మొన్న మౌనం..నేడు ఉద్యమం..జగ్గారెడ్డి సైలెన్స్‌ వెనక రీసౌండ్ స్టోరి?

మొన్న మౌనం..నేడు ఉద్యమం..జగ్గారెడ్డి సైలెన్స్‌ వెనక రీసౌండ్ స్టోరి?
x
Highlights

పోతే పిలవలేం...వస్తే ఆపలేం..అన్న చందంగా తయారైంది ఆ ఎమ్మెల్యే వ్యవహారం. గెలిచిన వెంటనే ఒక ఆరు నెలల విరామం కావాలి ఆరు నెలల పాటు ఎవరికీ అందుబాటులో...

పోతే పిలవలేం...వస్తే ఆపలేం..అన్న చందంగా తయారైంది ఆ ఎమ్మెల్యే వ్యవహారం. గెలిచిన వెంటనే ఒక ఆరు నెలల విరామం కావాలి ఆరు నెలల పాటు ఎవరికీ అందుబాటులో ఉండలేను అని మీడియా సాక్షిగా, తన నియోజకవర్గ ప్రజలకు బహిరంగంగా ప్రకటించిన నేత ఆయన. కానీ వచ్చి రాగానే నాలుగు నిరసనలు ఆరు అరెస్ట్‌లతో మళ్ళీ ఫుల్ స్వింగ్‌లోకి వచ్చారు. ఇంతకీ ఎవరా నేత? ఆ హడావుడి వెనక అసలు స్టోరి ఏంటి?

జగ్గారెడ్డి...తూర్పు జగ్గారెడ్డి. ఫైర్‌కు బ్రాండ్‌ అంబాసిడర్‌‌గా పతాక శీర్షికలెక్కే లీడర్. తన మాటలు, చేష్టలతో ఎప్పుడూ వార్తల్లో ఉండే విలక్షణమైన రాజకీయ నాయకుడు. తెలంగాణ రాజకీయ నేతల్లో యమ దూకుడు లీడర్. మొన్న తిరిగి సంగారెడ్డి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యినప్పటి నుంచి ఎందుకో, ఆ ఫైర్‌ చల్లబడింది. ఇష్యూ ఏదైనా ఇంతెత్తున లేచే జగ్గూభాయ్‌ మెత్త బడ్డారు. ఎందుకో ఏమిటో అర్థంకాక, సొంత పార్టీ నేతలే కాదు, అధికార పక్ష నాయకులూ అవాక్కవుతున్నారట. ఏమైంది జగ్గారెడ్డికి.

ఒకపక్క ప్రభుత్వానికి వ్యతిరేకం కాదంటూనే అడపాదడపా మాటల తూటాలు పేలుస్తూ, మరింత కన్‌ఫ్యూజ్ చేస్తున్నారు జగ్గారెడ్డి. మొన్న ఎమ్మెల్యేగా గెలిచిన అనంతరం తనకు ఆరునెలల విశ్రాంతి కావాలి, అప్పటి వరకు నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండలేనని ప్రకటించి అందరూ అవాక్కయ్యేలా ప్రకటించారు. ఆరునెలలు కాదు 9 నెలలు దాటినా ప్రజలకు అందుబాటులో లేడని, ఎవరినీ పట్టిచ్చుకోవడం లేదని, మొన్నటి వరకు నియోజకవర్గంలో ఒకటే చర్చ. ఆఖరికి మొన్న జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో సైతం నియోజకవర్గంలో ఆయన ఎక్కడా కనిపించలేదు. ఈ ఎన్నికల్లో తిరగని కారణంగా కొంత నష్టం కూడా జరిగింది. క్యాడర్‌లో నిరాశ ఆవహించింది. ఇవన్నీ తెలిసినా జగ్గారెడ్డి మాత్రం సైలెంట్‌గానే ఉన్నారు.

కానీ గతకొద్ది రోజులుగా నియోజకవర్గంలో వరుస కార్యక్రమాలతో హడలెత్తిస్తున్నారు జగ్గారెడ్డి. ఎన్నికల ముందు సింగూర్ ప్రాజెక్ట్ నుంచి నీటి తరలింపుపై ఉద్యమం చేసిన జగ్గారెడ్డి, ఇప్పుడు హైదరాబాద్‌కు వస్తున్న గోదావరి నీటిని సంగారెడ్డికి తరలించాలనే సరికొత్త డిమాండ్‌ను తెరపైకి తెస్తున్నారు. పఠాన్‌చెరు వరకు వస్తున్న గోదావరి నీటిని రివర్స్ పంపింగ్ ద్వారా సంగారెడ్డికి తరలించాలని నిరసన కార్యక్రమాలతో హోరెత్తిస్తున్నారు. గోదావరి నీళ్ల కోసం వచ్చే నెలలో సంగారెడ్డిలో 10 లక్షల మందితో భారీ సభ నిర్వహిస్తానని ప్రకటించారు జగ్గారెడ్డి.

మరోపక్క సంగారెడ్డిలోని తార డిగ్రీ కళాశాలలోని పిజి సెంటర్ తరలింపుపై ఉద్యమం చేశారు. ప్రభుత్వం ఈ విషయంలో వెనక్కి తగ్గడంతో తార డిగ్రీ కళాశాలను మినీ యూనివర్సిటీగా మార్చాలని ముఖ్యమంత్రికి లేఖ రాశారు. ప్రభుత్వ ఆసుపత్రులను తనిఖీ చేసి రోగులకు అందుతున్న సేవలను వాకబు చేయడంతో పాటు ఆసుపత్రికి కావాల్సిన పరికరాలను తన స్వంత డబ్బులతో కొనిస్తానని ప్రకటించారు. ఇలా వరుస కార్యక్రమాలు, నిరసనలతో నియోజకవర్గంలో మళ్లీ పాత జగ్గారెడ్డిని బయటకు తీస్తున్నారు.

జగ్గారెడ్డి ఈ దూకుడుకు కారణం మున్సిపల్ ఎన్నికలేనని అధికార పార్టీ నాయకులు విమర్శలు ఎక్కుపెడుతున్నారు. ఇన్ని రోజులు రాని జగ్గారెడ్డి, మున్సిపల్ ఎన్నికల కోసమే ఈ హడావుడి చేస్తున్నారని బహిరంగంగా అంటున్నారట. సంగారెడ్డి నియోజకవర్గంలో సంగారెడ్డి, సదాశివపేట మున్సిపాలిటీలు ఉన్నాయి. ఈ రెండు మున్సిపాలిటీల్లో పాగా వేస్తేనే రాజకీయంగా తన పట్టు నిలుపుకున్నట్లు అవుతుందని జగ్గారెడ్డి దూకుడు ప్రదర్శిస్తున్నారని వ్యాఖ్యానిస్తున్నారు. కానీ జగ్గారెడ్డి సన్నిహితులు మాత్రం నియోజకవర్గ ఎమ్మెల్యేగా ప్రజల సమస్యల కోసం పోరాడుతున్నామని, జగ్గారెడ్డి కార్యక్రమాల పట్ల ప్రజల్లో వస్తున్న స్పందన చూసి అధికార పార్టీ నేతలు అయోమయానికి గురై మాట్లాడుతున్నారని అంటున్నారని రివర్స్ అటాక్ చేస్తున్నారు.

ఏది ఏమైనప్పటికి మొన్నటి వరకు రాడు, రావడంలేదని చర్చించుకున్న నియోజకవర్గ ప్రజలు మళ్లీ జగ్గారెడ్డి ప్రత్యక్షం కావడంతో, నాటి హడావుడి కనిపిస్తోందని మాట్లాడుకుంటున్నారు. అధికార పార్టీని సుతిమెత్తగా విమర్శిస్తూ, సొంత పార్టీకి అంటీముట్టనట్టు వ్యవహరిస్తూ, మళ్లీ సింగిల్‌గా ఫైట్‌కు దిగడంతో, జగ్గారెడ్డి రూటే సపరేటు అనుకుంటున్నారు జనం. చూడాలి, మున్ముందు జగ్గారెడ్డి ఇంకెన్ని సంచలనాలకు తెరతీస్తారో.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories