జీహెచ్ఎంసీలో మందకొడిగా పోలింగ్.. ఓటుహక్కు వినియోగించుకోవాలని చైతన్య పరుస్తోన్న ప్రముఖులు

జీహెచ్ఎంసీలో మందకొడిగా పోలింగ్.. ఓటుహక్కు వినియోగించుకోవాలని చైతన్య పరుస్తోన్న ప్రముఖులు
x
Highlights

గ్రేటర్ హైదరాబాద్‌లో పోలింగ్ మందకొడిగా సాగుతోంది. ఉదయం 9 గంటల వరకు కేవలం 3.1శాతం పోలింగ్ మాత్రమే నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. అయితే ఉదయం కాస్త...

గ్రేటర్ హైదరాబాద్‌లో పోలింగ్ మందకొడిగా సాగుతోంది. ఉదయం 9 గంటల వరకు కేవలం 3.1శాతం పోలింగ్ మాత్రమే నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. అయితే ఉదయం కాస్త మందకొడిగా సాగినా.. ఓటేసేందుకు హైదరబాదీలు పోలింగ్ బూత్‌లకు తరలివస్తున్నారు. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుండటంతో పోలింగ్‌ శాతం పెరిగే అవకాశాలున్నాయి.

డివిజన్ల వారీగా చూస్తే కూకట్‌పల్లి డివిజన్‌లో ఉదయం 9 గంటల వరకు 3.3 శాతం పోలింగ్ నమోదైంది. చందానగర్‌ లో 4.4 శాతం నమోదవగా.. పటాన్‌చెరు డివిజన్‌లో 7.72 శాతం పోలింగ్ జరిగింది. ఇక భారతినగర్‌లో 8.97, ఆర్సీపురంలో 10.26, ఎల్బీనగర్‌ లో 4.93, సరూర్‌నగర్‌ లో 2.7, ముషీరాబాద్‌ లో 6 శాతం పోలింగ్ నమోదైంది.

అయితే కొద్ది చోట్ల పోలింగ్ ఆలస్యంగా ప్రారంభమైంది. దీంతో ఓటర్లు పోలింగ్ కేంద్రాల దగ్గర వేచి చూడాల్సి వచ్చింది. ఇక పాతబస్తీలో స్లిప్పులు ఇవ్వకపోవటంతో అసంతృప్తి వ్యక్తం చేశారు ఓటర్లు. ఆధార్ కార్డ్ ద్వారా కూడా పోలింగ్‌కు అనుమతి ఇవ్వకపోవటంతో ఓటు వేయకుండా బూత్‌ల నుంచి వెనుదిరిగారు. ఇక కొన్ని పోలింగ్ కేంద్రాల దగ్గర ఘర్షణలు చోటుచేసుకున్నాయి. ఎల్బీనగర్ పరిధిలోని ఆర్కేపురం డివిజన్ లో టీఆర్ఎస్‌, బీజేపీ కార్యకర్తల మధ్య వాగ్వాదం జరిగింది.

ఆర్కేపురం డివిజన్‌లో టీఆర్ఎస్‌కు చెందిన ఓ నేత ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తోందని ఆరోపించారు బీజేపీ కార్యకర్తలు. పోలింగ్ బూత్ దగ్గరకు రానివ్వకుండా అడ్డుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అయితే అక్కడే ఉన్న పోలీసులు సర్దిచెప్పడంతో వివాదం సర్దుమణిగింది. అటు హఫీజ్‌పేటలో ఫ్లెక్సీ వివాదం రాజుకుంది. అధికార పార్టీ కార్యకర్తలు అభ్యర్థి ఫ్లెక్సీ ఏర్పాటు చేయటంతో బీజేపీ కార్యకర్తలు గొడవకు దిగారు.

ఇక సంగారెడ్డి జిల్లా పరిధిలోని భారతీనగర్ డివిజన్‌లో కూడా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఎల్ఐజీ కాలనీలోని పోలింగ్ బూత్ దగ్గర పోలింగ్ స్లిప్పుల్లో టీఆర్ఎస్‌ అభ్యర్థి సింధు ఆదర్శ్ రెడ్డి ఫోటో ఉండటంతో బీజేపీ అభ్యర్థి అభ్యంతరం తెలిపారు. దీంతో అక్కడ రెండు వర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. అటు పటాన్ చెరు డివిజన్ చైతన్య నగర్ లో బీజేపీ,టీఆర్ఎస్ కార్యకర్తలు బాహాబాహీకి దిగారు. దీంతో పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టారు.

ఇక పోలింగ్ ప్రారంభం కాగానే ప్రముఖులు పోలింగ్ బూత్‌లకు చేరుకున్నారు. తమ ఓటు హక్కు వినియోగించుకుని ఓటేయాలంటూ ప్రజలను చైతన్య పరుస్తున్నారు. బంజారాహిల్స్‌లోని నందినగర్‌ పోలింగ్‌ కేంద్రంలో మంత్రి కేటీఆర్‌ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ప్రతీ ఒక్కరు తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు.

కాచిగూడ పోలింగ్‌ కేంద్రానికి తన కుటుంబసభ్యులతో కలిసి వెళ్లిన కేంద్ర సహాయ మంత్రి కిషన్‌ రెడ్డి ఓటు హక్కు వినియోంచుకున్నారు. జూబ్లీహిల్స్‌ క్లబ్‌లోని పోలింగ్‌ కేంద్రంలో హీరో చిరంజీవి, నిర్మాత సురేష్‌ ఓటేశారు. ఎఫ్‌ఎన్‌సీసీలో నిర్మాత శ్యామ్‌ ప్రసాద్‌ రెడ్డి ఓటు హక్కు వినియోగించుకున్నారు. జూబ్లిహిల్స్‌లో హీరో నాగార్జున ఓటేశారు. ఇక తార్నాకలో టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం సతీమణితో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్నారు. జూబ్లీహిల్స్ ఇంటర్నేషనల్ సెంటర్ లో స్వామి పరిపూర్ణానంద ఓటేశారు.

కుందన్ బాగ్ చిన్మయ స్కూల్ పోలింగ్ కేంద్రంలో డీజీపీ మహేందర్ రెడ్డి ఓటు హక్కు వినియోగించుకున్నారు. నగరంలో ఓటింగ్ ప్రశాంతంగా జరుగుతుందన్నారు. ప్రజలందరూ ధైర్యంగా తమ ఓటు హక్కు నియోగించుకోవాలన్నారు డీజీపీ. నాంపల్లిలో సైబరాబాద్‌ సీపీ సజ్జనార్‌ ఓటు వేయగా.. కుందన్‌బాగ్‌లో రాచకొండ సీపీ మహేష్‌ భగవత్‌, అంబర్ పేట్‌లో హైదరాబాద్‌ సీపీ అంజనీకుమార్ ఓటు హక్కు వినియోగించుకున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories