వాచ్‌మెన్‌గా మారిన సర్పంచ్..ఉదయం సర్పంచ్‌ ..రాత్రి వాచ్‌మెన్..

Sarpanch Who Became a Watchman in Arepally
x

వాచ్‌మెన్‌గా మారిన సర్పంచ్..ఉదయం సర్పంచ్‌ ..రాత్రి వాచ్‌మెన్..

Highlights

Sarpanch: నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లి మండలం ఆరెపల్లి గ్రామానికి ఇరుసు మల్లేష్ సర్పంచ్‌.

Sarpanch: నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లి మండలం ఆరెపల్లి గ్రామానికి ఇరుసు మల్లేష్ సర్పంచ్‌. ఇక్కడ సర్పంచ్ సీటు ఎస్సీకి రిజర్వు కావడంతో మల్లేష్‌‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. పల్లె ప్రగతితో గ్రామానికి వెలుగులు నింపాడు. గ్రామాభివృద్ధి కోసం అప్పులు చేసాడు. ప్రభుత్వం నుంచి అందాల్సిన నిధులు అందకపోయే సరికి ఉన్న రెండెకరాల భూమిలో అర ఎకరం భూమిని విక్రయించి గ్రామానికి కావలసిన మౌలిక సదుపాయాలు సమకూర్చాడు.

ఇటీవల నాలుగో విడత పల్లె ప్రగతిలో భాగంగా గ్రామాభివృద్ధి కోసం చేపట్టిన పనులకు సంబంధించిన పెండింగ్ బిల్లులు విడుదల కాలేదు. ప్రస్తుతం అప్పులపాలైన మల్లెష్‌ తన కుటుంబ పోషణ కోసం వాచ్‌మేన్‌ ఉద్యోగం చేస్తున్నాడు. రోజంతా సర్పంచ్‌గా ప్రజాసేవ చేస్తూ రాత్రులు స్థానికంగా ఉండే ఓ కంపెనీకి కాపలాదారునిగా పని చేస్తున్నాడు.

గతంలో ఆరెపల్లి గ్రామం బర్దీపూర్ గ్రామంలో కలిసి ఉండేది. 2018 సర్పంచ్ ఎన్నికల్లో ఆరెపల్లి గ్రామాన్ని గ్రామ పంచాయతీగా ప్రకటించారు. గ్రామానికి రోడ్డు సదుపాయం లేక నానా పాట్లు పడుతున్నామని గ్రామస్తులు అంటున్నారు. గ్రామాభివృద్ధికి నిధులైనా విడుదల చేయాలని లేదా తిరిగి బర్దీపూర్‌ గ్రామంలో విలీనం చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు.

గ్రామంలో ఇప్పటికే చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలకు, నాలుగో విడత పల్లెప్రగతి కోసం చేపట్టే పనులకు గాను పెండింగ్ బిల్లులు రాకపోవడంతో పాటు మంజూరైన కొద్దిపాటి నిధులు కరెంటు బిల్లులు, గ్రామ పంచాయతీ సిబ్బందికి నెలసరి జీతాలు ఇవ్వడంతోనే సరిపోతోందని సర్పంచ్ మల్లేష్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మల్లేష్‌ తన కష్టాన్ని జిల్లా కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లగా కలెక్టర్ ప్రత్యేక నిధులు ఇస్తామని హామీలు ఇచ్చినా అవి హమీలు గానే మిగిలిపోయాయని వాపోతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories