హైదరాబాద్ ఓల్డ్‎సిటీలో రియల్ దంగల్.. రెజ్లింగ్‎లో రాణిస్తున్న 14 ఏళ్ల పూజ...

Real Dangal in Hyderabad Old City 14 Years Girl Excelling in Wrestling | Live News Today
x

హైదరాబాద్ ఓల్డ్‎సిటీలో రియల్ దంగల్.. రెజ్లింగ్‎లో రాణిస్తున్న 14 ఏళ్ల పూజ...

Highlights

Hyderabad - Old City: తండ్రి చంద్రకాంత్ వద్దే పూజ ట్రెయినింగ్...

Hyderabad - Old City: కూతురు పతకం సాధించాలని దంగల్ సినిమాలో తండ్రి ఎంత ఆరాటపడ్డాడో.. ఆ సినిమా చూసిన అందరికీ తెలుసు. కానీ నిజజీవితంలో కూడా అలాంటి తండ్రులు ఉంటారనేది hmtv అందిస్తున్న ఈ స్టోరీ చూస్తే తెలుస్తుంది. అది కూడా మగవాళ్లతో కుస్తీ పట్టడం ఏంటని ప్రశ్నించేవాళ్లు లేకపోలేదు. అలాంటివారికి ఆ చిన్నారి తండ్రి.. తన చిరునవ్వే సమాధానంగా చెబుతున్నాడు. మరి ఎవరా అమ్మాయి? ఏమా కథ?

ఆడపిల్లల్ని తక్కువ అంచనా వేయొద్దు. కుస్తీ మే సవాల్ అంటూ మగవాళ్లను సైతం ఢీకొంటున్నారు. హైదరాబాద్ లోని ఎర్రగడ్డ, శంకర్ లాల్ నగర్ బస్తీకి చెందిన పూజా నిత్లేకర్ రాష్ట్ర స్ధాయి కుస్తీ పోటిల్లో రెండుసార్లు గోల్డ్ మెడల్ సాధించింది. యూసుఫ్‎గూడాలోని ప్రభుత్వ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న 14 ఏళ్ళ పూజకు రెజ్లింగ్ అంటే చాలా ఇష్టం. ఆమె నాంపల్లిలోని రతన్‎సింగ్ ఉస్తాద్ వ్యాయామశాలలో తండ్రి చంద్రకాంత్ వద్దే శిక్షణ తీసుకుంటోంది. మగవారితో పోటిపడుతూ వారిని చిత్తుగా ఓడించే స్ధాయికి ఎదగడంతో సహచర రెజ్లర్స్ కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

పూజ తండ్రి చంద్రకాంత్ కుస్తీ కోచ్. ఎంతో మంది బస్తీవాసులకు ఆయన ఉచితంగా శిక్షణ ఇస్తున్నారు. తండ్రితోపాటు నాలుగేళ‌్ళ వయసు నుంచే వ్యాయామశాల వెళుతూంది. తాను కూడా రెజ్లింగ్ నేర్చుకుంటా అంటే.. ఆ తండ్రికి అంతకన్నా ఆనందం ఇంకేముంటుంది? వెంటనే సరే అన్నారు.. చంద్రకాంత్. పూజ కుస్తీ పోటిల్లో పాల్గొనడం చూసి బంధువులు, కాలనీవాసులు ఆడపిల్లకు కుస్తీ అవసరమా అని దీర్ఘాలు తీశారు. కానీ అవేవీ.. పూజను గానీ, చంద్రకాంత్ ను గానీ నిరుత్సాహపరచలేదు.

ఇక పూజ ఇప్పుడు నేషనల్స్‎కు సెలక్ట్ అయింది. కానీ ఆర్ధిక ఇబ్బందుల కారణంగా ప్రాక్టీసుకు అంతరాయం ఏర్పడుతోంది. తాను చదువుతున్న ప్రభుత్వ స్కూల్ ఉపాధ్యాయులే ముందుకు వచ్చి కొంత ఆర్థిక సాయం అందించడం విశేషం. ఈమధ్యనే రెజ్లింగ్ పోటీల అండర్-15 విభాగంలో పూజ గోల్డ్ మెడల్ సాధించి... అంచనాలు పెంచింది. ఈనెల 26 నుండి 29 వరకు రాంచీలో జరిగే జాతీయ కుస్తీ పోటిలకు ఎంపికైంది పూజ.

తెలంగాణలో ఎంతో మంది మట్టిలో మాణిక్యాలు ఉన్నారు. కొద్ది రోజుల క్రితం ప్రపంచ మహిళల బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో నిఖత్ జరీన్ విజేతగా నిలిచింది. సీనియర్ విభాగంలో వరల్డ్ చాంపియన్‌గా అవతరించి, ఈ ఘనత సాధించిన తొలి తెలుగు అమ్మాయిగా రికార్డు సృష్టించింది. అయితే సరైన శిక్షణ, ఆర్ధిక సహాయం అందకపోవడంతో ఎంతోమంది ఔత్సాహికులు ముందుకు రాలేకపోతున్నారంటున్నారు ఈ రంగంలో నిపుణులు. ప్రతిభగల అమ్మాయిలకు ప్రభుత్వ సహకారం లభిస్తే రాష్ట్ర ఖ్యాతి దశదిశలా వ్యాపిస్తుందంటున్నారు కోచ్.

సినిమాలో కథనాన్ని ఆస్వాదించినందుకు నిర్మాతలకు కోట్లాది రూపాయలు వరద పారింది. కానీ.. నిజజీవితంలో అసలైన దంగల్ కోసం తలపడుతున్న ఈ పూజ పర్ఫామెన్స్ అద్భుతంగా రాణించాలంటే తెలంగాణ సర్కార్ కరుణించాలంటున్నారు... క్రీడాభిమానులు.



Show Full Article
Print Article
Next Story
More Stories