Top
logo

మరణించిన ప్రతి ఒక్కరికీ కరోనా పరీక్షలు చేయడం సాధ్యం కాదు :సీఎం కేసీఆర్

మరణించిన ప్రతి ఒక్కరికీ కరోనా పరీక్షలు చేయడం సాధ్యం కాదు :సీఎం కేసీఆర్
X
KCR (file photo)
Highlights

తెలంగాణ వైద్య సిబ్బంది ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే ప్రయత్నాలు జరుగుతున్నాయని సీఎం కేసీఆర్ మండిపడ్డారు.

తెలంగాణ వైద్య సిబ్బంది ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే ప్రయత్నాలు జరుగుతున్నాయని సీఎం కేసీఆర్ మండిపడ్డారు. కరోనా రోగుల చికిత్సకు అవసరమైన అన్ని సదుపాయాలు రాష్ట్రంలో ఉన్నాయన్న ముఖ్యమంత్రి.... ఎంతమందికైనా వైద్యసేవలు అందించే సామర్ధ‌్యం తెలంగాణ ప్రభుత్వ ఆస్పత్రులకు ఉందన్నారు. కరోనా రోగులకు అందిస్తున్న చికిత్స, సదుపాయాలపై కావాలనే కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఒక్క గాంధీ ఆస్పత్రిలోనే 2వేల మందికి పైగా చికిత్స చేసే సామర్ధ్యంతోపాటు... ఆక్సిజన్ సౌకర్యమున్న పడకలు వెయ్యి ఉన్నాయన్నారు. అయితే, ప్రస్తుతం గాంధీ ఆస్పత్రిలో 247మంది రోగులు మాత్రమే ఉన్నారని, కానీ కరోనా పేషెంట్లతో హాస్పిటల్ కిక్కిరిసిపోయిందని తప్పుడు ప్రచారం చేస్తున్నారని ముఖ్యమంత్రి కేసీఆర్ మండిపడ్డారు.

మరణించిన ప్రతి ఒక్కరికీ కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించాలన్న హైకోర్టు ఆదేశాలు అమలు సాధ‌్యంకాదని ముఖ్యమంత్రి కేసీఆర్ అభిప్రాయపడ్డారు. ఏ కారణంతో మరణించినా సరే కోవిడ్‌ టెస్టులు చేయాలనడం సరికాదన్నారు. రాష్ట్రంలో ప్రతిరోజూ సగటున 9వందల నుంచి వెయ్యి మంది మరణిస్తుంటారని... వారందరికీ పరీక్షలు చేయడం ఎలా సాధ్యమవుతుందని వ్యాఖ్యానించారు. డెడ్‌ బాడీస్‌కు పరీక్షలు చేయడమే పనిగా పెట్టుకుంటే... ఆస్పత్రుల్లో రోగులకు వైద్య సేవలు అందించడం సాధ‌్యంకాదని అన్నారు. డబ్ల్యూహెచ్‌వో గానీ, కేంద్ర ప్రభుత్వం గానీ, ఐసీఎంఆర్ గానీ... మృతదేహాలకు కరోనా నిర్ధారణ పరీక్షలు చేయాలని చెప్పలేదన్న సీఎం కేసీఆర్.... హైకోర్టు ఆదేశాలపై సుప్రీంకు వెళ్లాలని భావిస్తోంది.

కరోనా కేసులు, ట్రీట్ మెంట్ విషయంలో వాస్తవ పరిస్థితికి... జరుగుతున్న ప్రచారానికి అసలు పొంతన లేదన్నారు కేసీఆర్‌. కరోనా వైరస్ వ్యాపించకుండా ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటోందని స్పష్టంచేశారు. రాష్ట్రంలో తొమ్మిదిన్నర లక్షలకు పైగా పీపీఈ కిట్లు, 14లక్షల ఎన్‌-95 మాస్కులు అందుబాటులో ఉన్నాయని అన్నారు. ఇక, కరోనా విధుల్లో ఉన్నవారికి వైరస్ సోకడం ప్రపంచవ్యాప్తంగా జరుగుతోందన్న కేసీఆర్.... ఐసీఎంఆర్ లెక్కల ప్రకారం దేశంలో 10వేల మంది వైద్య సిబ్బంది కోవిడ్ బారినపడ్డారని గుర్తుచేశారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 153మంది వైద్య సిబ్బందికి వైరస్ సోకిందని, అయితే ఎవరి పరిస్థితీ విషమంగా లేదని తెలిపారు.

ప్రభుత్వ వెర్షన్ ఇలాగుంటే, హైకోర్టు మాత్రం కరోనా టెస్టుల విషయంలో తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేసింది. ఏ కారణంతో మరణించినాసరే కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించాల్సిందేనని మరోసారి ఆదేశించింది. తమ ఆదేశాలను అమలు చేయకపోతే వైద్యారోగ్యశాఖ ముఖ్య కార్యదర్శితోపాటు ప్రజారోగ్యశాఖ డైరెక్టర్ బాధ్యత వహించాల్సి ఉంటుందని న్యాయస్థానం హెచ్చరించింది. అలాగే, ప్రజల్లో కరోనా ర్యాండమ్ టెస్టులు ఎందుకు చేయడం లేదని హైకోర్టు ఆగ్రహం వ్యక్తంచేసింది. సుప్రీం నిర్ణయం వచ్చేవరకు తమ ఆదేశాలను అమలు చేయాల్సిందేనని హైకోర్టు స్పష్టంచేసింది. తమ ఆదేశాలను అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై లేదా? అంటూ ప్రశ్నించింది. అలాగే, మీడియా బులెటిన్లలో తప్పుడు లెక్కలు ఇస్తే కోర్టు ధిక్కరణ చర్యలు చేపడతామని వార్నింగ్ ఇచ్చింది. రక్షణ కిట్లు తగినంత సరఫరా చేయనందుకే వైద్య సిబ్బందికి కరోనా సోకిందని ధర్మాసనం వ్యాఖ్యానించింది.

ఇదిలా ఉంటే, తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకీ పెరుగుతూనే ఉంది. ఇప్పటివరకు 3742మందికి వైరస్ సోకగా, సోమవారం ఒక్కరోజే 92 కేసులు నమోదు అయ్యాయి. లేటెస్ట్ హెల్త్ బులెటిన్ ప్రకారం సోమవారం ఐదుగురు మృత్యువాత పడగా, కరోనా కాటుకు బలైనవారి సంఖ్య 142కి పెరిగింది.


Web TitleTelangana cm kcr says it is not possible to perform Coronavirus tests for every one who died
Next Story