MLA Jagga Reddy Comments : టీఆర్ఎస్ వద్ద డబ్బు తీసుకొని మాకు ఓట్లు వేయండి : ఎమ్మెల్యే జగ్గారెడ్డి

MLA Jagga Reddy Comments : రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ దగ్గర ప్రజలు డబ్బు తీసుకుని కాంగ్రెస్‌కు ఓటు ...
MLA Jagga Reddy Comments : రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ దగ్గర ప్రజలు డబ్బు తీసుకుని కాంగ్రెస్‌కు ఓటు వేయాలంటూ సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ రోజు టీఆర్ఎస్ దుకాణం నడుస్తోందని, భవిష్యత్‌లో కాంగ్రెస్ సమయం వస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. టీఆర్‌ఎస్ దగ్గర ఆ పార్టీ నాయకుల దగ్గర చాలా డబ్బులున్నాయని ఆయన వ్యాఖ్యానించారు. టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఒక్కో ఓటుకు సుమారు రూ.5వేల నుంచి రూ.10 వేల వరకూ ఇస్తారని ఆయన పేర్కొన్నారు. గత జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్‌కు అభ్యర్థులే లేక కాంగ్రెస్ పార్టీ నేతలను చేర్పించుకొని టిక్కెట్ ఇచ్చారనే విషయం తలసాని మర్చిపోవద్దని సూచించారు.
మొన్నటికి మొన్న మంత్రి తలసాని గొప్పలు మాట్లాడుతూ ప్రభుత్వాన్ని బదనాం చేస్తున్నారని ఎద్దేవా చేశారని ఆయన అన్నారు. అసెంబ్లీలో లక్ష డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు చూపిస్తామని తెలిపిన తలసాని కేవలం 15 వేలకు మించి చూపించకలేకపోయారని ఆయన విమర్శించారు. గ్రేటర్ ఎన్నికల్లో ప్రజలు ఏవరికి, ఎలా షాకిస్తారో అంచనా వేయలేమని అన్నారు. ఎంతటివారైనా ఏదో ఓ రోజు ఓడాల్సిందేనని ఆయన వ్యాఖ్యానించారు. ఆ ఎన్నికల్లో మేయర్‌గా కాంగ్రెస్ వ్యక్తి ఎన్నికైతే ప్రభుత్వం ప్రకటించిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు ఇప్పిస్తామని జగ్గారెడ్డి హామీ ఇచ్చారు. కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్‌లోకి వెళ్లిన ఏ ఒక్క ఎమ్మెల్యే అయినా బయట కనపడుతున్నారా అని జగ్గారెడ్డి ప్రశ్నించారు. ప్రతిపక్షంగా హైదరాబాద్ సమస్యలపై ప్రభుత్వంపై గట్టిగా పోరాడతామని స్పష్టం చేశారు. ప్రస్తుతం కాంగ్రెస్‌లో ఉన్న మిగిలిన 6 మంది ఎమ్మెల్యేలు 110 మందికి గట్టి జవాబు ఇస్తున్నారని అన్నారు.