Supreme Court: తెలంగాణలో పార్టీ మారిన ఎమ్మెల్యేలపై 3 నెలల్లో నిర్ణయం తీసుకోవాలి

Supreme Court Ruling on MLAs Disqualification for Party Switching
x

Supreme Court: తెలంగాణలో పార్టీ మారిన ఎమ్మెల్యేలపై 3 నెలల్లో నిర్ణయం తీసుకోవాలి

Highlights

Supreme Court: తెలంగాణలో పార్టీ మారిన ఎమ్మెల్యేలపై దాఖలైన అనర్హత పిటిషన్ల వ్యవహారంలో సుప్రీంకోర్టు కీలక తీర్పును వెలువరించింది.

Supreme Court: తెలంగాణలో పార్టీ మారిన ఎమ్మెల్యేలపై దాఖలైన అనర్హత పిటిషన్ల వ్యవహారంలో సుప్రీంకోర్టు కీలక తీర్పును వెలువరించింది. ఈ కేసులో తెలంగాణ హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు రద్దు చేసింది. స్పీకర్ 3 నెలల వ్యవధిలోపే నిర్ణయం తీసుకోవాలని ఆదేశిస్తూ, ముఖ్యమైన వ్యాఖ్యలు చేసింది.

భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ తీర్పును వెల్లడించింది. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై నిర్ణయం తీసుకోవడం స్పీకర్ బాధ్యతగా పేర్కొంది. “అపరేషన్ సక్సెస్, పేషెంట్ డెడ్” అన్న తత్వం రాజ్యాంగ వ్యవస్థల్లోకి రాకూడదని స్పష్టంగా చెప్పింది.

అలాగే, పార్టీ మారిన ఎమ్మెల్యేలపై నేరుగా న్యాయస్థానమే అనర్హత వేటు వేయాలన్న వాదనను తిరస్కరించింది. ఇదే సమయంలో, మైనారిటీ ప్రభుత్వాలు మద్దతుతో గద్దె ఎక్కే పరిస్థితులను అరికట్టేందుకు పార్లమెంట్‌లో చట్ట సవరణ అవసరమని అభిప్రాయపడింది.

పార్టీ ఫిరాయించిన 10 మంది ఎమ్మెల్యేల అనర్హతపై తగిన చర్యలు తీసుకోవాలంటూ భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్‌) పార్టీ నేతలు – కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, పాడి కౌశిక్ రెడ్డి, కేపీ వివేకానంద్, జి. జగదీశ్ రెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డి, చింతా ప్రభాకర్, కల్వకుంట్ల సంజయ్ తదితరులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

భాజపా శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి కూడా విడిగా పిటిషన్ వేశారు. ఈ పిటిషన్లు 2024 జనవరి 15న దాఖలవగా, దాదాపు తొమ్మిదిసార్లు విచారణ జరిగింది. జస్టిస్ గవాయ్, జస్టిస్ ఆగస్టీన్ జార్జ్ మసీహ్‌లతో కూడిన ధర్మాసనం అన్ని వాదనలు విన్న అనంతరం ఏప్రిల్ 3న తీర్పును రిజర్వ్ చేసింది. చివరకు, ఈ రోజు (జులై 31) తీర్పు వెలువడింది.

ఈ కేసులో ప్రతివాదులుగా తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, ఫిరాయించిన ఎమ్మెల్యేలు పి. శ్రీనివాస రెడ్డి, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, కాలే యాదయ్య, టి. ప్రకాశ్ గౌడ్, ఎ. గాంధీ, గూడెం మహిపాల్ రెడ్డి, ఎం. సంజయ్ కుమార్ తదితరులు ఉన్నారు.

ఈ తీర్పు భవిష్యత్తులో ఫిరాయింపులపై స్పష్టమైన సూత్రాలను ఏర్పరచేలా ఉంది. స్పీకర్‌లు పక్షపాతం ప్రదర్శించకుండా, నిర్ణీత గడువులో చర్యలు తీసుకోవాలని ఇది స్పష్టమైన సంకేతం. పార్టీ ఫిరాయింపు చట్టాన్ని మరింత బలంగా మార్చే అవసరం ఉన్నదన్న సందేశాన్ని కూడా ఈ తీర్పు ఇస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories