తెలంగాణ ఇంటర్ పరీక్షలపై సందిగ్ధత!

తెలంగాణ ఇంటర్ పరీక్షలపై సందిగ్ధత!
x
Highlights

విద్యార్థులు, వారి భవిష్యత్‌పై కరోనా తీవ్రమైన ప్రభావం చూపుతోంది. ఇప్పటికే విద్యా సంవత్సరం గందరగోళంగా మారగా.. అటు పరీక్షలు ఎప్పుడు జరుగుతాయి..? వాటి నిర్వహణ ఎలా అనేది ప్రశ్నార్థకంగా మారింది.

విద్యార్థులు, వారి భవిష్యత్‌పై కరోనా తీవ్రమైన ప్రభావం చూపుతోంది. ఇప్పటికే విద్యా సంవత్సరం గందరగోళంగా మారగా.. అటు పరీక్షలు ఎప్పుడు జరుగుతాయి..? వాటి నిర్వహణ ఎలా అనేది ప్రశ్నార్థకంగా మారింది. ఎలాగోలా ఆన్‌లైన్‌ క్లాసులతో పాఠాలు చెబుతున్నా.. ఫిజికల్ క్లాసులు లేకుండా ఎలా ఎగ్జామ్ నిర్వహించాలనే సందేహం నెలకొంది.

విద్యా సంవత్సరం ముగింపు దశకు వచ్చేస్తుంది. అయినా ఇప్పటి వరకు ఇంటర్ కాలేజీల్లో ఫిజికల్ క్లాసులు స్టార్ట్ కాలేదు. దీంతో ఎగ్జామ్స్ ఎలా పెట్టాలంటూ అధికారుల్లో టెన్షన్ మొదలైంది. డిసెంబర్ వచ్చిందంటే ఎగ్జామ్ సీజన్ దాదాపు వచ్చేసినట్లే. అయితే ఈ సారి కరోనా కారణంగా డైరెక్ట్ క్లాసులు లేకపోవడంతో స్టూడెంట్స్ పరిస్థితి అయోమయంగా మారింది. కనీసం కొన్ని రోజులైనా ఫిజికల్ క్లాసులు పెడితేనే పబ్లిక్ ఎగ్జామ్స్ నిర్వహించవచ్చని, లేకుంటే స్టూడెంట్స్ ఎగ్జామ్స్ రాయడం కష్టమని అధికారులు ఆలోచిస్తున్నారు.

2020-21 విద్యాసంవత్సరానికి గాను సెప్టెంబర్ 1 నుంచి సెకండియర్, అక్టోబర్ 15 నుంచి ఫస్టియర్‌కు డిజిటల్ క్లాసులు మొదలయ్యాయి. ఏటా వీరికి ఒక్కో సబ్జెక్టులో 180 క్లాసులు జరగాల్సి ఉండగా.. ఈ ఏడాది సిలబస్ 30 శాతం తగ్గించారు. దీంతో ఒక్కో సబ్జెక్టు 130 క్లాసులైనా జరగాల్సి ఉంది. కానీ ఇప్పటివరకు 30 శాతం సిలబస్‌ కూడా పూర్తి కాలేదు. సెకండియర్‌లో 241 చాప్టర్లుండగా, 409 క్లాసులు మాత్రమే టీవీల్లో టెలికాస్ట్ అయ్యాయి. హ్యూమానిటీస్ లో 41 చాప్టర్ల నుంచి 106, సైన్స్ సబ్జెక్టుల్లో 68 చాప్టర్లుంటే 264 క్లాసులు ప్రసారం చేశారు. ఫస్టియర్ లో 247 చాప్టర్లు ఉండగా.. 185 క్లాసులు ప్రసారం అయ్యాయి. అయితే ఫిజికల్ క్లాసులు లేకపోవటంతో ఈ టెలికాస్ట్ అయిన సిలబస్‌ కూడా అర్థం కాలేదని విద్యార్దులు తలలు పట్టుకుంటున్నారు.

సిలబస్‌ సమస్యలు ఒకవైపు.. ఆన్‌లైన్‌లో క్లాసులు అర్థం కాకపోవటం మరోవైపు పరీక్షల నిర్వహణకు సమస్యగా మారాయి. ఇక ఈ అకాడమిక్ ఇయర్‌లో అడ్మిషన్ల గడువును కూడా ఈనెల 12 వరకు తెలంగాణ ఇంటర్ బోర్డ్ జీవో ఇచ్చింది. దీంతో అడ్మిషన్ల ప్రక్రియ కూడా పూర్తి కాకుంటే పరిక్షలు ఎలా నిర్వహిస్తారనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. దీంతో ఇంటర్ ఎగ్జామ్స్ నిర్వహణ తెలంగాణ ఇంటర్ బోర్డుకు సవాల్‌గా మారనుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories