Revanth Reddy: ఇవాళ తెలంగాణ సీఎంగా రేవంత్‌ ప్రమాణస్వీకారం

Revanth Reddy to take oath as Telangana CM today
x

Revanth Reddy: ఇవాళ తెలంగాణ సీఎంగా రేవంత్‌ ప్రమాణస్వీకారం

Highlights

Revanth Reddy: మ.1:04కు సీఎంగా రేవంత్‌ ప్రమాణస్వీకారం

Revanth Reddy: తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డి ప్రమాణ స్వీకారానికి సర్వం సిద్ధమయ్యింది. సీఎల్పీ నేతగా ఎన్నికైన రేవంత్‌రెడ్డితో మధ్యాహ్నం 1.04 గంటలకు గవర్నర్‌ తమిళిసై ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. హైదరాబాద్‌లోని ఎల్బీస్టేడియంలో ఈ కార్యక్రమం జరగనుంది. ప్రమాణస్వీకారం అనంతరం రేవంత్‌ రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన 6 గ్యారంటీలు, ఇతర హామీల అమలుపై ప్రకటన చేయనున్నారు. ఈ వేదికపైనే ఆయా గ్యారంటీలకు సంబంధించిన ఫైల్‌పై రేవంత్‌ సీఎంగా తొలి సంతకం చేసే అవకాశం ఉంది.

పకడ్బందీగా ఏర్పాట్లు: సీఎంగా రేవంత్‌రెడ్డి ప్రమాణ స్వీకారోత్సవం కోసం ఎల్బీ స్టేడియంను ముస్తాబు చేశారు. భారీ వేదికను సిద్ధం చేశారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేతలు సోనియా గాందీ, రాహుల్, ప్రియాంకలతోపాటు కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాల సీఎంలు, టీపీసీసీ సీనియర్‌ నేతలు వేదికపై ఆసీనులు కానున్నారు. కాంగ్రెస్‌ శ్రేణులు, అభిమానులు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమానికి హాజరుకానున్నట్టు టీపీసీసీ వర్గాలు తెలిపాయి.

కాగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి బుధవారం డీజీపీ రవిగుప్తాతో కలసి ఎల్బీ స్టేడియంలో ఏర్పాట్లను పరిశీలించారు. కార్యక్రమానికి హాజరయ్యే ప్రజలు, ఇతర ప్రముఖులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా పకడ్బందీగా అన్నీ సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. స్టేడియంలో తాగునీరు, ఇతర సౌకర్యాలన్నీ కల్పించాలని సూచించారు. వివిధ రాష్ట్రాల సీఎంలు, ప్రజాప్రతినిధులు, ఇతర ప్రముఖులు పాల్గొంటున్న నేపథ్యంలో వారి కోసం ప్రత్యేకంగా గ్యాలరీలను సిద్ధం చేయాలని.. వాహనాల పార్కింగ్, బందోబస్తు విషయంలో ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

మధ్యాహ్నం సచివాలయానికి రేవంత్‌

ఎల్బీ స్టేడియంలో ప్రమాణ స్వీకార కార్యక్రమం ముగిశాక రేవంత్‌రెడ్డి నేరుగా సచివాలయానికి చేరుకుని.. తన చాంబర్‌లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించనున్నారు. అనంతరం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ఇతర సీనియర్‌ ఐఏఎస్‌ అధికారులతో సమావేశమై రాష్ట్రంలో పాలన పరిస్థితులు, ఇతర అంశాలపై సమీక్షించే అవకాశం ఉంది.

ప్రమాణ స్వీకారానికి సీపీఐ జాతీయ కార్యదర్శి డి.రాజా

రేవంత్‌ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సీపీఐ జాతీయ కార్యదర్శి డి.రాజా, సీనియర్‌ నేతలు కె.నారాయణ, సయ్యద్‌ అజీజ్‌ పాషా, చాడ వెంకటరెడ్డి తదితరులు హాజరుకానున్నారు. సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ఈ వివరాలు వెల్లడించారు.

కట్టుదిట్టంగా భద్రత.. ట్రాఫిక్‌ ఆంక్షలు

ఎల్బీ స్టేడియంలో రేవంత్‌రెడ్డి ప్రమాణ స్వీకారం, తర్వాత సచివాలయానికి వెళ్లనుండటం నేపథ్యంలో పోలీసు శాఖ కట్టుదిట్టంగా భద్రతా ఏర్పాట్లు చేసింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా నిఘా పెట్టింది. గురువారం ఉదయం నుంచే ఎల్‌బీ స్టేడియం, సచివాలయం పరిసరాల్లో సుమారు 2వేల మంది పోలీసులను మోహరించనున్నారు.

జూబ్లీహిల్స్‌లోని రేవంత్‌ నివాసం నుంచి ఎల్బీ స్టేడియం రూట్‌ పార్టీని ఏర్పాటు చేస్తున్నారు. బందోబస్తుపై బలగాలు బుధవారం మధ్యాహ్నమే రిహార్సల్స్‌ పూర్తి చేశాయి. ఆయా ప్రాంతాల్లో నిఘా, తనిఖీలు కొనసాగుతున్నాయి. ఇక గురువారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఆయా ప్రాంతాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలను అమలు చేయనున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories