కేవీపీ vs రేవంత్‌.. సీన్‌ రివర్సై... రేవంత్‌కు యాంటిగా మారారా?

Revanth Reddy vs KVP Ramachandra Rao
x

కేవీపీ vs రేవంత్‌.. సీన్‌ రివర్సై... రేవంత్‌కు యాంటిగా మారారా?

Highlights

KVP Ramachandra Rao: కాంగ్రెస్ పార్టీలో ఆయన ప్రభావం ఇంకా ఉందా?

KVP Ramachandra Rao: కాంగ్రెస్ పార్టీలో ఆయన ప్రభావం ఇంకా ఉందా? ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికారంలో ఉన్నప్పుడు చక్రం తిప్పిన ఆయన మళ్లీ చెలరేగుతారా? తెలంగాణ కాంగ్రెస్‌లో తన హవా నడిపించబోతున్నారా? ఇటీవల రేవంత్‌రెడ్డిపై అలిగిన నేతలను ఆయనే దారికి తెచ్చారా? బుజ్జగించి ఊరడించారా? ఏదైనా ఆయనతోనే సాధ్యం అవుతుందని హస్తం నేతలు అనుకుంటున్నారా? సీనియర్లకు అండగా ఆయన రంగంలోకి దిగుతున్నారా? అందుకే రేవంత్‌ వర్గం కూడా ఆయనకు యాంటిగా చక్రం తిప్పుతోందా? తెలంగాణ కాంగ్రెస్‌లో కిరికిరికి కారణమయ్యారని చర్చించుకుంటున్న ఆ నేత ఎవరు?

కేవీపీ రామచంద్రరావు. వైఎస్‌ హయాంలో ఉమ్మడి రాష్ట్రంలో చక్రం తిప్పిన నాయకుడు. ఆయన ఇప్పుడు మరోసారి తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీలో తన హవా చూపించబోతున్నారట. రాష్ట్రం విడిపోయినా తెలంగాణ‌ కాంగ్రెస్‌‌లో కేవీపీ ఇంకా చ‌క్రం తిప్పుతూనే ఉన్నారట. నాడు వైఎస్ హయాంలో కీల‌కంగా పని చేసిన కాంగ్రెస్ సీనియర్లు ఇప్పుడు దూరం దూరంగా ఉండటం వెనుక ఆయ‌నే కారణమన్న టాక్‌ వినిపిస్తోంది. కేవీపీ డైరెక్షన్‌లో ఏకమైన తెలంగాణ హస్తం సీనియర్లు రేవంత్‌రెడ్డికి కావాలనే హ్యాండ్‌ ఇస్తున్నారన్న చర్చ జరుగుతోంది. వైఎస్ ఆత్మ చ‌క్రం తిప్పుడం వల్లే తెలంగాణ కాంగ్రెస్‌లో కిరికిరి మొదలైందని రేవంత్‌ వ‌ర్గం కూడా చర్చించుకుంటుందట.

తెలంగాణ కాంగ్రెస్‌ను కేవీపీ రూపంలో సరికొత్త స‌మ‌స్య వెంటాడుతోంద‌ట. వైఎస్ ఆత్మగా పేరున్న మాజీ రాజ్యస‌భ స‌భ్యుడు కేవీపీ మ‌ళ్లీ త‌న రాజ‌కీయ చ‌తుర‌త‌ను తెలంగాణ కాంగ్రెస్‌పై చూపిస్తున్నారన్న ప్రచారం జ‌రుగుతోంది. రేవంత్‌రెడ్డి పీసీసీ ప్రెసిడెంట్ అయ్యాక‌ కాంగ్రెస్‌లో సీనియ‌ర్‌ నేతలంతా స‌హాయ‌ నిరాక‌రణ చేయ‌డం వెనుక కేవీపీ హ‌స్తం ఉండి ఉంటుందని రేవంత్ వ‌ర్గం అనుకుంటోంది. పీసీసీ చీఫ్‌ నేతృత్వంలో ఇటీవ‌ల జరిగిన ద‌ళిత గిరిజ‌న స‌భ‌లు గ్రాండ్ స‌క్సెస్ కావ‌డంతో పార్టీ బ‌ల‌ప‌డుతుంద‌నే చ‌ర్చ జరిగింది. ఆ తర్వాతే ఎవరూ ఊహించని విధంగా పార్టీలో సీనియ‌ర్లు ఒక్కసారిగా అల‌గ‌డం వెనుక కేవీపీ హ్యాండ్‌ ఉండొచ్చని రేవంత్ టీమ్‌ భావిస్తోందట.

సీఎం కేసీఆర్‌కు కెవీపీ అనుకూలంగా పనిచేస్తారని చెప్పుకుంటున్న రేవంత్‌ టీమ్‌ తెలంగాణలో కాంగ్రెస్ బ‌ల‌ప‌డ‌కుండా చేస్తున్నారని అంటున్నారు. నాడు వైఎస్ ప్రభుత్వంలో కీల‌కంగా పనిచేసిన తెలంగాణకు చెందిన కేవీపీకి శిష్యులుగా పేరున్న నేతలు ఏకమై రేవంత్‌రెడ్డికి స‌హ‌క‌రించ‌డం లేదన్న టాక్‌ వినిపిస్తోంది. ఇందులో కచ్చితంగా కేవీపీ హస్తం ఉంటుందని రేవంత్ వ‌ర్గం చ‌ర్చించుకుంటుంది. అందుకే నాడు వైఎస్ ప్రభుత్వంలో మంత్రిగా ప‌నిచేసిన కోమ‌టిరెడ్డి వెంక‌ట్‌రెడ్డితో పాటు దుద్దిళ్ల శ్రీధర్‌‌బాబు, నాటి మంత్రి, నేటి ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డితో పాటు, కోమటిరెడ్డి రాజ్‌గోపాల్‌రెడ్డి, జ‌గ్గారెడ్డి, భ‌ట్టి విక్రమార్క, పొన్నం ప్రభాక‌ర్‌ వంటి నేతలంతా రేవంత్‌కు స‌హ‌క‌రించ‌డం లేద‌న్న టాక్‌ ఉంది. వీళ్లంతా కేవీపీ డైరెక్షన్‌లోనే నడుస్తున్నారని, ఆయన చెప్పినట్టే రేవంత్‌ టీమ్‌కు కోఆపరేట్‌ చేయట్లేదన్న ప్రచారం జరుగుతోంది. మొదట్లో వీళ్లంతా స‌హ‌కరించినట్టే వ్యవహరించినా తర్వాత్తర్వాత ఒక్కొక్కరూ దూరంగా ఉంటున్నారట. రాజేంద్రనగర్‌లోని ఓ ఫామ్‌హౌస్‌ సాక్షిగా దీనికి వ్యూహరచన జరిగి ఉంటుందని రేవంత్ వ‌ర్గం అనుకుంటోంది.

రేవంత్‌ పీసీసీ అయిన కొత్తలో కేవలం కేవీపీ మాట మీదే తెలంగాణ కాంగ్రెస్‌లో సీనియర్లు దారికి వచ్చారట. రేవంత్‌రెడ్డిని పీసీసీ చీఫ్‌గా నియమించడానికి ముందు నుంచీ గుర్రు మీద ఉన్న సీనియర్లు కేవీపీ మాట మీదే ఒక్కసారిగా సైలెంటయ్యారని అప్పట్లో చర్చ జరిగింది. పీసీసీ చీఫ్‌ ప్రకటన తర్వాత రోజులు రోజు రేవంత్‌రెడ్డి అనుచరులు ఫోన్‌ చేస్తే కనీసం అందులోనూ పలకని కాంగ్రెస్ సీనియర్లు ఆయన బాధ్యతల స్వీకరణ సమయానికి సైలెంటు అవడం వెనుక కేవీపీ హస్తం ఉందన్న ప్రచారం జోరుగా వినిపించింది. ఆ కార్యక్రమానికి ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, కోమటిరెడ్డి బ్రదర్స్ మినహా కేవీపీ మీద గౌరవంతో అందరూ హజరయ్యారు. కానీ వీళ్లందరినీ అంతలా మెత్తబరచడానికి కేవీపీ ఎలాంటి అస్త్రాన్ని ప్రయోగించారోనని పార్టీ నేతలు అప్పట్లో బాహాటంగానే చర్చించుకున్నారు.

నిజానికి రేవంత్‌పై అలిగినే నేతలందరూ కేవీపీని రాజకీయ గురువుగానే భావిస్తారు. అలిగిన నేతలను అలర్ట్‌ చేయాలంటే కేవీపీయే బెటరన్న నిర్ణయానికి వచ్చిన రేవంత్‌ ఆయన్ను రంగంలో దించినట్లు తెలుస్తోంది. అందుకే కొన్నాళ్ల నుంచి గాంధీభవన్ మెట్లెక్కని కేవీపీ రేవంత్ ప్రమాణ స్వీకారం రోజు గాంధీభవన్ వచ్చి ఉంటారని చెప్పుకుంటున్నారు. కానీ ఈసారి సీన్‌ రివర్సై రేవంత్‌కు యాంటిగా మారడం వెనుక ఏం జరిగి ఉంటుందోనని గాంధీభవన్‌ మాట్లాడుకుంటోంది. ఏమైనా రేవంత్‌పై కేవీపీని చివరి అస్త్రంగా ప్రయోగించిన సీనియర్లు దారికి వస్తారో దారికి తెచ్చుకుంటారో తెలియదు. మరి, ఈ తాజా వివాదానికి రేవంత్ ఎలా పుల్‌స్టాప్ పెడుతారో చూడాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories