అంచనాలను తలకిందులు చేసిన స్వతంత్ర అభ్యర్ధులు

అంచనాలను తలకిందులు చేసిన స్వతంత్ర అభ్యర్ధులు
x
అంచనాలను తలకిందులు చేసిన స్వతంత్ర అభ్యర్ధులు
Highlights

తెలంగాణలో మున్సిపల్, కార్పోరేషన్ ఎన్నికల్లో టీఆర్ఎస్‌ తిరుగులేని విజయాన్ని సొంతం చేసుకుంది. 100 మున్సిపాలిటీల్లో విజయం సాధించగా ప్రతిపక్షాలు...

తెలంగాణలో మున్సిపల్, కార్పోరేషన్ ఎన్నికల్లో టీఆర్ఎస్‌ తిరుగులేని విజయాన్ని సొంతం చేసుకుంది. 100 మున్సిపాలిటీల్లో విజయం సాధించగా ప్రతిపక్షాలు కాంగ్రెస్,బీజేపీ టీఆర్ఎస్‌ దరిదాపుల్లో కూడా లేకుండా పోయాయి. మున్సిపల్ ఎన్నికల్లోనూ తిరుగులేని విజయం దిశగా దూసుకువెళ్లిన టీఆర్ఎస్‌కు అక్కడక్కడా షాక్‌లు తగిలాయి. రెబల్స్‌ తమ సత్తా చూపి. తమ ఉనికిని చాటుకున్నారు.

తెలంగాణ మున్సిపల్‌, కార్పోరేషన్‌ ఎన్నికల్లో ఇండిపెండెంట్లు తమ ఉనికిని చాటుకున్నారు. మున్సిపాలిటీల్లో మొత్తం 293 వార్డుల్లో స్వతంత్రులు విజయం సాధించారు. దాదాపుగా వీరంతా టీఆర్ఎస్‌ రెబల్స్‌ అని తెలుస్తోంది. కార్పోరేషన్‌ ఎన్నికల్లో కూడా ఇండిపెండెంట్లు తమ సత్తా చాటారు. 42 స్థానాలను దక్కించుకున్నారు.

సిరిసిల్లలో ఇండిపెండెంట్ అభ్యర్థులు అందరి అంచనాలను తలకిందులు చేశారు. టీఆర్ఎస్ రెబల్స్‌గా బరిలో దిగిన వారిలో 10మంది ఇండిపెండెంట్స్ విజయం సాధించారు. ఎన్నికల ముందు మంత్రి వీరికి ఎంతగా నచ్చజెప్పినప్పటికీ పోటీ నుంచి తప్పుకోలేదు. తాజా ఫలితాల్లో మొత్తం 39 వార్డులకు గాను టీఆర్ఎస్ 24, బీజేపీ 3,కాంగ్రెస్ 2, ఇండిపెండెంట్స్ 10 స్థానాల్లో విజయం సాధించారు.

కొల్లాపూర్‌లో TRS పార్టీకి చుక్కెదురైంది. కారు స్పీడు‌కు జూపల్లి బ్రేకులు వేశారు. జూపల్లి బలపరిచిన 16 మంది రెబల్స్ విజయం సాధించారు. ఇప్పటికే గెలిచిన అభ్యర్థులను క్యాంపునకు కూడా తరలించారు. ఉమ్మడి మహహూబ్ నగర్ జిల్లాలో 17 మున్సిపాలిటీలు ఉన్నాయి. 15 చోట్ల టీఆర్ఎస్ కైవసం చేసుకోగా కొల్లాపూర్, ఐజాలో మాత్రం పరిస్థితి తారుమారైంది. ఇక్కడ మాజీమంత్రి జూపల్లి కృష్ణారావు తన అనుచరులకు ఇండియన్ ఫార్వార్డ్ బ్లాక్ గుర్తుమీద పోటీ చేయించారు. సింహాం గుర్తుతో అభ్యర్థులు బరిలోకి దిగారు. కొల్లాపూర్‌లో జూపల్లి మేనల్లుడు నర్సింహారావు 400 ఓట్ల తేడాతో విజయం సాధించారు. జూపల్లి కృష్ణారావు ప్రోద్బలంతో కొల్లాపూర్‌లో 20 చోట్ల రెబల్స్ పోటీ చేశారు. వీరందరికీ జూపల్లి అండదండగా ఉన్నారు.

మొత్తం 20 మందిని రెబల్స్‌గా జూపల్లి బరిలోకి దింపారు. TRS పార్టీ తన అనుచరులకు పార్టీ టికెట్ కేటాయించకపోవడంతో ఇండియన్ ఫార్వార్డ్ బ్లాక్ నుంచి పోటీ చేయించారు. వారు గెలిచేందుకు శాయశక్తులు ఒడ్డారు. కొల్లాపూర్ మున్సిపాలిటీలో ఎమ్మెల్యే హర్షవర్థన్ రెడ్డి వర్గానికి టీఆర్ఎస్ సీట్లు కేటాయించడంతో వివాదం చెలరేగింది. దీంతో జూపల్లి తన వర్గానికి ఫార్వార్డ్ బ్లాక్ నుంచి టికెట్లు కేటాయించారు. మంత్రి కేటీఆర్ రంగంలోకి దిగిన జూపల్లి మాత్రం దారిలోకి రాలేదు. తన పంతం నెగ్గించుకున్నారు.

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో యాదగిరి గుట్టలోని కౌంటింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలను కొనేందుకు ప్రయత్నిస్తున్నారని ఆలేరు టీఆర్ఎస్ ఎమ్మెల్యే గొంగిడి సునీత, మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకున్నారు. ఇండిపెండెంట్ అభ్యర్థులు మా మద్దతుతో గెలిచారంటే మా మద్దతుతోనే గెలిచారని వాగ్వాదానికి దిగారు.

యాదగిరిగుట్ట మున్సిపాలిటీ పరిధిలో 12 కౌన్సిలర్ స్థానాలు ఉన్నాయి. ఇందులో టీఆర్ఎస్ 4,కాంగ్రెస్ 4,సీపీఐ 1, ఇండిపెండెంట్స్ 3 స్థానాలను గెలుచుకున్నారు. ఛైర్మన్ పదవికి మేజిక్ ఫిగర్ 7 కావడంతో ఇరు పార్టీలు ఇండిపెండెంట్లకు గాలం వేసేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఈ క్రమంలోనే గొంగడి సునీత, కోమటిరెడ్డి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.

ఇండిపెండెంట్లు కీలకంగా మారిన ప్రస్తుత తరుణంలో రాజకీయ పార్టీలు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నాయి. ఇండిపెండెంట్లకు వల వేసేందుకు ప్రయత్నాలు జరుగుతుండడంతో వారిని కాపాడుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రత్యేక క్యాంపులు ఏర్పాటు చేసి అక్కడికి తరలించారు. ఈ నెల 27న చైర్ పర్సన్, మేయర్ల ఎన్నిక జరగనుంది. ఆ రోజునే నేరుగా గెలిచిన తమ అభ్యర్థులను ఓటు వేసేందుకు తీసుకురానున్నారు.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories