి లాంటి వాళ్ళు కూడా కొన్ని కార్యక్రమాల్లో జై రేవంత్‌ అన్నారట. అయినా, తమను పక్కనపెట్టాలని రేవంత్ చూస్తున్నారని, వారు కూడా మనసు మార్చుకుంటున్నారట.

ఎలాగైనా రేవంత్‌కు పీసీసీ పీఠం దక్కకూడదని కంకణం కట్టుకున్న ఒకవర్గం నేతలు, అనేక అస్త్రాలు సంధిస్తున్నారట. ఆయనకు పార్టీ పగ్గాలు అప్పచెప్పితే నిత్యం నోటుకు ఓటు కేసు మొదలు భూ దందాలు, బ్లాక్ మొయిల్ రాజకీయాలతో కాంగ్రెస్ భ్రష్టు పట్టిపోవడం ఖాయమని సీనియర్లు మండిపడుతున్నారట. మరీ ముఖ్యంగా కొన్ని రోజులుగా దళితుల భూమి కబ్జా చేసి దొంగే దొంగా అన్నట్టుగా తిరిగి ప్రభుత్వంపైనే ఆరోపణలు చేసినట్టువుందని, హీరో కావడం కోసం ఏకంగా జైలుకెళ్ళారని, కొందరు సీనియర్లు అధిష్టానానికి అదేపనిగా చెవిలో వేస్తున్నారట. వీటితో పాటు ఇటీవల మున్సిపల్ ఎన్నికల సందర్భంగా పార్టీని తప్పుదోవ పట్టించి భీ ఫామ్‌లు మాయం చేశారని నివేదికలు ఇస్తున్నారట. రేవంత్‌కు పీసీసీ రాకుండా ఎలాగైనా అడ్డుకోవాలని చూస్తున్న వ్యతిరేకవర్గానికి కొన్నిరోజులుగా జరుగుతున్న పరిణామాలు ఆయుధాలయ్యాయని విశ్లేషకులంటున్నారు.

మొత్తానికి పీసీసీ అధ్యక్షున్ని రేపోమాపో ప్రకటిస్తారన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అధిష్టానం రేవంత్‌ వైపే మొగ్గుచూపుతోందన్న వార్తలు గుప్పమంటుండటంతో, ఆయన వ్యతిరేకవర్గం కత్తులు నూరుతోంది. ఆఖరి నిమిషంలో అన్నిరకాల అస్త్రాలనూ బయటికి తీసి, రేవంత్‌కు పీసీసీ రాకుండా అడ్డుకోవాలని భావిస్తోంది. అందుకే, పార్టీలో ఎవరికైనా ఇవ్వండి, రేవంత్‌కు తప్ప అని కండీషన్లు పెడుతున్నారు ఆశావహులు. చూడాలి, పీసీసీ చీఫ్ నియామకం గాంధీభవన్‌లో ఎలాంటి ప్రకంపనలు రేపుతుందో.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories