భారీ విధ్వంసం తర్వాత కోలుకుంటున్న సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌

Secunderabad Railway Station Latest Updates
x

భారీ విధ్వంసం తర్వాత కోలుకుంటున్న సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌

Highlights

Secunderabad Railway Station: నిన్నటి ఘటనతో పోలీసుల అలర్ట్‌

Secunderabad Railway Station: భారీ విధ్వంసం తర్వాత సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ కొద్దికొద్దిగా సాధారణ పరిస్థితికి చేరుకుంటోంది. నిన్నటి ఘటనతో అప్రమత్తమైన పోలీస్‌ యంత్రాంగం.. స్టేషన్‌లో భద్రత కట్టుదిట్టం చేసింది. రైల్వేస్టేషన్‌కు కిలోమీటర్‌ ముందు నుంచే బారికేడ్లు ఏర్పాటు చేసి, వాహనాలను క్షుణ్ణంగా పరిశీలించి, లోపలికి అనుమతిస్తున్నారు పోలీసులు. టికెట్‌ ఉన్న వ్యక్తులనే స్టేషన్‌లోకి అనుమతిస్తున్నారు. మరోవైపు.. రైళ్ల పునరుద్ధరణ పనులను వేగవంతం చేశారు రైల్వే అధికారులు. నిన్న రాత్రి నుంచి పలు రైళ్లను పునరుద్ధరించారు. అయితే.. సికింద్రాబాద్‌ హింసాత్మక ఘటనల ప్రభావం.. పలు రైళ్ల రాకపోకలపై పడింది. సికింద్రాబాద్ పరిధిలో ఇవాళ, రేపు పలు రైళ్లు రద్దుకాగా.. మరికొన్ని రైళ్లను రీషెడ్యూల్ చేశారు. కొన్ని సర్వీసులను పాక్షికంగా రద్దు చేసినట్టు అధికారులు స్పష్టం చేశారు.

ఇవాళ నడవాల్సిన మన్మాడ్ - సికింద్రాబాద్ అజంతా ఎక్స్‌ప్రెస్, సాయినగర్ షిర్డి - సికింద్రాబాద్ ఎక్స్‌ప్రెస్, విశాఖపట్టణం - గుంటూరు సింహాద్రి ఎక్స్‌ప్రెస్, కాకినాడ పోర్ట్ - విశాఖపట్టణం మెము రైళ్లను రద్దుచేశారు. అలాగే.. రేపు త్రివేండ్రం సెంట్రల్ - సికింద్రాబాద్ శబరి ఎక్స్‌ప్రెస్ తో పాటు.. దనాపూర్ - సికింద్రాబాద్ ఎక్స్‌ప్రెస్, భువనేశ్వర్ - సికింద్రాబాద్ ఎక్స్‌ప్రెస్, శాలిమార్ - సికింద్రాబాద్ ఎక్స్‌ప్రెస్, విశాఖపట్టణం - కాకినాడ పోర్ట్‌ మెము రైళ్లు రద్దయ్యాయి.

ఇవాళ సికింద్రాబాద్ నుంచి దనాపూర్ వెళ్లే రైలు.. ఉదయం 9 గంటల 25 నిమిషాలకు కాకుండా.. మధ్యాహ్నం 3 గంటల 25 నిమిషాలకు సికింద్రాబాద్ నుంచి బయలుదేరుతుంది. అలాగే.. కాకినాడ పోర్ట్ నుంచి సాయినగర్ షిర్డీ వెళ్లే రైలు ఉదయం 6 గంటలకు బదులు.. ఏడున్నర గంటలకు బయల్దేరింది. వీటితో పాటు.. బీదర్-హైదరాబాద్, హైదరాబాద్-విశాఖపట్టణం, హైదరాబాద్-చెన్నై సెంట్రల్, హైదరాబాద్-తాంబరం, విశాఖపట్ణణ-హైదరాబాద్, తాంబరం-హైదరాబాద్ రైళ్లను పునరుద్ధరించారు.

అటు.. ఇవాళ, రేపు 34 ఎంఎంటీఎస్ రైలు సర్వీసులను కూడా దక్షిణ మధ్య రైల్వే రద్దు చేసింది. లింగంపల్లి-హైదరాబాద్ మధ్య 9 రైళ్లు, హైదరాబాద్-లింగంపల్లి మధ్య 9, ఫలక్‌నుమా-లింగంపల్లి మధ్య 7, లింగపల్లి-ఫలక్‌నుమా మధ్య 7, సికింద్రాబాద్-లింగపల్లి రూట్లో ఒక రైలు, లింగంపల్లి-సికింద్రాబాద్ మధ్య ఒక రైలును రద్దు చేసింది. సోమవారం ఎంఎంటీఎస్ సర్వీసులు అందుబాటులోకి వస్తాయని ప్రకటన విడుదల చేసింది.

Show Full Article
Print Article
Next Story
More Stories