Huzurabad: కారు, హస్తం మధ్యలో కమలం!!

Revanth Reddy not Concentration on Huzurabad Campaign
x

Huzurabad: కారు, హస్తం మధ్యలో కమలం!!

Highlights

Huzurabad: హుజూరాబాద్‌లో అధికార పార్టీకి హస్తం పార్టీ అస్త్రాలను అందిస్తోందా?

Huzurabad: హుజూరాబాద్‌లో అధికార పార్టీకి హస్తం పార్టీ అస్త్రాలను అందిస్తోందా? ఉపఎన్నిక ప్రచారానికి పీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి రాకపోవడాన్ని గులాబీ పార్టీ ఎలా చూస్తోంది? స్వయంగా సారథే అస్త్ర సన్యాసం చేశారంటే కాంగ్రెస్ ఆ ఎన్నికను లైట్ తీసుకుందన్న అంచనాతో ఉందా? కాంగ్రెస్‌ను దోషిగా చూపించే ప్రయత్నం చేస్తోందా? హస్తం సారథే అస్త్రాలు అందించే ఉపాయంలో ఉన్నారన్న ప్రచారంలో నిజమెంత?

తెలంగాణలో హుజూరాబాద్‌ రాజకీయం రక్తి కట్టిస్తోంది. అధికార పార్టీని ఆహ్వానించి విమర్శించడనికి విపక్షాలు అస్త్రాలను అందిస్తున్నాయి. ఉపఎన్నిక ప్రచారం తారాస్థాయికి చేరడం, అన్ని పార్టీలు వ్యూహాల అమలులో బిజీగా మారడం హుజూరాబాద్ బైపోల్‌ వార్‌ వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు సెమీ ఫైనల్‌గా భావిస్తున్న అగ్రనేతలు బైపోల్‌ ఫీల్డ్‌లో వేడిపుట్టిస్తున్నారు. మరీ ముఖ్యంగా టీఆర్ఎస్‌, బీజేపీకి చెందిన హేమాహేమీలంతా హుజూరాబాద్‌లోనే మకాం వేసి ప్రచార సరళిని పర్యవేక్షిస్తున్నారు. ఇక అధికార టిఆర్ఎస్ పార్టీ అయితే, ప్రచారం ముగింపు రోజు ముఖ్యమంత్రి కేసీఆర్‌తో సభ నిర్వహణకు ప్లాన్‌ చేసింది.

కానీ, తెలంగాణలో భవిష్యత్తంతా తమదే అని ప్రచారం చేసుకుంటున్న కాంగ్రెస్ మాత్రం అంటీముట్టనట్టుగా వ్యవహరిస్తోందని ప్రచారం ఉంది. దీనికి తోడు ఆ పార్టీ సారథి రేవంత్‌రెడ్డి నామినేషన్ వేసిన రోజు తప్ప ఇప్పటి వరకు అటువైపు కన్నెత్తి చూడలేదు. ప్రచారం చివరి రోజున హుజూరాబాద్‌ వెళ్తారని చెప్పుకుంటున్నా ఇంకా క్లారిటీ రావడం లేదు. అందుకే టీఆర్ఎస్‌ అదే అంశాన్ని ప్రచారాస్త్రంగా మలుచుకుంది. బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌తో కాంగ్రెస్‌ చీఫ్‌ రేవంత్‌రెడ్డి కుమ్మక్కయ్యారన్న ప్రచారాన్ని ముమ్మరం చేస్తోంది. అందుకే మొన్నీ మధ్య మంత్రి కేటీఆర్‌ కూడా దమ్ముంటే హుజూరాబాద్‌లో డిపాజిట్ తెచ్చుకో చూస్తా అంటూ సవాల్ విసిరారు.

పీసీసీ చీఫ్‌ హోదాలో రేవంత్‌రెడ్డి హుజూరాబాద్‌లో మకాం వేసి ఉంటే ఇలాంటి విమర్శలు వచ్చేవి కావంటూ కాంగ్రెస్‌లో చర్చ మొదలైంది. ఆహ్వానించి మరీ, అధికార పార్టీకి అస్త్రాలు తామే ఇస్తున్నామన్న భావనలో ఉన్నారు పార్టీ నేతలు. అయితే, తన పాత్ర నామ్‌కే వాస్తేగా మారడంతో కాంగ్రెస్‌ పార్టీ ఎవరికి సహకరిస్తుంది ఎవరి గెలుపును కోరుకుంటుంది ఎవరి ఓట్లను చీలుస్తుందన్న చర్చ రాజకీయవర్గాల్లో జోరుగా సాగుతోంది. కాంగ్రెస్ ఎలాగూ గెలవలేదు డిపాజిట్‌ దక్కితే మహా గొప్పగా చెప్పుకుంటున్న క్యాడర్‌. బరిలో నువ్వా-నేనా అన్నట్టుగా కొట్లాడుతున్న బీజేపీ, టీఆర్ఎస్‌లలో ఎవరిని ఓడించడానికి స్కెచ్‌ వేస్తారన్నదే విశ్లేషకుల అంచనాకు అందడం లేదట.

అంతకుముందలా లేని తెలంగాణ రాజకీయాలు మూడు పార్టీల్లో ఎవరి దమ్మెంతో తెలుసుకునే పనిలో పడ్డాయట. అధికారంలో ఉన్న టీఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయం తామంటే తామంటూ కాంగ్రెస్‌, బీజేపీలు ప్రచారం చేసుకుంటున్నాయి. కానీ ఒక్క హుజూరాబాద్‌లో నెలకొన్న త్రిముఖపోటీలో టీఆర్‌ఎస్‌, బీజేపీ మధ్యే గట్టి పోటీ ఉండబోతుందని కాంగ్రెస్‌లోని కొందరు ముఖ్యనేతలు ఆఫ్‌ ద రికార్డుగా మాట్లాడుకుంటున్నారు. కాంగ్రెస్ మాత్రం తప్పనిసరి పరిస్థితుల్లో పోటీ చేస్తున్నా గులాబీ, కమలం పార్టీల్లో ఎవరో ఒకరి విజయావకాశాలకు గండి కొట్టడం ఖాయమన్న సంకేతాలను ఇస్తోందట.

ఏమైనా, హుజూరాబాద్ ఉపఎన్నిక కాంగ్రెస్ పార్టీకి గండంలా వచ్చిందన్న చర్చ జరుగుతోంది. ఈ గండం ఎలా గట్టెక్కాలో తెలియక అల్లాడుతున్న హస్తం శ్రేణులు రాజకీయాన్ని రక్తి కట్టించే విధంగా పావులు కదుపుతున్నాయట. మరి, అక్కడి ఓటు బ్యాంక్‌పై కన్నేసిన కాంగ్రెస్‌ కారు పార్టీని పరుగులు పెట్టిస్తుందా బోల్తా కొట్టిస్తుందా చూడాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories