పోలీస్ గ్యారేజ్..ఇక్కడ అన్ని రకాల సెటిల్‌మెంట్లు చేయబడును

పోలీస్ గ్యారేజ్..ఇక్కడ అన్ని రకాల సెటిల్‌మెంట్లు చేయబడును
x
Highlights

పోలీస్ గ్యారేజ్.. ఇక్కడ అన్ని రకాల సెటిల్‌మెంట్లు చేయబడును. కానీ ఒక్క కండీషన్. చేసే వాళ్లంతా ప్రైవేట్ వ్యక్తులే. వినడానికి విడ్డూరంగా ఉన్నా ఆ జిల్లాలో...

పోలీస్ గ్యారేజ్.. ఇక్కడ అన్ని రకాల సెటిల్‌మెంట్లు చేయబడును. కానీ ఒక్క కండీషన్. చేసే వాళ్లంతా ప్రైవేట్ వ్యక్తులే. వినడానికి విడ్డూరంగా ఉన్నా ఆ జిల్లాలో కొందరు పోలీసులు, మామూళ్ల వసూళ్లకు కొత్త నియామకాలు చేశారంట. ప్రతీ కేసుకూ ఓ రేటు, సివిల్ పంచాయతీలకు మరో రేటు ఫిక్స్ చేసి, వసూళ్ల దందాకు తెరలేపారట. ఇంతకీ ఇందూరు పోలీసుల కొత్త సైన్యం కథేంటి.. ? కామారెడ్డి క్రికెట్ బెట్టింగ్ కేసులో ఏసీబీకి చిక్కిన ఆధారమేంటి..? ఇందూరు పోలీసులపై జరుగుతున్న చర్చేంటి? నెల వ్యవధిలో ముగ్గురు సీఐలు చిక్కడం యాదృచ్చికమా..? గుబులు పుట్టిస్తున్న ఏసీబీ దాడుల వెనుక అదృశ్య శక్తి ఏంటీ?

నిజామాబాద్ జిల్లా పోలీసుల తీరు రాష్ట్రస్థాయిలో చర్చకు దారితీసిందట. నెల వ్యవధిలో ఒకే బ్యాచ్‌కు చెందిన ముగ్గురు సీఐలు ఏసీబీకి చిక్కడం, పోలీస్ శాఖలో కలవరం సృష్టించిందట. ఏసీబీ అధికారులు పోలీస్ శాఖను టార్గెట్ చెయ్యడం వెనుక ఏదైనా అదృశ్య శక్తి హస్తం ఉందా అనే చర్చ కూడా జోరుగా జరుగుతోందట.

కొందరు పోలీసుల బరితెగింపు, ఏసీబీ దాడులకు కారణం అయ్యిందనే వాదన సైతం ఉందట. కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాకు చెందిన కొందరు పోలీసులు మాముళ్ల వసూళ్లకు ప్రైవేట్ సైన్యం నియమించుకున్నారట. ప్రతీ కేసుకు ఓ రేటు ఫిక్స్ చేశారట. సివిల్ కేసులకు మరో రేటు చొప్పున వసూళ్లు చేస్తున్నారట. పోలీసుల వసూళ్ల వ్యవహారం తారాస్థాయికి చేరిందట. అధికారుల తీరు కొందరు ఎమ్మెల్యేలకు ఇబ్బందిగా మారడంతో, వాళ్లు పోలీస్ బాస్‌కు మొరపెట్టుకున్నారట. మరో ఎమ్మెల్యే తన అనుచరుల ద్వారా ఏసీబీకి విషయం చేరవేశారట. సివిల్ కేసులో తలదూర్చిన బోధన్ సీఐ పల్లె రాకేష్, లక్ష రూపాయలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కారట. అంతకు ముందు బాన్సువాడ రూరల్ సీఐ టాటా బాబు, 10వేలు తీసుకుంటూ ఏసీబీకి దొరికారట. స్టేషన్ బెయిల్ కోసం 5లక్షలు డిమాండ్ చేసిన, కామారెడ్డి టౌన్ సీఐ జగదీష్‌ను ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఇలా నెల వ్యవధిలో ఒకే బ్యాచ్‌కు చెందిన ముగ్గురు సీఐలు పట్టుబడటం, రాష్ట్రస్థాయిలో చర్చనీయాంశంగా మారింది. ముగ్గురు అధికారుల దాడుల వెనుక స్థానిక ఎమ్మెల్యేల పవర్ పనిచేసిందనే ప్రచారం సాగుతోంది.

అవినీతి కేసుల్లో పోలీసులు ఏసీబీకి పట్టుబడటం సర్వ సాధారణమే. ఐతే క్రికెట్ బెట్టింగ్ కేసులో మధ్యవర్తితో సీఐ జగదీష్ అవినీతికి పాల్పడినట్లు ఏసీబీ విచారణలో తేలడం కలకలం సృష్టిస్తోందట. దీంతో ఇప్పుడు పోలీస్ శాఖలో ప్రైవేట్ సైన్యం అనే అంశం హాట్ టాపిక్‌గా మారిందట. కామారెడ్డి జిల్లాలో క్రికెట్ బెట్టింగ్‌లు, స్కీంల దందాలు, సివిల్ పంచాయతీలు పెద్దఎత్తున జరిగాయట. అక్రమ దందాలను అరికట్టి నేరస్ధులను శిక్షించాల్సిన రక్షక భటులు, మధ్యవర్తులను నియమించుకుని, కొందరు పోలీసులు భక్షకభటుల అవతారం ఎత్తారట. గతంలో గన్‌మెన్, డ్రైవర్లకు వసూళ్ల బాధ్యతలు అప్పగించే పోలీసులు, ఇప్పుడు ప్రైవేట్ సైన్యం నియమించుకుని, వసూళ్లకు పాల్పడుతున్నట్లు విచారణలో తేలడంతో, ఇలా ఎంతమంది అధికారులకు ప్రైవేట్ సైన్యం పనిచేస్తుందనే కోణంలో ఏసీబీ కూపీ లాగుతోందట. ఈ వ్యవహారంపై మరింత లోతుగా విచారణ చెయ్యాలని డిసైడ్ అయ్యిందట. కామారెడ్డి క్రికెట్ బెట్టింగ్ కేసులో ఈపాటికే సీఐ జగదీష్, మధ్యవర్తి, ఎస్.ఐ. గోవింద్‌లను అరెస్ట్ చేశారు. డీఎస్పీ పాత్రపై విచారణ పూర్తి చేశారట. ఏసీబీ తనిఖీల్లో పోలీస్ అధికారుల అక్రమాస్తుల చిట్టా దొరికిందట. ఆ చిట్టా ఆధారంగా ఇప్పుడు అసలు దర్యాప్తు మొదలెట్టారట ఏసీబీ ఆఫీసర్స్.

అక్రమ వసూళ్లకు జిల్లా పోలీసులు ప్రైవేట్ సైన్యం నియమించుకోవడం, ఏసీబీ విచారణలో అక్రమ ఆస్తుల చిట్టా బయట పడటం, పోలీస్ శాఖలోని కొందరు అవినీతి అధికారుల గుండెల్లో గుబులు పుట్టిస్తోంది. ఏసీబీ దాడుల వెనుక స్థానిక ఎమ్మెల్యేల హస్తం ఉన్నట్లు ప్రచారం ఉన్నా, పట్టుబడ్డ అధికారుల మితిమీరిన అవినీతి, బాధితులను ఏసీబీ మెట్లు ఎక్కేలా చేసిందట. ఏది ఏమైనా, ఉమ్మడి జిల్లా పోలీసుల తీరు, రాష్ట్రస్థాయిలో ఆ శాఖ పరువు బజారున పడేసిందట. ఇకనైనా ఉన్నతాధికారులు, జిల్లా పోలీసుల వ్యవహారంపై ఓ కన్నేసి ఉంచాలని జిల్లా వాసులు కోరుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories