Top
logo

నాగార్జున సాగర్‌ ఎమ్మెల్యేపై చక్కర్లు కొడుతున్న ఆ కథేంటి?

నాగార్జున సాగర్‌ ఎమ్మెల్యేపై చక్కర్లు కొడుతున్న ఆ కథేంటి?
X
Highlights

అక్కడ ఎమ్మెల్యేగా ఉన్నది ఒకప్పటి ఫైర్ బ్రాండ్. అంతేకాదు రాజకీయ ఉద్దండున్ని ఓడించి ఎమ్మెల్యే అయ్యారాయన. కానీ ఇప్పుడాయన స్వరం తగ్గించారు. వేగం నెమ్మదించారు. ఇదే ప్రత్యర్థిపార్టీకే కాదు, స్వపక్షంలోని అపోజిషన్‌ లీడర్లకు ఆయుధమైందట.

అక్కడ ఎమ్మెల్యేగా ఉన్నది ఒకప్పటి ఫైర్ బ్రాండ్. అంతేకాదు రాజకీయ ఉద్దండున్ని ఓడించి ఎమ్మెల్యే అయ్యారాయన. కానీ ఇప్పుడాయన స్వరం తగ్గించారు. వేగం నెమ్మదించారు. ఇదే ప్రత్యర్థిపార్టీకే కాదు, స్వపక్షంలోని అపోజిషన్‌ లీడర్లకు ఆయుధమైందట. దీనికి తోడు ఎమ్మెల్యే కొడుకు, యాక్టివ్‌ రోల్‌‌ కూడా, వారికి అస్త్రమైందట. అదే అదనుగా సదరు ఫైర్‌బ్రాండ్ లీడర్‌పై, కొత్త ప్రచారం మొదలుపెట్టారు. పుకార్లు షికార్లు చేసేలా మసాలా దట్టిస్తున్నారు. చికాకులన్నీ చీమలదండులా దండెత్తుతుండటంతో, ఆ ఎమ్మెల్యే సతమతమైపోతున్నారట. ఇంతకీ ఎవరా నేత? ఆయనపై జరుగుతున్న ప్రచారమేంటి?

నోముల నర్సింహయ్య సీపీఎం నేతగా ఒక వెలుగు వెలిగిన నాయకుడు. ఎమ్మెల్యేగానూ అసెంబ్లీలో ధాటిగా కమ్యూనిస్టు గళం వినిపించిన నేత. ఇప్పుడాయన ఎర్రజెండాను వదిలేసి గులాబీ జెండా పట్టారు. నాగార్జున సాగర్‌కు టీఆర్ఎస్‌ ఎమ్మెల్యేగా వున్నారు. కాంగ్రెస్‌ స్ట్రాంగ్ లీడర్‌ జానారెడ్డిని ఓడించి, అందరి దృష్టినీ ఆకర్షించిన నోముల పట్ల, కొంతకాలంగా జరుగుతున్న ప్రచారం చర్చనీయాంశంగా మారింది.

కొద్ది రోజులుగా నాగార్జున సాగర్‌లో ఓ రూమర్ చక్కర్లు కొడుతోంది. సీనియర్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్యకు ఆరోగ్యం సరిగా లేదన్నదే ఆ ప్రచారం సారాంశం. సోషల్ మీడియాలో తెగ వైరల్‌ అవుతోందది. వచ్చే ఎన్నికల్లో ఆ‍యన పోటీ చెయ్యరని, ఆయన కొడుకును రంగంలోకి దింపుతారన్న ప్రచారానికి సోషల్ మీడియాలో తెరలేపింది ఓ వర్గం. ఆ వర్గం కూడా‌ ప్రత్యర్ధి కాంగ్రెస్ నుంచి కాదట. సొంత పార్టీలోని నోముల నర్సింహయ్యను వ్యతిరేకించే బ్చాచ్‌ అట. ఆ వర్గంతోనే ఇపుడు పెదవూర, హాలియా ఎంపీపీలు కలిసి నడుస్తున్నారట. తన హెల్త్‌ గురించి ఆ నోటా, ఈ నోటా రకరకాల ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో, తానే స్వయంగా రంగంలోకి దిగారు నోముల. ఇదంతా గోబెల్స్ ప్రచారమని ఖండించారు. తనకు అనారోగ్యంగా ఉందని, సీరియస్‌గా ఉందని, తన మీద ప్రేమ ఎక్కువైన నేతలు, ఇష్టంతో సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారన్న నోముల, వారికి ప్రజాక్షేత్రంలో ప్రజలే బుద్ది చెబుతారని, తనదైన శైలిలో సుతిమెత్తని వార్నింగ్ ఇచ్చారట.

నోముల ఆరోగ్యం బాగుందా, బాగాలేదన్న ప్రచారం పక్కనపెడితే, ఈమధ్య నాగార్జున సాగర్‌లో, ఆ‍యన కొడుకు క్రియాశీలకంగా వుండటం, అటువంటి పుకార్లుకు బలం చేకూరుస్తోంది. నోముల కొడుకు భగత్‌, పార్టీ కార్యక్రమాలు, ప్రభుత్వ కార్యక్రమాల్లో అధికారికంగా పాల్గొంటుండటం చర్చనీయాంశమవుతోంది. నోములకు ఆరోగ్యం బాగాలేనందుకే, తన కుమారుడి పొలిటికల్‌ జర్నీకి గ్రౌండ్ సిద్దం చేస్తున్నారని ప్రచారం చెయ్యడానికి, ప్రత్యర్థులకు అస్త్రం దొరికినట్టయ్యింది. దీంతో ఆయన హెల్త్‌పై చక్కర్లు కొడుతున్నదంతా నిజమేనా అన్నట్టుగా, కొడుకు తీరు కనపడుతోందన్న మాటలు వినపడ్తున్నాయి.

అధికారులకు ఎమ్మెల్యే కొడుకు ఫోన్లు చేస్తున్నారట. అధికార, అనధికారిక ‌కార్యక్రమాల్లో తనను కచ్చితంగా పిలవాల్సిందేననన్నట్టుగా తెగేసి చెబుతున్నారట భగత్. ఈ కన్ప్యూజన్‌లో వున్న పార్టీ కార్యకర్తలు, తండ్రి నోముల నర్సింహయ్య దగ్గరకు వెళ్లాలా లేక దాదాపు షాడో ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్నారని ప్రచారం జరుగుతున్న భగత్ దగ్గరకు వెళ్లాలా, అని గందరగోళంలో పడ్డారట. ఇదంతా గమనిస్తున్న స్వపక్ష, ప్రతిపక్ష నేతలు, తాము చేస్తున్న ఆరోపణలు నిజమే అంటూ మరింతగా ప్రచారం చేస్తున్నారట. ఇది నోములకు తలనొప్పులు తెస్తోందట.

మొత్తంగా నాగార్జున సాగర్ నియోజకవర్గంలో అటు ఎమ్మెల్యే నోముల నర్సింహయ్యకు, దీటుగానే నోముల కుమారుడు నోముల భగత్ కార్యక్రమాలలో పాల్గొంటుండటం ఎమ్మెల్యే ఎన్నికలకు తండ్రికి తోడుగా వచ్చి వెళ్తాడునుకున్న యువనేత, ఇపుడు నియోజకవర్గంలోనే తిష్టవేయడం, తమకు ఆర్డర్ వేసేలా ఫోన్లు చేయడమేంటనీ, టిఆర్ఎస్ సీనియర్‌లు సైతం రగిలిపోతున్నారట. మొత్తానికి నాగార్జున సాగర్‌లో జరుగుతున్న ప్రచారంలో నిజమెంతో తెలీదు కానీ, నోముల నర్సింహ్మయ్యకు మాత్రం, ఇవన్నీ తెగ చికాకు తెప్పిస్తున్నాయట. చూడాలి, మున్ముందు నాగార్జున సాగర్‌లో ఇంకెంత రసవత్తరంగా సాగుతుందో.

Web TitleRumors spreading over Nagarjuna Sagar MLA Nomula Narsayya health in Telangana political circles
Next Story