కాషాయంలో కొలువుల కుంపట్లు రాజుకుంటున్నాయా?

కాషాయంలో కొలువుల కుంపట్లు రాజుకుంటున్నాయా?
x
Highlights

తెలంగాణ బీజేపీలో పదవుల కేటాయింపు ఎప్పుడు..? పదవుల కోసం పాత వర్సెస్ కొత్త నాయకుల మధ్య యుద్ధం తప్పదా? పార్టీలో సముచిత స్థానం హామీతో పార్టీలో చేరినవాళ్ళు...

తెలంగాణ బీజేపీలో పదవుల కేటాయింపు ఎప్పుడు..? పదవుల కోసం పాత వర్సెస్ కొత్త నాయకుల మధ్య యుద్ధం తప్పదా? పార్టీలో సముచిత స్థానం హామీతో పార్టీలో చేరినవాళ్ళు ఓ వైపు ఏళ్లుగా పార్టీకి సేవలందిస్తున్న వారు మరోవైపు ఇలా ఢిల్లీలో పదవుల కోసం తీవ్రంగా లాబీయింగ్ చేస్తున్నారా? అయితే ఈ పదవుల పోటీ, చివరకు ఎలాంటి పరిస్థితులకు దారి తీయనుందన్న చర్చ, ఇప్పుడు పార్టీలో కొత్త గుబులుకు కారణమవుతోంది?

తెలంగాణలో కాంగ్రెస్‌ను రీప్లేస్ చేసి, టీఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయంగా బలపడాలనుకుంటోంది భారతీయ జనతా పార్టీ. ఇప్పటికే క్షేత్రస్థాయిలో కార్యకర్తలను మోహరింపజేస్తోంది. పార్టీ రాష్ట్ర నాయకత్వంతో పాటు కీలక పదవుల ప్రక్షాళనకు సిద్దమవుతోంది. దీంతో పదవులపై గంపెడాశలు పెట్టుకున్నారు రాష్ట్ర బీజేపీ నేతలు. అనుకున్నట్లుగానే ప్రస్తుతం టీబీజేపీలో పార్టీ పదవుల కోసం, నేతల మధ్య పోటీ తీవ్రంగానే ఉంది. ఈ పదవులపై బీజేపీ నేతల్లో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. డిసెంబర్‌లో పార్టీకి సంబంధించిన అన్ని స్థాయిల్లో కొత్త నాయకత్వానికి బాధ్యతలు అప్పగించనుంది అధిష్టానం. అయితే ఇప్పటికే పలువురు పార్టీ నేతలు తమ తమ స్థాయిల్లో పార్టీ పదవుల కోసం కేంద్ర నాయకత్వం దగ్గర లాబీయింగ్ చేయడం మొదలు పెట్టారట. ఇది తెలిసిన పార్టీ ఛీఫ్ అమిత్ షా ముందు మెంబర్ షిప్ డ్రైవ్ పై దృష్టి పెట్టండి ఆ తర్వాత పదవుల గురించి ఆలోచిద్దాం అని చెప్పినట్లు సమాచారం.

పార్టీ పదవులు గతంలో అనుభవించిన వారికి కాకుండా, కొత్త వారికి అవకాశం కల్పించాలని కోరుతున్నారట కొంత మంది బీజేపీ నేతలు. ఎన్నో ఏళ్ళుగా పార్టీ కోసం పనిచేస్తున్నా, పార్టీ పదవులు మాత్రం ఇవ్వట్లేదన్న అసహనం కొందరి నేతల్లో ఉందని, ఈ అంశాన్ని కేంద్ర నాయకత్వం పరిగణలోకి తీసుకోవాలని కోరుతున్నారు. ప్రస్తుతం పార్టీ పదవులు అనుభవిస్తున్న నేతలు మాత్రం, మరోసారి ఇదే కార్యవర్గాన్ని కొనసాగించాలని కోరుతున్నారట. పార్టీ బలపడుతున్న సమయంలో కొత్త వారికి అవకాశం ఇవ్వడం వల్ల పార్టీలో చేరికలు, పార్టీ కార్యక్రమాలపై ఎఫెక్ట్ పడుతుందని సూచిస్తున్నారని తెలుస్తోంది.

పార్టీలో ప్రస్తుతం చేరిన, చేరబోయే నాయకులకు, పాత నాయకుల మధ్య పార్టీ పదవుల కోసం కోల్డ్ వార్ జరిగే అవకాశం లేకపోలేదు. ప్రస్తుతం పార్టీలో చేరేవారంతా పార్టీ పదవులపై ఆశతోనే చేరుతున్నారు. పార్టీ నాయకులు కూడా ఏదో ఒక పదవి ఇస్తామని చెప్పి, కండువా కప్పుతున్నారనే ప్రచారం, పార్టీ నేతల్లో జరుగుతోంది. ఇదేగనుక నిజమైతే పాత కొత్త నాయకుల మధ్య తీవ్ర పోటీ ఉండే అవకాశమే ఉంది. కొన్నేళ్లుగా ఎటువంటి పదవులు లేకపోయినా పార్టీ కోసం పనిచేసిన వారిని పక్కన పెట్టి కొత్త వారికి అవకాశం ఇస్తే పార్టీలో గ్రూపులు తయారవ్వడం ఖాయం. అదే జరిగితే పార్టీ పతనానికి పార్టీ నాయకులే నాంది పలికినట్లు అవుతుందన్న ఆందోళన, కార్యకర్తల్లో వ్యక్తమవుతోంది.

బీజేపీలో పదవుల పంపకాలు పూర్తయితే, కుంపట్లు చెలరేగడం ఖాయంగా కనిపిస్తోంది. ముందుగా నేతలకు సర్దిజెప్పి, ఆశావహుల మైండ్‌సెట్‌ చేయడం కీలకమని, సీనియర్ నేతలు అధిష్టానానికి సూచిస్తున్నారు. ఈ సంక్షోభాన్ని పరిష్కరించకపోతే ఎన్నికల సమయానికి కుంపట్లు, అసహనాలు బయటపడి కాంగ్రెస్‌కు పట్టిన గతే బీజేపీకి పట్టే అవకాశముందని హెచ్చరిస్తున్నారు. తెలంగాణలో తామే ప్రత్యామ్నాయమని చెప్పుకుంటున్న బీజేపీ, అసంతృప్తి నాయకులకు ఎలాంటి ప్రత్యామ్నాయం చూపుతుందో చూడాలి.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories