ఉమ్మడి నల్గొండ జిల్లాలో వరుస హత్యలు కలకలం

Arun Chilukuri
Published on: 4 Feb 2021 3:50 PM IST
Serial Death Cases Issue in Nalgonda District
X

Representational Image

ఉమ్మడి నల్గొండ జిల్లాలో వరుస హత్యలు కలకలం రేపుతున్నాయి. డబ్బు కోసం ఒకరు , అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని, మరొకరు, భూమి కోసం ఇంకొకరు ఇలా పలు కారణాలతో గత పది రోజుల్లో పది హత్యలు జరిగాయి. వరుస జరగుతున్న నేరాలు ఘోరాలు పోలీసులకు సవాల్ గా మారుతున్నాయి.

ఉమ్మడి నల్గొండ జిల్లాలో వరుస హత్యలు జనాలను బెంబెలెత్తిస్తున్నాయి. ఒకరు డబ్బుల కోసం, మరొకరు భూమి కోసం, ఇంకొకరు వివాహేతర సంబంధం కొనసాగింపు కోసం పది రోజుల వ్యవధిలో పదిమంది దారుణ హత్యకు గురయ్యారు.

నల్గొండ జిల్లా నాంపల్లి మండలం దేవత్ పల్లిలో మద్యం మత్తులో అక్రమ సంబంధం ఉందనే అనుమానంతో భార్య యాదమ్మను భర్త వెంకటయ్య కత్తితో పొడిచి చంపాడు. మరోవైపు మునుగోడు మండలం కొరటికల్‌ గ్రామానికి చెందిన కూరపాటి అనిల్‌ దంపతులకు ముగ్గురు పిల్లలు. ఏడాది క్రితం సమీప బంధువుతో అనిల్ భార్య పరిచయం వివాహేతర సంబంధానికి దారి తీసింది. తమ సంబంధానికి అడ్డుగా ఉన్న భర్త ను ప్రియుడి సాయంతో భార్య చంపేసింది. భర్త నిద్రమాత్రలు మింగి ఆత్మహత్య చేసుకున్నాడని అందర్నీ నమ్మించింది. అంత్యక్రియలు కూడా పూర్తి చేసింది.

తండ్రి అనిల్ ను తల్లి చంపుతుండగా పెద్ద కొడుకు చూశాడు. ఈ విషయాన్ని తమ తాతకు చెప్పడంతో ఈ దారుణ సంఘటన వెలుగులోకి వచ్చింది. కేసు విచారణ చేపట్టిన పోలీసులు కసాయి భార్యను కటాకల్లోకి నెట్టారు.

జనవరి26 వ తేదీన నాంపల్లి మండలం బండతిమ్మాపురం గ్రామ పంచాయతీ పరిధిలోని తాటిమీది గూడెంలో భూమి వివాదంలో అందరూ చూస్తుండగానే నడిరోడ్డుపై తమ్ముడిని తన కొడుకులతో కలిసి అన్న హత్య చేశాడు. బొదాసు కృష్ణయ్య తమ్ముడైన బొదాసు వెంకటయ్యకు తన 9 ఎకరాల భూమిని అమ్మి హైదరాబాద్ కు వలస వెళ్లారు. కృష్ణయ్య తిరిగి గ్రామానికి వచ్చాక భూమి విక్రయం జరగలేదని వెంకటయ్యను కొడుకులతో కలిసి ఘర్షణకు దిగారు. ఈ క్రమంలో అన్న కృష్ణయ్య తమ్ముడు వెంకటయ్య ను అందరూ చూస్తుండగానే పట్టపగలు కర్రతో తలపై బాది హత్య చేశాడు.

నల్గొండ లోని రామ్ నగర్ లో ఇద్దరు వ్యక్తులు దారుణహత్యకు గురయ్యారు. గుర్తు తెలియని వ్యక్తులు బండరాళ్లతో వారి తలలపై కొట్టి హత్య చేశారు. పోలీసుల విచారణలో తూర్పుగోదావరి జిల్లా పత్తిపాడు మండలం పోతులూరి గ్రామానికి చెందిన అన్నదమ్ములు బొండి రాంజీబాబు,బొండీ నాగేశ్వరరావుగా గుర్తించారు. హత్యకు కారణాలు తెలియాల్సి ఉంది.

సంక్రాంతి పండుగ రోజున నల్గొండలో కొత్తపల్లి సాయి అనే యువకుడిని బండరాళ్లతో మోది హత్య చేశారు. అదే రోజున తిప్పర్తి మండలం పజ్జూరులో భూ తగాదాలతో నాగయ్యను దాయాదులు దాడి చేసి హత్య చేశారు. యాదాద్రి -భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం కొండాపూర్ లో గెట్టు పంచాయితీలో తూటి రామచంద్రయ్య ను దారుణంగా హత్య చేశారు. మిర్యాలగూడలో అప్పు తీర్చలేదని బావను హతమార్చాడు బావమరిది.సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం కుడకుడ లో శశిధర్ రెడ్డి అనే వ్యక్తి పాత కక్షలు భూతగాదాలతో పొలం వద్దే దారుణంగా నరికి చంపారు. భువనగిరి మండలం రామచంద్రాపురం లో భూతగదాలతో ఓవ్యక్తిని పట్టపగలే చంపేందుకు దాయదులు యత్నించారు. జనవరి ముప్పై న సంస్థాన్ నారాయణ పురం మండలం గాంధీనగర్ తండాలో చేతబడి అనుమానంతో నేనావత్ బుజ్జీ‌ ని దారుణంగా హత్య చేసి రాచకొండ గుట్టల్లో మృతదేహాన్ని పడేసారు.ఈ కేసులో తొమ్మిది మందిని పోలీసులు అరెస్టు చేసారు‌. వివిధ కారణాలతో క్షణికావేశంలో బంధాలను మరచి హత్యలు చేస్తున్న వారు చివరకు జైలు పాలు అవుతున్నారు. బాధిత కుటుంబాలకు శోకం మిగుల్చుతున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story