కోయకుండానే కళ్లలో నీళ్లు తెప్పిస్తోన్న ఉల్లి

కోయకుండానే కళ్లలో నీళ్లు తెప్పిస్తోన్న ఉల్లి
x
Highlights

ఘాటెక్కిన ఉల్లి ధరలు.. జనాల కళ్లలో నీళ్లు తెప్పిస్తున్నాయ్. రెండు రోజుల్లో సీన్ అంతా మారిపోయింది ! కిలో కావాలంటే వంద నోటు ప్లీజ్ అంటున్నారు వ్యాపారులు...

ఘాటెక్కిన ఉల్లి ధరలు.. జనాల కళ్లలో నీళ్లు తెప్పిస్తున్నాయ్. రెండు రోజుల్లో సీన్ అంతా మారిపోయింది ! కిలో కావాలంటే వంద నోటు ప్లీజ్ అంటున్నారు వ్యాపారులు ! ఉల్లి లేని కూర రుచి ఊహిస్తామా ! అందుకే ధరలు తగ్గించయ్యా అంటూ వినియోగదారులు వేడుకుంటున్నారు. మరి ఎప్పుడు ధరలు తగ్గే చాన్స్ ఉంది ? ఎందుకు ఇంత సడెన్‌గా పెరిగాయ్.

ఉల్లిగడ్డలు అంతే పోషకాల రూపంలో చలువు చేసినా ధరల రూపంలో కన్నీళ్లు తెప్పిస్తుంటాయ్ అప్పుడప్పుడు ! ఇప్పుడు అలానే తయారైంది పరిస్థితి. వంద రూపాయలిస్తే నాలుగైదు కిలోలు వచ్చేవి నిన్న మొన్నటివరకు ! ఇప్పుడు మాత్రం కిలో తూగాలంటే వంద నోటు కావాల్సిందే అంటున్నాయ్. తెలుగు రాష్ట్రాల్లో ఉల్లి ధరలు భగ్గుమంటున్నాయ్. హైదరాబాద్‌లో సెంచరీ అటు అటుగా ధరలు కొనసాగుతుంటే చాలా ప్రాంతాల్లో ఆ స్కోర్ కూడా దాటేసింది. గత రెండు మూడు రోజుల్లోనే కిలోకు 60 రూపాయలకు పైగా ధర పెరిగింది.

రైతుబజార్లలో రెండురోజుల కిందవరకు 25లోపు ఉన్న ఉల్లిగడ్డ ధరలు ఇప్పుడు 90 పలుకుతున్నాయ్. దీంతో కోయకుండానే కన్నీళ్లు కార్పించేస్తోందీ ఉల్లి ! ధరల పెరుగుదలకు భారీ వర్షాలు, వరదలే కారణం. గత కొన్ని రోజులుగా కురుస్తున్న వానలకు చాలాచోట్ల ఉల్లి నీటమునిగింది. దీంతో ఎక్కువ శాతం పంట కుళ్లిపోయింది. వర్షాకాలంలో ఆంధ్రప్రదేశ్‌లో 15వేలు, తెలంగాణలో 5వేల 5వందల హెక్టార్లలో ఉల్లి సాగుచేసినా పెద్దగా పంట చేతికి రాలేదు.

హైదరాబాద్‌కు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా మహారాష్ట్రలోని షోలాపూర్‌, ఔరంగాబాద్‌ కర్ణాటకలోని శివమొగ్గ, రాయచూర్‌ మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌, ఇండోర్‌ నుంచి ఉల్లిగడ్డ వస్తుంది. ఐతే మహారాష్ట్ర, కర్ణాటకల్లో వర్షాలు కుమ్మేస్తున్నాయ్. దీంతో ఉల్లిసాగుకు తీవ్ర నష్టం వాటిల్లింది. ఇప్పుడు మధ్యప్రదేశ్, రాజస్థాన్‌, గుజరాత్‌ నుంచి సరకు వస్తే తప్ప ధరలు తగ్గే అవకాశం లేదు. ప్రస్తుతం మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌ నుంచి రోజుకు 70లారీల ఉల్లిగడ్డ హైదరాబాద్‌ వస్తోంది. ఉల్లి ధరలు నియంత్రించేందుకు ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. ముఖ్యంగా రైతు బజార్లలో సబ్సిడీపై నాణ్యమైన ఉల్లి అందించే ఏర్పాట్లు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories