కృష్ణ బియ్యంతో గుండె సంబంధిత వ్యాధులు, కేన్సర్, ఊబకాయం నయం

కృష్ణ బియ్యంతో గుండె సంబంధిత వ్యాధులు, కేన్సర్, ఊబకాయం నయం
x
Highlights

ఇప్పటి వరకు అంతా వైట్ రైస్, బ్రౌన్ రైస్ ని చూసాం. అవే తింటున్నాం కూడా. అయితే మనదేశంలో బ్లాక్ రైస్ ఉన్నట్టు ఎంత మందికి తెలుసు. నల్లని రంగులో ఉండే...

ఇప్పటి వరకు అంతా వైట్ రైస్, బ్రౌన్ రైస్ ని చూసాం. అవే తింటున్నాం కూడా. అయితే మనదేశంలో బ్లాక్ రైస్ ఉన్నట్టు ఎంత మందికి తెలుసు. నల్లని రంగులో ఉండే బియ్యపు గింజలను చూసారా..? వేదకాలం నాటి సాగు పద్ధతితో నల్లని బియ్యాన్ని సాగు చేస్తున్న ఓ యువ రైతు పై హెచ్ఎంటీవీ స్పెషల్ స్టోరి.

మనం రోజు తినే అన్నం తెల్లటి రూపంలో ఉండటం తరతరాల నుండి చూస్తూనే ఉన్నాం. అయితే వేదకాలంలో భారతదేశ పంటల్లో ఒకటైన కృష్ణ బియ్యాన్ని సాగు చేస్తూ ఇప్పటి తరానికి ఆ బియ్యాన్ని చూపించే ప్రయత్నం చేస్తున్నాడు ఓ యువకుడు. కృష్ణ బియ్యం అంటే నలుపు రంగులో ఉండే బియ్యం. మన భారతదేశంలో వందల ఏళ్ల క్రితం ఇవి పండించేవారని కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండ‌లం కాశింపేట గ్రామానికి చెందిన యువరైతు కౌటిల్య కృష్ణన్ చెప్తున్నారు. తిరుప‌తి జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో ఎం.ఏ. యజుర్వేదం చ‌దువుతున్న ఇతను వేదాల ఆధారంగా వ్య‌వ‌సాయంలో ప్ర‌యోగాలు చేస్తూ నల్ల బియ్యాన్ని విజవంతంగా పండిస్తున్నారు.

కృష్ణ వ్రీహి అని పిలిచే ఈ కృష్ణ బియ్యానికి ఇటీవలే జియోగ్రాఫిక‌ల్ ఇండికేష‌న్‌ ట్యాగ్ వచ్చిందని చెబుతున్నారు కౌటిల్య. మణిపూర్, ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్ ప్రాంతాల్లో కృష్ణ బియ్యానికి జీఐ ట్యాగ్ లభించినట్టు సమాచారం. కృష్ణ బియ్యం ప్రత్యేకమైన ఛాయగల దేశవాళీ వరి రకం. ఇతర రకాలతో పోల్చినపుడు దీనిలో అత్యధిక యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయని ఈ యువ రైతు చెబుతున్నారు. బ్రౌన్ రైస్ కన్నా ఎక్కువ ప్రొటీన్ కంటెంట్ కృష్ణ బియ్యంలో ఉండడమే కాకుండా, అనేక ఆరోగ్య ప్రయోజనాలు కూడా చేకూరుతాయి.

భారత దేశంలో ప్రాచీన చరిత్ర అత్యున్నతమైంది. ఎన్నో అద్భుతాలాని తనలో దాచుకుంది ఈ పుణ్య భూమి. పూర్వకాలంలో భారతీయ వ్యవసాయ విధానం కూడా ఇలాంటి గొప్ప అనుభూతులనే ఇప్పటివారికి అందిస్తుంది.

కృష్ణ బియ్యాన్ని వాడడం వలన గుండె సంబంధిత వ్యాధులు, కేన్సర్, ఊబకాయం మొదలైన వ్యాధులు నయం కావడంలో ముఖ్యపాత్ర పోషిస్తున్నట్లు రుజువైందని ఓ ప్రచారం ఉంది. కొన్ని రకాల కణుతులపై యాంటీ ఇన్‌ప్లమేటరీ ఎఫెక్ట్ చూపిస్తున్నట్లు వెల్లడి కావడమే కాకుండా, యాంథోసయనిన్ అత్యధికంగా గల ధాన్యాల్లో కృష్ణ బియ్యం ఒకటి. ఇందులో 18 ముఖ్యమైన అమినో ఆమ్లాలు, ఐరన్, జింక్, కాపర్, కెరొటిన్, పైబర్, విటమిన్లు, మినరల్స్ ఉంటాయి. అమెరికా వ్య‌వ‌సాయ విభాగం ప్రకటించిన వివరాల ప్రకారం కృష్ణ బియ్యంలో పోషకాలు ప్రొటీన్లు అధికంగా ఉంటాయని చెబుతున్నారు. అనేక తీవ్ర వ్యాధుల నుంచి కాపాడుకోవడానికి కృష్ణ బియ్యం ఉపయోగపడతాయని పరిశోదకుల పరిశీలనలో ఉన్నట్టు తెలిసింది.

అత్యంత ప్రాచీన వరి రకాల్లో కృష్ణ బియ్యం ఒకటి. ప్రాచీన కాలంలో ఈ వరికి ధార్మిక‌ ప్రాధాన్యం ఉండేది. వీటిని యజ్ఞాలు, ఇతర పండుగల్లో ఉపయోగించేవారని నానుడి. ప్రాచీన భారతీయులకు కృష్ణ బియ్యం లక్షణాలు, దాని ఉపయోగాలు బాగా తెలుసు. అనేక ప్రాచీన గ్రంథాల్లో కృష్ణ బియ్యం గురించి వివరించారు. 'ఆయుర్వేద మమోదధి'లో అనేక వరి రకాలను వర్గీకరించడమే కాకుండా, వాటి విశిష్టతను కూడా వివరించారు. కృష్ణ బియ్యానికున్న‌ ఔషధ లక్షణాలను కూడా వివరించారు. కృష్ణ బియ్యాన్ని చర్మ రుగ్మతలను నయం చేయడానికి ఉపయోగించేవారనే నమ్మకం ఉంది. రోగ నిరోధక శక్తిని పెంచడానికి, శారీరక బలం వృద్ధికి వీటిని ఉపయోగించేవారు. కృష్ణ బియ్యం వంటి దేశవాళీ రకాలను కాపాడటానికి వ్యవసాయ రంగానికి ప్రాధాన్యం ఇవ్వాలని ఈ యువ రైతు కౌటిల్య కృ‌ష్ణ‌న్ కోరుతున్నారు. ఏది ఏమైనా ఇలాంటి అతి ప్రాచీన పంటలను నేటి తరానికి పరిచయం చేస్తున్న ఈ రైతును స్థానిక రైతులు అభినందిస్తున్నారు.


Show Full Article
Print Article
Next Story
More Stories