special story on Osmania Hospital: సీను మారింది... మార్పు కోరుకుంటోంది!!

special story on Osmania Hospital: సీను మారింది... మార్పు కోరుకుంటోంది!!
x
Highlights

special story on Osmania Hospital: ఒకటి కాదు రెండు కాదు. పది కాదు ఇరవై కాదు. అక్షరాల 150 ఏళ్ల చరిత్ర. గతమెంతో ఘనంగా భవిష్యత్తు అంతా అయోమయంగా సాగుతున్న...

special story on Osmania Hospital: ఒకటి కాదు రెండు కాదు. పది కాదు ఇరవై కాదు. అక్షరాల 150 ఏళ్ల చరిత్ర. గతమెంతో ఘనంగా భవిష్యత్తు అంతా అయోమయంగా సాగుతున్న ఉస్మానియా ఆసుపత్రి కథ గురించి చెప్పుకోవాలి. ఒకప్పుడు ప్రపంచంలోనే అత్యంత సదుపాయాలున్న ఆసుప్రతిగా, ఎక్కడెక్కడి నుంచో వచ్చే వారికి ఉచితంగా సేవలు అందించిన ఉస్మానియా ఇప్పుడు దిక్కులు చూస్తోంది. పేద, మధ్య,తరగతి, ధనిక బేధం లేకుండా అందరినీ ఒకే గాటున చూసిన ఆసుపత్రి ఇప్పుడు శిథిలమై చిక్కి శల్యమైపోతోంది. అలనాడు సుందర మూసీ తీరాన విలసిల్లిన వైద్యాలయం సీను ఇప్పుడు పూర్తిగా మారిపోతోంది. నాటి వైభవాన్ని కోల్పోతోంది. ఇటీవల జరిగిన కొన్ని ఘటనలు ఉస్మానియా చరిత్రకు చెదలు పట్టేలా చేస్తుంటే తనకొచ్చిన దుర్గతిని తలుచుకుంటూ కుమిలికుమిలి ఏడుస్తోంది. పేదల కన్నీరు వార్డులోని మురుగునీటితో కలసగలసి ఊడిపోయిన పెచ్చుల్లోంచి పెరుగుతోన్న రావి చెట్లకు తార్కాణంగా నిలుస్తోంది.

ఒకప్పుడు ఉస్మానియా ఆసుపత్రి అంటే ఒక భరోసా. ఉస్మానియా ఆసుపత్రి అంటే ప్రాణనిబ్బరం. అంతెందుకు మత్తు మందుపై పరిశోధనలు చేసిన వైభవం. లక్షలు ఖర్చయ్యే కిడ్నీ మార్పిడి వంటివి కూడా ఉచితంగా చేసిన ఆదరణ. వైద్య నారాయణుడి అభయం దొరికే ప్రాంతం. కానీ ఇప్పుడు సీన్ వేరైంది. చిత్రం మారిపోయింది. పగుళ్లు పడిన గోడలు చినుకు పడితే ఆసుపత్రిలో నీరు చేరి చెరువులను తలపించే దృశ్యాలు.. ఇవేనా ఉస్మానియా ఆనవాళ్లు.

నూట యాభై ఏళ్ల చరిత్ర. ఒకవైపు మత్తు మందు పరిశోధనలు. మరోవైపు ఉచితంగా అత్యున్నత వైద్య సేవలు. మూసీ తీరాన విలసిల్లిన వైద్యాలయం. నేడు శిథిలమైంది... చిక్కి శల్యమైంది. సీను మారింది... మార్పు కోరుకుంటోంది!! ఇప్పుడు ఉస్మానియాను ఏం చేయబోతున్నారు?

ఉస్మానియా ఆసుపత్రి నిజాం రాజుల నుంచి సాధారణ పేద ప్రజలకు వంద ఏళ్లకు పైగా వైద్య సేవలు అందిస్తున్న ఆసుపత్రి. చిన్న జ్వరం నుంచి లక్షల రూపాయల ఖర్చు అయ్యే కిడ్నీ మార్పిడి అపరేషన్ల వరకు ఇక్కడ ఉచితంగా చేస్తారు. రోజూ 2 వేల మందికి పైగా ఔట్ పేషేంట్స్‌కు చికిత్స చేస్తుంటారు. గాంధీ ఆసుపత్రిని పూర్తిగా కరోనా వైద్యానికి కేటాయించడంతో ఈ ఆసుపత్రికి వచ్చే రోగులు రెట్టింపయ్యారు

ఉస్మానియా ఆసుపత్రి విషయంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా భవనాన్ని పరిశీలించి ఎమ్మెల్యేలతో ఆసుపత్రి భవనం పటిష్టంగా ఉందా లేదా అనే విషయంలో ఓ కమిటీ వేశారు. ఆ కమిటీ నివేదిక ప్రకారం ఉస్మానియాను కూల్చివేయాలని నిర్ణయించారు. దీంతో పురాతన భవనాలను కాపాడటం కోసం పోరాడుతున్న సంస్థలు, ప్రతిపక్షాలు ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకించాయి. కొందరు కోర్టుకు కూడా వెళ్లారు. దీంతో ప్రభుత్వం తన ప్రతిపాదనను పక్కన పెట్టింది. అయితే తాజాగా ఇటీవల కురిసిన వర్షాలకు ఉస్మానియా ఆసుపత్రిలోకి నీరు చేరాయి. దీన్ని అవకాశంగా తీసుకున్న ప్రతిపక్షాలు, ప్రభుత్వం ప్రజా ఆరోగ్యాన్ని పట్టించుకోవడం లేదని ఆరోపణలు చేస్తూ ఆసుపత్రి వద్ద ధర్నాలకు దిగాయి. దీంతో ప్రభుత్వం ఆసుపత్రిలోని పేషేంట్లను తరలించి భవనానికి సీజ్ చేయాలని నిర్ణయించింది. ఇదే ఉస్మానియా ఆసుపత్రి కూల్చివేతకు సంకేతమన్న ప్రచారం జోరందుకుంది.

ఒకప్పుడు నిజాం రాజులకు.. స్వతంత్ర్యం వచ్చాక నయా మంత్రులకు వైద్యం చేసిన ఘనత ఉస్మానియా ఆసుపత్రి సొంతం. ఆరు శతాబ్దాల క్రితమే ఎయిమ్స్‌గా ఎదిగే అరుదైన అవకాశం పొందిదీ ఆసుపత్రి. ఏ దేశమేగినా ఏ ఆసుపత్రి చూసినా విశ్వమంతా తన విద్యార్థులనే నింపిన వైద్య విద్యాలయం ఉస్మానియా. ఈ సందర్భంగా ఉస్మానియాను చరిత్ర తెలుసుకోవాలి. అదేంటో చూద్దాం.

సాలార్ జంగ్- 1 చేతుల మీదుగా 1866లో అఫ్జల్‌గంజ్ ఆసుపత్రిగా ప్రారంభం ప్రస్థానాన్ని ప్రారంభించింది ఉస్మానియా ఆసుపత్రి. ప్రస్తుతం ఉన్న భవనాలు చివరి నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ హయాంలో 1908లో పనులు ప్రారంభించగా, 1919లో పూర్తయ్యాయి. దీన్ని భారతీయ– బ్రిటిష్ వాస్తు శైలిలో, భారతీయ, బ్రిటిష్ ఆర్కిటెట్లు కలసి నిర్మించారు. విన్సెంట్ ఎస్క్ అనే బ్రిటిష్ ఇంజినీర్ ఈ ఉస్మానియా ఆసుపత్రితో పాటూ హైకోర్టు, సిటీ కాలేజ్, కాచిగూడ రైల్వేస్టేషన్, కోల్‌కతా లోని విక్టోరియా మెమోరియల్‌లు డిజైన్ చేశారు. అప్పట్లో ఈ భవనం నిర్మాణానికి 20 లక్షల రూపాయలు ఖర్చయింది. మూసీ నదిని ఆనుకుని 26.5 ఎకరాల్లో ఈ ఆసుపత్రి నిర్మించారు. ఒక్క ఇన్ పేషేంట్స్ బ్లాకే 2.37 ఎకరాల్లో ఉందంటే ఆ ఆసుపత్రి ఎంత పెద్దదో అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం ఆసుపత్రిలో 11 బ్లాకులు ఉన్నాయి.

హైదరాబాద్ మెడికల్ స్కూల్‌గా ప్రారంభమైన వైద్య విద్య సేవలు 1919లో ఉస్మానియా మెడికల్ కాలేజీగా నామకరణం పెట్టేదాకా బాగానే సాగింది. ఆ తర్వాత కూడా అద్భుతమైన సేవలే అందించింది. మలేరియా మందును కనుగోవడంలోనూ, మత్తు మందుపై ప్రయోగాల్లోనూ ఉస్మానియా ఆసుపత్రే వేదికగా మారింది. ప్రపంచంలోనే తొలి మహిళా మత్తు డాక్టర్ రూపాబాయి చదువుకుంది ఇక్కడే. ఇంతటి ప్రాశస్త్యం ఉన్న భవనాన్ని కూల్చడం భావ్యం కాదని చరిత్రకారులు అభిప్రాయపడుతున్నారు

ఉస్మానియా విషయంలో అసలు సమస్య ఎక్కడ ఉంది..? ఉమ్మడి రాష్టంలో ప్రభుత్వాలు ఎలా స్పందించాయి.? తెలంగాణ ప్రభుత్వం మనసులో ఏముంది..? పురాతన కట్టడాల పరిరక్షణ కోసం పోరాడే సంస్థలు ఏమంటున్నాయి..? ఇదే ఇప్పుడు చర్చోపచర్చలకు తావిస్తోంది. ఉస్మానియా విషయంలో ఉమ్మడి రాష్ట్రం నాటి నుంచే వినిపిస్తున్న ఆరోపణ... నిర్లక్ష్యం... నిర్వహణ లోపం. 2010లో రోశయ్య ముఖ్యమంత్రిగా ఉండగా ఈ ఆసుపత్రి భవనాలు బాగు చేయడానికి 200 కోట్ల రూపాయల నిధులు విడుదల చేశారు. కానీ పనులు ముందుకు సాగలేదు. చారిత్రక కట్టడానికి రిపేర్లు చేసి, దాన్ని అలానే ఉంచి మిగిలిన భవనాలను మాత్రం కూలగొట్టి వాటి స్థానంలో కొత్తది కట్టాలని నిర్ణయం తీసుకున్నారు. మూడేళ్ల వ్యవధిలో 12 లక్షల ఎస్ఎఫ్టీలో కొత్త భవనాలు నిర్మించాలని ప్రతిపాదన. దానికోసం కన్సల్టెన్సీకి కూడా పనులు అప్పగించారు. అది ముందుకు సాగలేదు.

ఆ తర్వాత టీఆర్ఎస్‌ ప్రభుత్వం కూడా ఉస్మానియా విషయంలో బాగానే స్పందించింది. ఈ భవనాలకు మరమ్మత్తులు చేస్తే ఎంతకాలం ఉంటాయో పరిశీలించి నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. అన్ని అంశాలను పరిశీలించిన నిపుణుల కమిటీ ఐదేళ్ల కంటే ఎక్కువ కాలం ఉండబోదని తేల్చింది. దీంతో కూల్చడమే బెటర్ అన్న నిర్ణయానికి వచ్చింది తెలంగాణ ప్రభుత్వం. అయితే జేఎన్టీయూ నివేదికను ఇంటాక్ అనే చారిత్రక కట్టడాలను పరిరక్షించడానికి కృషి చేస్తున్న సంస్థ తప్పు పట్టింది. ఇంటాక్ కొందరు నిపుణులను ఢిల్లీ నుంచి పిలిపించి మూడు రోజులు అధ్యయనం చేసింది, నిర్వహణ గాలికొదిలేయడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని ఈ భవనానికి మరమ్మత్తులు కొన్ని చేస్తే చాలనీ, నిర్మాణం చెక్కుచెదరలేదనీ చెప్పింది.

మరోవైపు ఉస్మానియా అనగానే అందరూ ఎంతసేపూ హెరిటేజ్ భవనాలు అంటున్నారు. కానీ ఈ ప్రాంగణం 27 ఎకరాలు ఉందని ఆ పాత భవనాలను కదల్చకుండా, వాటికి ఏమీ కాకుండా, ఇదే ప్రాంగణంలో విశాలమైన భవనాలు కట్టవచ్చని వాదిస్తున్న వారు లేకపోలేదు. ప్రభుత్వం తలచుకుంటే పార్కింగ్ ఉండే పోలీస్‌స్టేషన్ వైపు సుమారు 5 ఎకరాలు ఖాళీ ఉందని. ఇక జైలు వార్డు ఉండే దోబీఘాట్ వైపు ఖాళీ ప్రదేశం ఉందని ఆ ప్రదేశాల్లో కట్టొచ్చని వారు చెబుతున్నారు. అయితే ఇందులో సాంకేతికంగా అనేక సమస్యలున్నాయని ప్రభుత్వం వాదిస్తోంది. ఏమైనా ఉస్మానియా విషయంలో ప్రభుత్వం వేసే అడుగులే ఇప్పుడు కీలకం కానున్నాయి. ప్రభుత్వం మనసులో ఏముందన్న దాని మీదే ఇప్పుడు చర్చ నడుస్తోంది. ప్రస్తుత చారిత్రక భవనాన్ని, ఇతర పాత భవనాలను కూల్చి అక్కడే కొత్తవి కడుతారా లేక ఆసుపత్రి ఖాళీ ప్రాంతంలో కొత్త భవంతులు నిర్మిస్తారా? వేచి చూడాల్సిందే.

Show Full Article
Print Article
Next Story
More Stories