Vemulawada: శివరాత్రిశోభ సంతరించుకున్న వేములవాడ రాజన్న క్షేత్రం

Shivaratri Celebrations Are Started in Vemulawada
x

వేములవాడ దేవస్థానం (ఫైల్ ఫోటో)

Highlights

Vemulawada: వారం రోజుల్లో భక్తజనసంద్రంగా మారనున్న వేములవాడ

Vemulawada: మహాశివరాత్రి సమీపిస్తోంది. వేములవాడ రాజన్న క్షేత్రం శివరాత్రిశోభను సంతరించుకుంటోంది. వారం రోజుల్లో వేములవాడ భక్తజనసంద్రంగా మారనుంది. ఉత్సవ ఏర్పాట్లు కనువిందు చేసేలా సాగుతున్నాయి. కానీ.. భక్తుల సౌకర్యాలు మాత్రం వెక్కిరిస్తున్నాయి. సత్రాల్లో శుభత్ర లేదు. ఈ ఏడాది కూడా భక్తులకు క్యూలైన్ల కష్టాలు తప్పేలా లేవు. ఇలా ఎన్నో సమస్యలతో శివరాత్రి ఉత్సవాలకు ముస్తాబవుతున్న వేములవాడ రాజన్న క్షేత్రం.

తెలంగాణలో అతిపెద్ద శైవక్షేత్రం వేములవాడ. సీజన్‌తో సంబంధం లేకుండా అన్ని కాలాల్లో ఈ క్షేత్రానికి భక్తులు తరలివస్తారు. రాజన్నకు కోడె మొక్కులు చెల్లించి, తన్మయత్వం చెందుతారు. శివరాత్రి వేళ వేములవాడ భక్తజన సంద్రంగా మారుతుంది. మూడురోజులపాటు జరిగే ఉత్సవాల్లో మహా లింగార్చన, లింగోద్బావం, విశేష సేవలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి.

శివరాత్రి ఉత్సవాలు సమీపిస్తుండడంతో అధికారులు ఏర్పాట్లు మొదలుపెట్టారు. ఆలయ ప్రాకారాలకు పేయింటిగ్‌ వేశారు. ఆలయాన్ని విద్యుత్‌దీపాలతో అలంకరిస్తున్నారు. ఇక ఆవరణలో చలువ పందిళ్లు కూడా ఏర్పాటు చేస్తున్నారు. బస్సుల సౌకర్యం నుంచి మంచి నీటి సౌకర్యం వరకు అన్ని ఏర్పాట్లు చకచక జరిగిపోతున్నాయి.

పది రోజుల ముందు నుంచే ఆలయంలో శివరాత్రి శోభ సంతరించుకుంది. ఏర్పాట్లు అదిరిపోతున్నాయి. చలువ పందిళ్లు.. రంగు రంగుల విద్యుత్ కాంతులు అబ్బో కళ్లు జిగేల్‌ మనేలా ఏర్పాట్లు చేస్తున్నారు. మరీ భక్తుల సౌకర్యాల పరిస్థితి ఏంటి.? పై పై మెరుగులు భక్తులకు ఇక్కట్లను తప్పిస్తాయా..

వేములవాడ రాజన్న దర్శనభాగ్యం కోసం ఎక్కువగా పేద, మధ్యతరగతి ప్రజలే తరలివస్తారు. సుదూర ప్రాంతాల నుంచి ప్రయాణాలు సాగిస్తుంటారు. మొక్కులు తీర్చుకునేందుకు ఒకరాత్రి స్వామివారి సన్నిధిలో నిద్ర చేస్తారు. ఇందుకోసం 7వసతి గృహాలను ఏర్పాటు చేశారు. వాటిని భక్తులకు తక్కువ ధరకే కేటాయిస్తారు.

ఇదంతా బాగానే ఉందికానీ.. వాటి శుభ్రతను మాత్రం గాలికి వదిలేశారు. సత్రాలు దుమ్ము ధూలితో నిండిపోయాయి. బాత్‌రూంకి వెళ్లాలంటే ముక్కుమూసుకోవాల్సిందే.. సత్రంలో కనీసం తినలేని పరిస్థితి ఉందని భక్తులు గగ్గోలుపెడుతున్నారు.

సత్రాల్లో మెయింటనెన్స్ ఉండదు. పైగా సత్రాలు కేటాయించే అధికారుల తీరు మరోరకం.. ముసలివాళ్లు, పేషెంట్లు ఉన్నారని చెప్పినా.. పై అంతస్తులో ఉండాల్సిందేనని అంటున్నారని భక్తులు ఆరోపిస్తున్నారు. మరో పదిరోజుల్లో శివరాత్రి ఉత్సవాలు మొదలుకానున్నాయి. భక్తులు లక్షలాదిగా తరలివస్తారు. సత్రాల్లో ఇలాంటి పరిస్థితి ఉంటే ఎలా అని భక్తులు ప్రశ్నిస్తున్నారు.

శివరాత్రి రోజున వీఐపీ దర్శనాల పేరుతో భక్తులకు ఇబ్బందులు తప్పవు. తెల్లవారు జామున 3గంటలకు క్యూలైన్‌లో నిలబడితే.. మధ్యాహ్నాం దాటినా దర్శన భాగ్యం కలగదు. భక్తులను వేధిస్తున్న క్యూలైన్ల మార్పు కోసం ప్రణాళికలు వేశారు. కానీ ఇంతవరకు అతీగతి లేదు. అవే లైన్లు. అవే అవస్థలు.

రాజన్న దర్శనం కోసం వచ్చే దివ్యాంగుల పరిస్థితి మరీ దారుణం. వీల్‌చైర్‌ సౌకర్యం కల్పించాల్సి ఉన్నా దాన్ని బయటకుతీసిన దాఖలాలు లేవు. వృద్ధులు, దివ్యాంగుల దర్శన సౌకర్యాన్ని పట్టించుకునే నాధుడే లేడు. పుణ్యం మాట పక్కన పెడితే ఆలయ మెట్లు ఎక్కేందుకు నరకం చూస్తున్నారు.

వేములవాడలో భక్తుల కష్టాలను దూరం చేసేందుకు ప్రభుత్వం డెవలప్‌మెంట్‌ అథారిటిని ఏర్పాటు చేసింది. కానీ అది నామ్‌కేవాస్తుగా మిగిలిపోయింది. దీంతో ఆలయ అభివృద్ధి పనులు భక్తుల క్యూలైన్లలాగే ముందుకు కదలడం లేదు. పనులను పెండింగ్ వేస్తూ కాలం వెల్లదీస్తున్నారే తప్పా.. పూర్తి చేయాలనే ఆలోచనే కరువైంది.

వేములవాడ పట్టణంతో పాటు ఆలయ అభివృద్ధి కోసం ప్రభుత్వం వేములవాడ డెవలప్‌మెంట్ అథారిటిని ఏర్పాటు చేసింది. నాలుగేళ్లలో దేవస్థానాన్ని అభివృద్ధి చేసేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. వీటీడీఏ అయితే త్రీడి విజువల్స్‌ని రిలీజ్‌ చేసి అందరిచేత వాహ్ అనిపించారు. కానీ పనులు మాత్రం అయ్యో బాబోయ్.. అనిపించేలా సాగుతున్నాయి.

వీటీడీఏ ఆధ్వర్యంలో రెండు పనులు మాత్రం పక్కగా జరిగాయి. రాజన్న క్షేత్రం పక్కనే ఉన్న చెరువుని పూడ్చేసి 33 ఎకరాల్లో పార్కింగ్ స్దలాన్ని ఏర్పాటు చేశారు. మిషన్ భగీరథ కింద నీటిని సరఫరా చేస్తున్నారు. అంతకుమించి ఒక్క అభివృద్ధి పని కూడా కంటికి కనిపించదు. వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధి కోసం నాలుగు వందల కోట్లు కేటాయిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. కానీ నిధుల విడుదల ఆగిపోవడంతో ఆలయ అభివృద్ధి పనులకు బ్రేకులు పడ్డాయి.

ప్రభుత్వం నిధులు ఇవ్వడం లేదు సరే.. మరి ఆలయ ఆదాయం మాటేమెటి.? ఆదాయంలో భక్తుల సౌకర్యాలకు ప్రాధాన్యత ఇస్తున్నారా.. అసలు వేములవాడ రాజన్న ఆదాయం ఎంత.? ఎక్కడ ఖర్చు చేస్తున్నారు.

వేములవాడ క్షేత్రం నిత్యం భక్తులతో కళకళలాడుతోంది. వేములవాడ ఆదాయం కూడా అదే రేంజ్‌లో ఉంటుంది. ప్రతి 15 రోజులకు ఒకసారి హుండీలు నిండిపోవడం ఖాయం. వాటిని 20 రోజులకు ఒకసారి లెక్కిస్తారు.

రాజన్న ఆలయంతో పాటు పరివార దేవాలయాల హుండీలను కూడా ప్రతి 20 రోజులకు ఒకసారి లెక్కిస్తారు. లెక్కించిన ప్రతిసారి కోటిన్నర నుంచి రెండు కోట్ల వరకు ఆదాయం వస్తుంది. వీటితో పాటు కానుకలు కూడా వస్తుంటాయి. దీంతో సరాసరిగా వేములవాడ రాజన్న ఆదాయం ఏడాదికి 35 నుంచి 40 కోట్లు వరకు ఉంటుంది.

ధార్మిక కార్యక్రమాలు, గోశాల నిర్వహణ, నిత్య కైంకర్యాలకు కావాల్సిన సామాగ్రి, జీతభత్యాలు పోను.. ప్రతి ఏడాది 10 కోట్ల మిగులు బడ్జెట్ ఉంటుంది. ఈ ఏడాది మాత్రం లాక్‌డౌన్‌ ప్రభావం ఆలయ ఆదాయంపై పడింది. అయితే హుండీ ఆదాయం నుంచి భక్తుల సౌకర్యాలు కల్పించడం కష్టమే.. ఆలయ అభివృద్ధి కోసం ప్రభుత్వమే నిధులు విడుదల చేయాల్సిన అవసరముంది.

Show Full Article
Print Article
Next Story
More Stories