Public Negligence: మాస్కులు ధరించడం లేదని ప్రశ్నిస్తే ‎వింత సమాధానాలు

Public Negligence Causing Surge in Corona Cases
x

Public Negligence: మాస్కులు ధరించడం లేదని ప్రశ్నిస్తే ‎వింత సమాధానాలు

Highlights

Public Negligence: కొవిడ్ నిబంధనల అమలులో నిర్లక్ష్యమే జనం కొంప ముంచుతోంది. జనసమ్మర్థం అధికంగా ఉన్న ప్రాంతాల్లోనే వైరస్ వ్యాప్తికి అవకాశం ఎక్కువ.

Public Negligence: కొవిడ్ నిబంధనల అమలులో నిర్లక్ష్యమే జనం కొంప ముంచుతోంది. జనసమ్మర్థం అధికంగా ఉన్న ప్రాంతాల్లోనే వైరస్ వ్యాప్తికి అవకాశం ఎక్కువ. అలాంటి ప్రాంతాల్లో కనీస నిబంధనలు పాటించకపోవడమే కేసుల పెరుగుదలకు కారణమవుతోంది. ముఖ్యంగా రైతుబజార్లు, వ్యాపార సముదాయాల వద్ద దుకాణ దారులు, వినియోగ దారులు కనీస జాగ్రత్తలు తీసుకోవడం లేదు. మాస్కులు ఎందుకు ధరించడం లేదని ప్రశ్నిస్తే జనమిచ్చే వింత సమాధానాలు కరోనా పట్ల నిర్లక్ష ధోరణికి అద్దం పడుతోంది.

రైతు బజార్లు, మాంసం, చేపల మార్కెట్లు, పండ్ల, కిరాణా దుకాణాలు నిత్యం వందలాది మందితో కిక్కిరిసిపోయే కూడళ్లివి. పల్లెల నుంచి రైతుబజార్లకొచ్చి కూరగాయలు అమ్ముతారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చే వ్యాపారులు, జనం దుకాణాలకు పోటెత్తుతారు. కరోనా కోరలు చాస్తున్న వేళ జనం అత్యంత అప్రమత్తంగా ఉండాల్సిన ప్రాంతాలివి. కానీ ఇక్కడ కొవిడ్ నిబంధనలు అమలు కావడం లేదు. ఎవరి ఇష్టానుసారం వాళ్లు వ్యవహరిస్తున్నారు.

కరోనా బారిన పడతామన్న భయం ప్రజల్లో కనిపించడం లేదు. మాస్కు ఎందుకు ధరించ లేదంటే వారు చెప్పే మాటలు అంతుబట్టడం లేదు. కొన్ని దుకాణాల్లో కనీసం శానిటైజర్ కూడా అందుబాటులో లేదు. స్థలాభావంతో భౌతికదూరం సైతం పాటించడం లేదు. దుకాణాలే పక్కపక్కన ఉండటంతో వినియోగదారులు కూడా భౌతిక దూరాన్ని పాటించలేని దుస్థితి.

కరోనా మహమ్మారి రాష్ట్రంలో పంజా విరుసుతున్నా ప్రజలు అలసత్వాన్ని మాత్రం వీడటంలేదు. కొన్ని ప్రదేశాల్లో గుంపులు గుంపులుగా తిరుగుతూ ఇంకా కరోనా ఉందా..! మాస్క్​ వేసుకోవాలా..? అనుకునే వారు కొందరైతే మాస్క్​ ముఖానికి తగిలిస్తే సరిపోతుంది ముక్కుకు వేసుకోవాలా ఏంటి అనేవారు ఇంకొందరు.

నిర్లక్ష్యం నిప్పై దహిస్తోంది. ఈ మాట కాస్త కష్టంగా ఉన్నా ప్రస్తుతం కరోనా పరిస్థితులకు సరిగ్గా సరిపోతోంది. ప్రజల్లో కరోనా నిబంధనల పట్ల అలసత్వం వైరస్ వ్యాప్తికి కారణం అవుతోంది. ప్రభుత్వాలు, వైద్యులు మాస్కుల వినియోగాన్ని వివరిస్తున్నా పట్టించుకునే వారే కరవయ్యారు. ఫైన్​లు విధిస్తున్నా నిబంధనలు పెడచెవిన పెడుతున్నారు. మాస్కులు లేని వినియోగదారులకు సేవల్ని అందించకుండా ఉండాల్సింది పోయే దుకాణ యజమానులే మాస్కులు ధరించడం లేదు.

కొందరి అలసత్వం కారణంగా అందరికీ కరోనా ప్రమాదం మళ్లీ ముంచుకొస్తోంది. ఇప్పటికే ఆస్పత్రుల్లో బెడ్స్‌, ఆక్సిజన్‌ కొరతతో బాధితులు అల్లాడుతున్నా ప్రజల్లో మార్పు రావడంలేదు. కొవిడ్‌ ఆట కట్టించేందుకు టీకా రక్షణ కవచాలు అభయ హస్తం ఇస్తున్నా స్వీయ జాగ్రత్తలు మాత్రమే శ్రీరామరక్షగా నిలుస్తాయన్నది ఇప్పటిదాకా ఉన్న అనుభవం.

Show Full Article
Print Article
Next Story
More Stories