2019: పరిమళించిన గులాబీ.. చేజారిన హస్తం.. కమల వికాసం..

2019: పరిమళించిన గులాబీ.. చేజారిన హస్తం.. కమల వికాసం..
x
2019: పరిమళించిన గులాబీ.. చేజారిన హస్తం.. కమల వికాసం..
Highlights

2019కు గుడ్ బై చెప్పి కోటి ఆశలతో కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్నాం. 2020కు ఘన స్వాగతం పలకబోతున్నాం. పాత సంవత్సరంలో మధుర జ్ఞాపకాలను గుర్తు...

2019కు గుడ్ బై చెప్పి కోటి ఆశలతో కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్నాం. 2020కు ఘన స్వాగతం పలకబోతున్నాం. పాత సంవత్సరంలో మధుర జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటేనే కొత్త లక్ష్యాలను సిద్ధం చేసుకునేందుకు అడుగులు ముందుకే వేస్తున్నాం. 2020కు స్వాగతం పలికే ముందు 2019లో జరిగిన కొన్ని జ్ఞాపకాలను నెమరు వేసుకుందాం.

సంక్షేమం, అభివృద్ధిలో తెలంగాణ సర్కార్‌కు మిశ్రమ ఫలితాలు ఇచ్చింది 2019. ఆర్థిక మాంద్యం ప్రభుత్వాన్ని డీలాపరిచింది. ఆర్థిక ఒడిదుడుకులతో ఇచ్చిన హామీలు నెరవేర్చలేక ఇబ్బందులు పడుతోంది. ఆర్టీసీ సమ్మె, దిశా ఘటన గులాబీ పార్టీని ఇరకాటంలోకి నెట్టేసినా.. తర్వాత కుదురుకునేలా చేసింది.

కేసీఆర్ పాలన ఈ ఏడాది పడుతూ లేస్తూ సాగింది. ఆర్థిక ఒడిదుడుకులతో ఎదురీదుతోంది ప్రభుత్వం. ఇంటర్ ఫలితాల వ్యవహారం, ఆర్టీసీ సమ్మె, దిశ అత్యాచారం, హత్య ఘటనతో ప్రభుత్వం అప్రదిష్టపాలైంది. ఇంటర్‌ ఫలితాల్లో తప్పులు దొర్లడంతో చాలామంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారు. దీనిపై తల్లిదండ్రులు , ప్రతిపక్షాలు నిలదీశాయి.

ఇటు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది. ఆర్థిక మాంద్యం ఎఫెక్ట్‌‌తో భారీ ఆదాయం పడిపోయింది. దీంతో లక్షా 82వేల కోట్లతో ప్రవేశపెట్టే ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను లక్షా 46వేల కోట్లకు కుదించాల్సి వచ్చింది. భూముల అమ్మకం ద్వారా 10వేల కోట్లను సమీకరించుకోవాలని నిర్ణయించుకున్నారు. కోకాపేట భూముల అమ్మకంపై హైకోర్టు స్టే విధించడంతో అది నెరవేరడం లేదు. ఆర్థిక ఇబ్బందులతో ఇచ్చిన కీలక హామీలు ఏవి నెరవేర్చలేని స్థితిలో ప్రభుత్వం ఉంది.

మొదటి నాలుగున్నరేళ్లు కేంద్రంతో సఖ్యతగా ఉన్న కేసీఆర్ రెండోసారి అధికారంలోకి రాగానే క్రమంగా సంబంధాలు దెబ్బతిన్నాయి. ఇటు 370 రద్దు, త్రిపుల్ తలాక్‌పై కేంద్రానికి మద్దతు ఇచ్చిన టీఆర్ఎస్‌ పౌరసత్వ బిల్లును వ్యతిరేకించింది. జీఎస్టీ బకాయిల కోసం ఆ పార్టీ ఎంపీలు పార్లమెంట్ ముందు నిరసనకు దిగారు.

పార్లమెంట్‌ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. సీఎం కూతురు కవితతో పాటు వినోద్ కుమార్ ఓడిపోయారు. ఆ తర్వాత జరిగిన మండల, జిల్లా పరిషత్ ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయం సాధించింది. హుజుర్‌నగర్ ఉప ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలుపొందడం టీఆర్‌ఎస్‌కు ఊరటనిచ్చింది. ఈ ఏడాదిలో ఆర్టీసీ సమ్మె రాష్ట్ర ప్రభుత్వాన్ని కుదుపేసింది. 54రోజులు ఆర్టీసీ ఉద్యోగులు సమ్మె చేసినా ప్రభుత్వం చర్చలు జరపలేదు. హైకోర్టు ఆదేశించినా పట్టించుకోలేదు. చివరకు కార్మికులను విధుల్లోకి తీసుకుంది. డిపోల వారిగా కార్మికులను పిలిపించుకుని ప్రగతి భవన్‌ లో బేటీ అయ్యారు కేసీఆర్. ఆర్టీసీ కార్మికులకు సీఎం వరాల జల్లు కురిపించారు.

సుదీర్ఘ కాలం గవర్నర్‌గా పనిచేసిన నరసింహన్‌ స్థానంలో కొత్త గవర్నర్‌గా తమిళనాడుకు చెందిన తమిళిసై సౌందరరాజన్ నియమితులయ్యారు. కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించిన ఆమె ప్రాజెక్టు అద్భుతమని కొనియాడారు. భూపాలపల్లి జిల్లాలో తమిళిసై పర్యటించి గిరిజనులతో మమేకం అయ్యారు. 2019 టీఆర్ఎస్‌కు, కేసీఆర్ ప్రభుత్వానికి అంతగా అచ్చిరాలేదనే చెప్పాలి ఇటు ఆర్థికంగా అటు రాజకీయంగా, పాలనపరంగా ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంది గులాబీ పార్టీ.

2019 గులాబీ పార్టీకి కలిసి వచ్చిందా....? ప్రభుత్వ పథకాలు జనాలను ఆకట్టుకున్నాయా...? రాజకీయంగా టీఆర్ఎస్ బలోపేతం అయిందా...? పార్లమెంట్‌ ఎన్నికలు పార్టీ శ్రేణులను నిరాశ పరిచాయా...? 2019లో టీఆర్ఎస్‌‌ గురించి తెలంగాణ ఏమంటోంది?

2019 టీఆర్‌ఎస్‌కు ఎంతో కలిసివచ్చిందనే చెప్పుకోవాలి. ఈ సంవత్సరం ఇటు సర్కార్‌కు అటు గులాబీ పార్టీకి ఎన్నో మధుర జ్నాపకాలు మిగిల్చింది. ఈ ఏడాది టీఆర్ఎస్‌కు మిశ్రమ ఫలితాలు అందజేసింది. అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించినా లోక్‌సభ ఎన్నికలు కొంత నిరుత్సాహ పరిచాయి. స్థానిక ఎన్నికలతో పాటు హుజుర్‌నగర్ ఉప ఎన్నికల్లో గులాబీ దళం సత్తా చాటింది. 31 జిల్లా పరిషత్ చైర్మన్‌ స్థానాలు గెలిచి కారు దూసుకుపోయింది. వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కేటీఆర్ అభ్యర్థుల గెలుపు బాధ్యతలను తన భుజాలపై మోసారు. ఒంటి చేత్తో టీఆర్ఎస్ గెలుపుకు బాటలు వేశారు కేటీఆర్.

టీఆర్ఎస్ వ్యూహాలు బ్రహ్మండంగా పని చేశాయి. 12మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సొంత పార్టీని వీడి సీఎల్పీని టీఆర్ఎస్‌ ఎల్పీలో విలీనం చేశారు. దీంతో కాంగ్రెస్ ప్రతిపక్ష హోదా కోల్పోయింది. మంత్రి వర్గ విస్తరణలో సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్‌కు అవకాశం కల్పించింది. ములుగు, నారాయణపేట జిల్లాల ఏర్పాటుతో జిల్లాల సంఖ్య 33కి పెరిగింది.

సంక్షేమంలో ప్రభుత్వం ఆదర్శంగా నిలిచింది. ఆసరా పెన్షన్ల రెండువేలకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దివ్యాంగులకు 3,019 రూపాయల పెన్షన్ అందిస్తోంది. ఇటు రైతుబంధు పథకం కింద గత ఏడాదిలో రెండు పంటలకు కలిపి 8వేలు ఇవ్వగా ఈ ఏడాది నుంచి ఎకరాకు పదివేలు పంపిణీ చేస్తోంది.

తెలంగాణ రైతుల కలల పంట కాళేశ్వరం ప్రాజెక్టు ఆవిష్కృతమైంది. జూన్ 21 2019న ఈ భారీ ప్రాజెక్టు జాతికి అంకితమైంది. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా 37లక్షల ఎకరాలకు సాగునీరు అందనుంది. 140 టీఎంసీల నీటిని ఒడిసిపట్టే విధంగా 80 వేల కోట్లతో నిర్మించిన ఈ ప్రాజెక్టులో రాష్ట్రంలోని 80 నియోజకవర్గాలకు తాగు, సాగు నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపనుంది.

క్లిష్టమైన ఆర్టీసీ సమ్మె సుఖాంతమైంది.ఆర్టీసీ కార్మికులకు వరాల జల్లు కురిపించింది ప్రభుత్వం. రిటైర్‌మెంట్ వయస్సు 58 ఏళ్ల నుంచి 60 సంవత్సరాలకు పెంచింది. మహిళ కండక్టర్లకు నైట్ డ్యూటీలు రద్దు చేయడంతో పాటు ప్రతి డిపోలో సంక్షేమ బోర్డు ఏర్పాటు చేశారు. ఆర్టీసీ ఆదాయం పెరిగేలా సరుకు రవాణా రంగంలోకి వచ్చింది. మొత్తానికి టీఆర్ఎస్‌కు 2019 కొంత ఉత్సాహాన్ని మరికొంత నిరుత్సాహాన్ని నింపింది.

తెలంగాణ కాంగ్రెస్‌‌ను 2019 నిండా ముంచిందా? కాంగ్రెస్ శాసనసభా పక్షం టీఆర్ఎస్‌లో విలీనం కావడం పార్లమెంట్‌ ఎన్నికల్లో కొంత సానుకూల ఫలితం వచ్చినా హుజుర్‌నగర్ ఓటమి నిరాశ పరిచింది. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడంలో కాంగ్రెస్‌ సఫలం కాలేకపోయింది. పీసీసీ చీఫ్ మార్పు ప్రచారానికే పరిమితమైంది. తెలంగాణ కాంగ్రెస్‌ పరిణామాలను 2019 ఎలా చూసింది?

2019 తెలంగాణ కాంగ్రెస్‌కు కొంత మోదం కొంత ఖేదం మిగిల్చింది. పార్లమెంట్ ఎన్నికల్లో మూడు స్థానాలు గెలిచి కాంగ్రెస్ సత్తా చాటింది. నల్గొండ నుంచి ఉత్తమ్‌కుమార్ రెడ్డి, మల్కాజిగిరి నుంచి రేవంత్ రెడ్డి, భువనగిరి నుంచి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి విజయం సాధించి కాంగ్రెస్‌కు ఊపిరూలూదారు. కొన్ని పార్లమెంట్‌ స్థానాల్లో కనీసం పోటీ కూడా ఇవ్వలేకపోయింది హస్తం పార్టీ. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆశించిన ఫలితాలను సాధించలేకపోయింది.

పార్టీ ఫిరాయింపులు కాంగ్రెస్‌ను దెబ్బతీశాయి. హస్తం గుర్తుపై గెలిచిన 12మంది ఎమ్మెల్యేలు అధికార పార్టీ గూటికి వెళ్లిపోయారు. గెలిచిన 19మందిలో 12మంది పార్టీ వీడిపోయారు. మిగతా వాళ్లంతా ఎవరికి వారే యమునా తీరే అన్నట్లు వ్యవహరించారు. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరుతారనే ప్రచారం జరిగింది. హుజుర్‌నగర్‌ లో కాంగ్రెస్ అభ్యర్థి పద్మావతి ఓడిపోవడంతో కాంగ్రెస్ మరింత బలహీన పడింది.

కాంగ్రెస్‌ పార్టీకి ఈ ఏడాది చాలామంది సీనియర్లు దూరం అయ్యారు. మాజీ మంత్రి డి.కె. అరుణ బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. సబితా ఇంద్రారెడ్డి, సునీత లక్ష్మారెడ్డి వంటి నేతలు టీఆర్‌ఎస్‌ గూటికి చేరారు. పార్టీ సీనియర్ నేత జైపాల్ రెడ్డి మృతి చెందారు. పార్టీలో సీనియర్ నేతల మధ్య అంతర్గత విభేదాలు కార్యకర్తలకు ఇబ్బందిగా మారాయి.

ప్రతిపక్ష పార్టీగా కాంగ్రెస్ సత్తా చాటుకోలేకపోయింది. ఇంటర్ బోర్డు వ్యవహారంలో బీజేపీ దూకుడును కాంగ్రెస్ అందుకోలేకపోయింది. నల్లమలలో యూరేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పోరాడినప్పటికీ జనసేన అఖిల పక్షానికి వెళ్లడంపై పార్టీలో విమర్శలు ఎదుర్కోంది. రేవంత్ రెడ్డి, ఇతర నేతల మధ్య కోల్డ్‌వార్ నడిచింది. 2019 తెలంగాణ కాంగ్రెస్‌కు నిరాశే మిగిల్చిందని చెప్పాలి. పార్టీలో నేతల మధ్య అనైక్యత, ఎమ్మెల్యేలు, ఇతర నేతలు పార్టీ వీడటం పార్టీని తీవ్ర ఇబ్బందులకు గురి చేశాయి.

కాషాయ దళానికి 2019 కలిసి వచ్చిందా...? నాలుగు ఎమ్మెల్యే స్థానాలు పోయాయనుకుంటే నాలుగు ఎంపీ సీట్లు రావడాన్ని కమలనాథులు ఎలా చూస్తున్నారు? అలా అందివచ్చిన విజయాలు ఎందుకు ఉపయోగపడలేదు...? సంస్థాగత ఎన్నికల్లో లోపం ఎక్కడ జరిగింది...? పార్టీలో చేరికలు ఊపునిచ్చాయా..? కారుకు దీటుగా హస్తాన్ని పక్కకు నెట్టేసి కమలం ప్రత్యామ్నాయంగా వికసించగలదా?

2019 ఎవరికి ఎలా ఉన్న తెలంగాణ బీజేపీకి మాత్రం మంచి ఊపునిచ్చింది. ఎవరూ ఊహించనట్లుగా నాలుగు ఎంపీ స్థానాలు గెలుచుకుని ఉనికి చాటుకునే స్థాయి నుంచి పోటీ ఇస్తామనే సంకేతాలిచ్చింది. ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్, సికింద్రాబాద్ పార్లమెంట్ స్థానాల్లో విజయదుందుభి మోగించింది. మోడీ కేబినెట్‌లో కిషన్‌రెడ్డి ఛాన్స్ కొట్టారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ చతికిలపడింది.

ఆందోళనలో బాటలో కాంగ్రెస్‌కు దీటుగా దూసుకుపోయింది బీజేపీ. ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యలపై జరిగిన నిరసనలకు అండగా నిలిచింది. విద్యుత్ కొనుగోళ‌్లపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ ఆరోపణలు సంధించారు. మద్యం నియంత్రణపై బీజేపీ నాయకురాలు డి.కె. అరుణ రెండురోజులపాటు దీక్ష నిర్వహించారు. మూసీ ప్రక్షాళన పేరుతో మూడు రోజులు ఆందోళనకు దిగారు. RTC కార్మికుల నిరసనకు బాసటగా నిలిచారు బీజేపీ నేతలు.

ఈ ఏడాది బీజేపీలోకి వలసల పరంపర కొనసాగింది. కాంగ్రెస్‌ నుండి మాజీ మంత్రి డి.కె. అరుణ, టీఆర్ఎస్ నుండి మాజీ ఎంపీలు జితేందర్ రెడ్డి, వివేక్, టీడీపీ నుంచి ఎంపీ గరికపాటి , సీనియర్ నాయకులు మోత్కుపల్లి నర్సింహులు, మాజీ మంత్రి పెద్దిరెడ్డి, వీరేందర్ గౌడ్ తదితరులు కమలం పార్టీలో చేరారు. కొత్తగా బీజేపీలో చేరిన వారికి ప్రయారిటీ ఇవ్వడం లేదన్న విమర్శలు వచ్చాయి.

తెలంగాణ రాష్ట్రానికి కేంద్రమంత్రుల తాకిడి పెరిగింది. గత ఆరు నెలల్లో 60సార్లు కేంద్రమంత్రులు తెలంగాణలో పర్యటించారు. మొత్తానికి 2019 బీజేపీకి పార్లమెంట్ ఎన్నికలు కలిసొచ్చినా స్థానిక సంస్థల ఎన్నికలు దెబ్బకొట్టాయి. కలిసి వచ్చిన అవకాశాలను బీజేపీ ఉపయోగించుకోలేకపోయిందన్న అభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. కొత్త ఏడాదైనా బీజేపీ దశ మారుస్తుందో వేచి చూడాలి.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories