ప్రణయ్ హత్య కేసులో కోర్టు తీర్పు... ఈ కేసులో అసలేం జరిగింది?


ప్రణయ్ హత్య కేసులో కోర్టు తీర్పు... ఈ కేసులో అసలేం జరిగింది?
ప్రణయ్ ను అమృత పెళ్లి చేసుకోవడం మారుతీరావుకు నచ్చలేదు. మిర్యాలగూడలో తన పరువు పోయిందని ఆయన రగిలిపోయారు.
దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన పెరుమాళ్ల ప్రణయ్ పరువు హత్య కేసులో నల్గొండ ఎస్సీ, ఎస్టీ కోర్టు మార్చి 10న సంచలన తీర్పు వెల్లడించింది. ఈ కేసులో ఏ2గా ఉన్న సుభాశ్ శర్మకు కోర్టు ఉరిశిక్ష విధించింది. అసలు ప్రణయ్ ను ఎందుకు హత్య చేశారు? ఎలాంటి క్లూ లేని కేసును ఎలా పోలీసులు చేధించారు? ప్రణయ్ కుటుంబ సభ్యులు కోర్టు తీర్పుపై ఏమంటున్నారు? కేసు దర్యాప్తు సమయంలో వచ్చిన ఆరోపణలను పోలీసులు ఎలా తీసుకున్నారు? టెక్నికల్ ఎవిడెన్స్ ఈ కేసులో పోలీసులకు ఎలా ఉపయోగపడ్డాయి? ప్రణయ్ హత్య కేసు నుంచి కోర్టు తీర్పు వరకు జరిగిన పరిణామాలను ఇవాళ్టి ట్రెండింగ్ స్టోరీలో తెలుసుకుందాం.
ప్రణయ్ హత్య కేసులో ఆరుగురికి జీవితఖైదు
ప్రణయ్ హత్య కేసులో ఆరుగురు దోషులకు నల్గొండ ఎస్సీ, ఎస్టీ కోర్టు జీవిత ఖైదు విధించింది. ఐపీసీ 302, 10, 109, 1989 సెక్షన్ ఇండియన్ ఆర్మ్ యాక్ట్ 1959 ప్రకారం శిక్ష విధించారు. ఐదేళ్ల 9 నెలలు విచారణ సాగింది. చార్జీషీట్ , పోస్టుమార్టం రిపోర్టు, ఎవిడెన్స్, సాక్షుల విచారణ తర్వాత ఈ తీర్పును వెల్లడించింది. ప్రణయ్ హత్య కేసులో ఏ 1 గా ఉన్న తిరునగరు మారుతీరావు ఆత్మహత్య చేసుకున్నారు. ఏ 3 అస్గర్ అలీ, ఏ4 అబ్దుల్ బారీ, ఏ 5గా ఎం.ఏ కరీం, ఏ6గా తిరునగర్ శ్రవణ్ కుమార్, ఏ 7 గా శివ, ఏ 8గా నిజాం పేర్లను పోలీసులు చేర్చారు. ఏ 2 సుభాశ్ శర్మ, అస్గర్ అలీ విచారణ ఖైదీలుగా ఉన్నారు. మిగిలినవారు బెయిల్ పై విడుదలయ్యారు.
అసలు ఏం జరిగింది?
అది 2018 సెప్టెంబర్ 14 మధ్యాహ్నం... మిర్యాలగూడలోని ప్రైవేట్ ఆసుపత్రి. ఆసుపత్రికి వచ్చిపోయే రోగులు, వారి కుటుంబ సభ్యులు. నిత్యం రద్దీగా ఉండే ప్రాంతం. ఆసుపత్రి నుంచి అమృత, ఆమె భర్త ప్రణయ్, ప్రణయ్ తల్లి బయటకు నడుచుకుంటూ వెళ్తున్నారు. వీరి వెనుకే ఓ వ్యక్తి వెళ్లి ప్రణయ్ పై కత్తితో దాడి చేశారు. వెంటనే ప్రణయ్ కుప్పకూలాడు. ఈ ఘటనతో అమృత, ఆమె అత్త హేమలత ఆసుపత్రిలోకి పరుగెత్తారు. వెంటనే చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న ప్రణయ్ ను కాపాడేందుకు వైద్యులు ప్రయత్నించారు. చికిత్స పొందుతూ ప్రణయ్ మరణించారు. అమృతను పెళ్లి చేసుకున్న ఎనిమిది నెలలకే ప్రణయ్ హత్యకు గురయ్యారు. ఈ హత్య అప్పట్లో దేశ వ్యాప్తంగా కలకలం రేపింది. కులాంతర వివాహం చేసుకున్నందుకు ప్రణయ్ హత్య జరిగిందని పోలీసులు తమ దర్యాప్తులో గుర్తించారు.
ఆర్య సమాజ్ లో అమృత, ప్రణయ్ పెళ్లి
అమృత, ప్రణయ్‌ది మిర్యాలగూడ. వీరిద్దరిది ఒకే స్కూల్ . చిన్నప్పటి నుంచే వీరిద్దరి మధ్య ఉన్న పరిచయం ప్రేమగా మారింది. వీరిద్దరివి వేర్వేరు కులాలు. అదే వీరి ప్రేమకు ఇబ్బందిగా మారింది.ఈ ప్రేమ విషయం అమృత తండ్రి తిరునగరు మారుతీరావుకు తెలిసింది. ప్రణయ్ ను మందలించారు. అయినా కూడా వీరిద్దరూ తగ్గలేదు. హైదరాబాద్ ఆర్యసమాజ్ లో 2018 జనవరి 31న వీళ్లిద్దరూ పెళ్లి చేసుకున్నారు. పెళ్లి చేసుకున్న తర్వాత మిర్యాలగూడకు వస్తే ప్రమాదమని భావించారు. వరంగల్ లోని ప్రణయ్ బంధువుల ఇంట్లో ఉన్నారు. ఆరు నెలల తర్వాత ప్రణయ్, అమృత మిర్యాలగూడకు వచ్చారు. తమకు రక్షణ కల్పించాలని పోలీసులను కోరారు. ప్రణయ్ ఇంటి చుట్టూ సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేయించారు.
ప్రణయ్ హత్యకు మారుతీరావు ప్లాన్
ప్రణయ్ ను అమృత పెళ్లి చేసుకోవడం మారుతీరావుకు నచ్చలేదు. మిర్యాలగూడలో తన పరువు పోయిందని ఆయన రగిలిపోయారు. ప్రణయ్ ను అంతమొందించాలని ప్లాన్ చేశారని పోలీసులు దర్యాప్తులో గుర్తించారు. అయితే ఈ విషయంలో తన చేతులకు మట్టి అంటకూడదని ఆయన భావించారు. సుఫారీ గ్యాంగ్ తో ఈ హత్య చేయించాలని భావించారు. ఇందుకోసం ఆయన వేట సాగించారు. 2011లో ఓ భూవివాదంలో పరిచయమైన కరీంను ఈ విషయమై మారుతీరావు సాయం అడిగారు. గుజరాత్ మాజీ హోంమంత్రి హరేన్ పాండ్యా హత్య కేసులో కీలక పాత్రధారి అస్గర్ అలీ, బారీ అనే ఇద్దరితో కరీం ఈ విషయం చెప్పారు. ఇందుకు వారిద్దరూ ఒకే చెప్పారు. రెండున్నరకోట్లు ఇవ్వాలని అస్గర్ డిమాండ్ చేశారు. చివరకు కోటి రూపాయాలకు డీల్ కుదిరింది. అడ్వాన్స్ గా 50 లక్షలు డిమాండ్ చేస్తే 15 లక్షలను మారుతీరావు ఇచ్చారని అప్పట్లోనే పోలీసులు ప్రకటించారు.
కిడ్నాప్ ప్లాన్ ఫెయిల్
ప్రణయ్ ను హత్య చేయాలని మారుతీరావుతో కుదుర్చుకున్న డీల్ మేరకు అస్గర్ టీమ్ 2018 ఆగస్టు నుంచి ప్లాన్ చేసింది. ఆగస్టు 17న ప్రణయ్, అమృత రిసెఫ్షన్ లోనే అంతమొందించాలని ప్లాన్ చేశారు. కానీ, పోలీస్ బందోబస్తు ఉండడంతో వెనక్కు తగ్గారు. అమృతను ప్రణయ్ మిర్యాలగూడలో బ్యూటీ పార్లర్ కు తీసుకెళ్లారు. అదే అదనుగా ప్రణయ్ ను హత్య చేయాలని దుండగులు ప్లాన్ చేశారు. కానీ, ప్రణయ్ తో పాటు అతని సోదరుడు కూడా అక్కడికి వచ్చారు. అయితే ప్రణయ్ ను గుర్తించలేకపోవడంతో ఈ ప్లాన్ ఫెయిలైంది. సెప్టెంబర్ లో అమృత, ప్రణయ్ ను కిడ్నాప్ చేసి చంపాలనుకున్నారు. ఆ సమయంలో మరో గ్యాంగ్ ను అస్గర్ టీమ్ రంగంలోకి దింపింది. కానీ, ఆ టీమ్ మద్యం మత్తులో ఉండడంతో అది కూడా ఫెయిలైంది. ఇక చివరికి బీహార్ కు చెందిన సుభాష్ శర్మను అస్గర్ టీమ్ రంగంలోకి దింపింది.
సీసీటీవీ పుటేజీతో మొదలైన ఆధారాలు
ప్రణయ్ హత్య చేసిన సమయంలో పోలీసులకు ఒక్క ఆధారం కూడా లేదు. ఆసుపత్రి ఆవరణలోని సీసీటీవీ పుటేజీలో ప్రణయ్ హత్యకు సంబంధించిన దృశ్యాలు రికార్డయ్యాయి. మిర్యాలగూడ టౌన్ లోని సీసీటీవీ పుటేజీన పోలీసులు జల్లెడ పట్టారు.అప్పుడు పోలీసులకు ఒక క్లూ లభ్యమైంది.
సుభాశ్ శర్మ నాగార్జునసాగర్ రూట్ లో స్కూటీపై మరొకరితో కలిసి వెళ్లారు. సుభాశ్ శర్మను తీసుకెళ్లింది అస్గర్ అలీగా పోలీసులు గుర్తించారు. హత్య తర్వాత నిందితుడిని అస్గర్ అలీ స్కూటీపై సాగర్ నుంచి నల్గొండకు తరలించారు. అక్కడి నుంచి బెంగుళూరుకు వెళ్లారు. బెంగుళూరు నుంచి బీహార్ లో రైలు దిగే సమయానికి పోలీసులు సుభాశ్ శర్మను అరెస్ట్ చేశారు. అస్గర్ అలీ, బారీని మహారాష్ట్ర, యూపీలలో పోలీసులు అరెస్ట్ చేశారు.పోలీసుల విచారణలో మారుతీరావు ప్రణయ్ హత్య కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడించారు. మారుతీరావు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు ఎవిడెన్స్ సేకరించారు.
1600 పేజీల్లో చార్జీషీట్
ప్రణయ్ హత్య కేసుకు సంబంధించి న్యాయపరమైన చిక్కులు కలగకుండా ఉండేందుకు పోలీసులు జాగ్రత్తలు తీసుకున్నారు.10 సార్లు చార్జీషీట్ లో మార్పులు చేసిన తర్వాత కోర్టుకు సమర్పించారు. 1600 పేజీలతో కేసుకు సంబంధించిన అంశాలను పోలీసులు చార్జీషీట్ లో వివరించారు. శాస్త్రీయ ఆధారాలను కూడా కోర్టుకు అందించారు. ఒకవేళ సాక్షులు భయపడినా, ప్రలోభపడినా బలమైన ఆధారాలు ఉంటే దోషులకు శిక్ష పడే అవకాశం ఉందని పోలీసులు భావించారు. సుభాశ్ శర్మ నడక ఎలా ఉంటుందనే విషయమై కూడా పోలీసులు ల్యాబ్ ద్వారా విశ్లేషించి ఆధారాలను సమర్పించారు. ఇలాంటి అనేక ఆధారాలను పోలీసులు కోర్టుకు అందించారు. ఈ ఆధారాలే దోషులకు శిక్షపడేలా చేశాయి.
ఆత్మహత్య చేసుకున్న మారుతీరావు
ప్రణయ్ హత్య కేసులో ఏ1 గా మారుతీరావు బెయిల్ పై విడుదలయ్యారు. జైలు నుంచి వచ్చిన తర్వాత కూతురు అమృతతో రాజీ కోసం ప్రయత్నించారు. ఈ కేసులో రాజీపడితే ఆస్తి ఇస్తానని మధ్యవర్తుల ద్వారా రాయబారం పంపారు. కానీ, ఆమె ఒప్పుకోలేదు. కేసు విషయమై తనపై తండ్రి నుంచి వస్తున్న ఇబ్బందులతో అమృత పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో మరోసారి పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు. మళ్లీ బెయిల్ పై వచ్చారు. ఈ కేసు విషయమై లాయర్ తో మాట్లాడేందుకు హైదరాబాద్ కు వచ్చిన ఆయన 2020 మార్చి 7న ఆత్మహత్య చేసుకున్నారు. అమ్మ వద్దకు వెళ్లు అమృత.. గిరిజా నన్ను క్షమించు అంటూ ఆయన లేఖ రాశారు.
ప్రణయ్ పేరేంట్స్ ఏమన్నారంటే?
ప్రణయ్ హత్యతోనే పరువు హత్యలు ఆగిపోవాలని ప్రణయ్ తండ్రి బాలస్వామి అన్నారు. ఈ కేసుకు సంబంధించి ఏ 2కు ఉరిశిక్ష, మిగిలిన ఆరుగురికి జీవిత ఖైదు విధించడంపై ఆయన స్పందించారు. శిక్ష పడిన కుటుంబాలకు కూడా బాధ ఉంటుందన్నారు. ప్రణయ్ ను కోల్పోయి తాము అనుభవిస్తున్న బాధ ఎవరికీ రావద్దని కోరుకుంటున్నట్టు ఆయన చెప్పారు.
తమ పిల్లలపై పెంచుకున్న ప్రేమ ఇతరుల పిల్లలకు శాపంగా మారొద్దు. అమృతపై మారుతీరావు పెంచుకున్న ప్రేమ ప్రణయ్ కు శాపంగా మారింది. పరువు కోసమో, కులం కోసమో నేరాలు చేసినా, ప్రోత్సహించినా చట్టం నుంచి తప్పించుకోలేరు. ప్రణయ్ తండ్రి బాలస్వామి కోరుకున్నట్టు ఇలాంటి ఘటన ఇదే చివరిది కావాలని కోరుకుందాం.

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire



