తెలంగాణ కాంగ్రెస్‌ నేతలకు బోర్‌ కొట్టిందా?

Telangana Congress Leaders Busy on US Tour | Off The Record
x

తెలంగాణ కాంగ్రెస్‌ నేతలకు బోర్‌ కొట్టిందా?

Highlights

* రచ్చబండకు ఉన్నఫళంగా ఎందుకు బ్రేక్‌ ఇచ్చారు?

Telangana Congress: తెలంగాణ రాష్ట్రంలో పల్లెపల్లెకు రచ్చబండ కార్యాక్రమంతో రచ్చ చేస్తామన్న అ నేతలు ఎందుకు దేశం విడిచి వెళ్లారు? ఆ నేతల విదేశీ పర్యటనల వెనుక ఉన్న రహస్యమేంటి? ఫ్యామిలీ ట్రిప్ అంటూ అబ్రాడ్‌ వెళ్లిన అ నేతలు అక్కడ ఎం చేస్తున్నారు? ఎండకాలం వేడి నుంచి, రాజకీయ వాడి నుంచి తప్పించుకునేందుకు, కాస్త ఉపశమనం కోసమన్నట్టు ఏదో ఊరట చెందుతామన్నట్టు ఫ్లైట్‌ ఎక్కిన కాంగ్రెస్‌ లీడర్లు ఎవరు? పోటాపోటీగా విదేశి పర్యటనలు చేయడం వెనుకున్న అసలైన రీజన్‌ ఏంటి?

వరంగల్‌ సభలో ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీ రైతు డిక్లరేషన్ ప్రకటించారు. ఆ రైతు డిక్లరేషన్‌ని పల్లెపల్లెకు రచ్చబండ కార్యక్రమంతో ఈనెల 21 నుంచి ప్రజల్లోకి వెళ్లింది కాంగ్రెస్. గ్రామాల్లో రచ్చబండతో రైతు డిక్లరేషన్ వివరించడంతో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలను ఎండగడతామన్నంత కసిగా కదిలారు కాంగ్రెస్‌ నేతలు. అలాంటిది ఒక్కసారిగా వారికి బోర్‌ కొట్టినట్టే కనిపించిందట. ఆ ఏం రచ్చబండలు ఎప్పుడూ ఉండేవేలే అంటూ కుటుంబ సభ్యుల నుంచి ఒత్తిడి కూడా వచ్చిందట. బహుశా వాళ్లకు వాళ్లు కూడా ఇలాగే అనుకోవచ్చు అందుకే రచ్చబండని అలా మధ్యలోనే వదిలిపెట్టారు. విదేశాల పర్యటనల కోసమని రయ్‌మని ఫ్లైట్‌ ఎక్కేశారు.

రచ్చబండ కార్యక్రమాన్ని ప్రొపెసర్ జయశంకర్ సొంతూరులో ప్రారంభించిన పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి వారం రోజులపాటు చుట్టుపక్కల గ్రామాలను చుట్టేశారు. అయితే, ప్రజలకు అప్పుడప్పుడే రచ్చబండ గురించి అర్థమవుతున్న వేళ దాని లక్ష్యమేంటో కాంగ్రెస్‌ క్యాడర్‌ ప్రజలకు వివరించి చెబుతున్న వేళ రచ్చబండ హఠాత్తుగా బ్రేక్‌ చేశారు రేవంత్‌. ప్యామిలీ ట్రిప్ అంటూ అమెరికా టూర్‌కు వెళ్లారు. ఈయనే కాదు, పీసీసీ స్టార్ క్యాంపెయనర్‌గా ఉన్న ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అయితే రచ్చబండ కార్యక్రమానికి ముందే అమెరికా వెళ్లారు. మరో పీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీగౌడ్ కూడా అమెరికా పర్యటనలో బిజీబీజీగా గడుపుతున్నారు. ఇక పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్‌ మహేష్‌కుమార్‌గౌడ్ ఈ మధ్యే విదేశీ పర్యటన ముగించుకొని తెలంగాణకు చేరుకున్నారు.

గ్రామాల్లో రచ్చబండ కార్యక్రమాలతో రచ్చ చేస్తామన్న ఈ సీనియర్‌ కాంగ్రెస్ నేతలంతా విదేశాల పర్యటనలో బిజీగా ఉండటంతో రాజకీయ వర్గాల్లో రకరకాల గుసగుసలు వినిపిస్తున్నాయి. రాహుల్ తెలంగాణలో పర్యటించిన తరువాత కాంగ్రెస్‌లో వచ్చిన జోష్‌ను కంటిన్యూ చేయకుండా ఇలా రచ్చబండ కార్యక్రమాన్ని మధ్యలో వదిలేసి వెళ్లడంపై భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన రచ్చబండతో జోష్‌ని కొనసాగించకుండా విదేశాల పర్యటనలు చేస్తుండటంతో కాంగ్రెస్ శ్రేణులు నిరుత్సాహానికి గురవుతున్నారట. అందరూ కలిసికట్టుగా ఐక్యంగా పోరాటం చేస్తామన్న నేతలు ఇలా వ్యవహరించడం బాగోలేదన్న చర్చ జరుగుతోంది. సరే! ఈ సీనియర్లు విదేశాల పర్యటనల్లో ఉంటే మరికొంత మంది నేతలైతే తమ నియోజకవర్గాల్లో రచ్చబండ కార్యక్రమాలనే ప్రారంభించలేదట. అసలు వాళ్లకు పట్టింపులేనిది తమకెందుకు వచ్చింది లే అని లైట్‌ తీసుకున్నారట.

రచ్చబండ ప్రారంభించిన రోజు కాంగ్రెస్‌ నేతలు ఏం చెప్పారు.! నెల రోజుల పాటు అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తామన్నారు. అలాంటిది రచ్చబండ కార్యక్రమాన్ని అర్ధాంతరంగా మధ్యలోనే వదిలి నేతలు విదేశాల పర్యటనల వెనుక రహస్య కారణాలు ఉన్నాయనే వార్తలు వినిపిస్తున్నాయి. ఫ్యామిలీ ట్రిప్ అంటూ అమెరికా వెళ్లినా రాబోయే ఎన్నికల్లో నిధుల సేకరణే రేవంత్‌ ముఖ్య ఉద్దేశమని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. న్యూ జెర్సీలో జరిగే ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ సమావేశానికి హాజరయ్యేందుకు అమెరికా ఫైట్‌ ఎక్కిన రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, మధుయాష్కిగౌడ్ మరో నాలుగైదు సమావేశాల్లో కూడా పాల్గొంటారని సమాచారం.

ఏమైనా, రచ్చబండ కార్యక్రమాన్ని అర్ధాంతంగా వదిలి విదేశాల బాట పట్టిన కాంగ్రెస్‌ సీనియర్ల వైఖరిపై క్యాడర్‌ నిరుత్సాహంగా ఉంది. మరి ముఖ్యనేతల విదేశీ పర్యటనల లక్ష్యం నెరవేరుతుందో, అది ఎటు వైపు దారి తీస్తుందో వేచి చూడాల్సిందే.


Show Full Article
Print Article
Next Story
More Stories