రేవంత్‌ టార్గెట్‌గా కాంగ్రెస్‌లో సీనియర్ల తిరుగుబాటు.. మీ వెంటే నేను ఉంటానని..

Political War In Telangana Congress
x

రేవంత్‌ టార్గెట్‌గా కాంగ్రెస్‌లో సీనియర్ల తిరుగుబాటు.. మీ వెంటే నేను ఉంటానని..

Highlights

Congress: తెలంగాణ కాంగ్రెస్‎లో అసమ్మతి భగ్గుమంది.

Congress: తెలంగాణ కాంగ్రెస్‎లో అసమ్మతి భగ్గుమంది. రెండురోజుల క్రితం దామోదర రాజనర్సింహ ఏకంగా ప్రెస్ మీట్‎పెట్టి మరీ కాంగ్రెస్‎లో జరుగుతున్న పరిణామాలపై ఫైరయ్యారు. అంతకుముందే భట్టి విక్రమార్క నివాసంలో సీనియర్లు సమావేశమై కమిటీల కూర్పుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తాజాగా మరోసారి భట్టి నివాసంలో భేటీ అయిన నేతలు కోవర్టు ఆరోపణలను సీరియస్‎గా తీసుకున్నారు. పార్టీ కోసం తీవ్రంగా శ్రమిస్తున్నప్పటికీ కోవర్టుల ముద్రవేసి సోషల్ మీడియాలో దుశ్ప్రచారం చేయిస్తున్నారని సీనియర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. భట్టి విక్రమార్క నివాసంలో సమావేశానికి టీపీసీసీ మాజీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, మధుయాష్కి గౌడ్ , జగ్గారెడ్డి, మహేశ్వర్ రెడ్డి, కిసాన్ సెల్ నేత కోదండరెడ్డి, దామోదర రాజనర్సింహ, ప్రేమ్ సాగర్ రావు, ఏలేటి మహేశ్వర్ తదితరులు హాజరయ్యారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి లాంటి నేతలు కూడా భట్టి నివాసంలోని భేటీకి రావడమే కాకుండా ఏకంగా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేయడం కాంగ్రెస్ పార్టీలో కలకలం రేపింది.

వలస నేతలు కాంగ్రెస్‎ను కబ్జా చేస్తున్నారని టీకాంగ్రెస్ సీనియర్లు భగ్గుమన్నారు. ఇటీవల ప్రకటించిన పీసీసీ కమిటీలపై తీవ్ర అసంతృప్తి వెలిబుచ్చారు. భట్టి విక్రమార్క నేతృత్వంలో ఢిల్లీకి వెళ్లాలని నిర్ణయించారు. ఈ మేరకు ఏఐసీసీ నేతలను కలిసి ఫిర్యాదు చేయాలని డిసైడ్ అయ్యారు. తెలంగాణలో కాంగ్రెస్ పరిస్థితి, ప్రస్తుత రాజకీయాలపై అధిష్టానంతో చర్చిస్తామన్నారు. కొత్తగా వచ్చిన వాళ్లకు కమిటీల్లో ప్రాధాన్యం కల్పించి కష్టకాలంలో పార్టీతో ఉన్న వాళ్లను విస్మరించారని సీనియర్లు మండిపడ్డారు. పార్టీలో ఏకపక్ష ధోరణిపైనా ఈ భేటీలో చర్చ జరిగింది. బ్రేక్ ఫాస్ట్ పేరుతో సమావేశమైన నేతలు.. పీసీసీ పీఠాన్ని ఢీకొట్టేందుకు సిద్ధమని సంకేతాలిచ్చారు..

కాంగ్రెస్ పార్టీలో దశాబ్దాలుగా సేవ చేస్తున్న నాయకులు, కార్యకర్తలకు కమిటీలో కొంత ఇబ్బంది ఏర్పడిందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా చాలా మంది నేతలు వచ్చి తనను కలుస్తున్నారని తెలిపారు. అసలు కాంగ్రెస్ నాయకులకు, వలస వాదులకు మధ్య వ్యత్యాసంపైనా తన దృష్టికి తెస్తున్నారని భట్టి వెల్లడించారు. వీటన్నింటినీ కేంద్ర నాయకత్వం దృష్టికి తీసుకెళ్తామన్నారు. సీఎల్పీగా తమకెందుకు న్యాయం చేయలేదని సీనియర్ నేతలు తనను అడుగుతున్నారని చెప్పుకొచ్చారు భట్టి. తాను కొత్త కమిటీ ప్రక్రియలో పాల్పంచుకోలేదని.. అందుకే న్యాయం చేయలేకపోయానని వివరణ ఇచ్చానన్నారు. దేశంలో జరుగుతున్న విభజన రాజకీయాల దృష్ట్యా సేవ్ కాంగ్రెస్ నినాధానంతో ముందుకు వెళ్తామన్న టీకాంగ్రెస్ నేతలు.

ఒరిజినల్ కాంగ్రెస్ నేతలుగా కలిసి చర్చించామని టీపీసీసీ మాజీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. కాంగ్రెస్‎లో ఇంటర్నల్ డెమోక్రసీ ఎక్కువని.. తాను పీసీసీగా ఉన్నప్పుడు నా వాళ్లే ఉండాలి.. పార్టీని దక్కించుకోవాలని ఆలోచన చేయలేదున్నారు. 33 డీసీసీ అధ్యక్షుల్లో మార్పులు చేస్తే కొంతమందిని అవమాన పరిచినట్టేనని.. గెలిచే చోటే ఏకాభిప్రాయం జరగలేదంటే.. ఓడిపోయే చోటే ఏకాభిప్రాయం జరిగిందా.. అని ప్రశ్నించారు ఉత్తమ్. కావాలనే డీసీసీ ప్రెసిడెంట్ల విషయంలో ఇలా చేశారని... ఉపాధ్యక్షుల్లో ఇంత మంది బయట పార్టీ వారు ఉండడం ఏంటని నిలదీశారు. 180 మందిలో 54 మంది టీడీపీ నుంచి వచ్చినవాళ్లేనని ఇది కాంగ్రెస్‎కు మంచిది కాదన్నారు ఉత్తమ్. భట్టి విక్రమార్క, దామోదర రాజనర్సింహ, జగ్గారెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డిపై పోస్టింగ్ పెట్టించారని ఫైరయ్యారు. తాము కాంగ్రెస్‎ని నాశనం చేస్తే.. నాలుగు పార్టీలు మారిన ఆయన ఉద్దరిస్తారా...? అని ఇండరైక్ట్‎గా రేవంత్‎పై ఫైరయ్యారు ఉత్తమ్. తీన్మార్ మల్లన్న ఏ పార్టీ.. ఆయనకు డబ్బులు ఇచ్చి ఈ పోస్టింగ్‎లు ఎవరు పెట్టించారని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీలో మేము ఒరిజినల్ కాంగ్రెస్ నేతలుగా అదిష్టానం వద్ద మేము పోరాటం చేస్తాం.

ఇన్నేళ్లుగా ఎప్పుడూ లేనిది ఇప్పుడు ఒరిజినల్ కాంగ్రెస్ నేతలకు అన్యాయం జరుగుతోందన్నారు దామోదర రాజనర్సింహ. వారందరినీ కాపాడుకోవాల్సిన బాధ్యత తమపై ఉందన్నారు. కమిటీల్లో కొత్తగా పార్టీలోకి వచ్చిన వారికి..నిన్నమొన్న పార్టీలోకి వచ్చిన వారికి అవకాశం ఇచ్చారని కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారని ఫైరయ్యారు దామోదర. జరుగుతున్న పరిణామాలను హైకమాండ్ దృష్టికి తీసుకెళ్తామన్నారాయన. నాలుగు పార్టీలు తిరిగిన చరిత్ర తమది కాదని.. కాంగ్రెస్‎లోనే పుట్టామని.. కాంగ్రెస్‎లోనే చస్తామన్నారు దామోదర రాజనర్సింహ.

కాంగ్రెస్ పార్టీలో వలస వచ్చిన వారితోనే పంచాయతీ అని ప్రచార కమిటీ ఛైర్మన్ మధుయాష్కి గౌడ్ స్పష్టం చేశారు. కుట్ర పూరితంగా అన్యాయం జరుగుతోందన్నారు. సీఎల్పీ నేతకు పార్టీలో సమానంగా భాగస్వామ్యం ఉంటుందని.. సీఎల్పీని ఎలా విస్మరిస్తారని మండిపడ్డారు. సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్న వారికి ఖబడ్దార్.. అని జూబ్లీహిల్స్‎లో పీజేఆర్ కుమారుడు రెండుసార్లు ఎమ్మెల్యే అని.. ఆయనకు ఎలాంటి అవకాశం ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక్కడున్న నేతలను కాదని అభ్యర్థులను నిలబెట్టగలరా.. అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీని రక్షించుకోకపోతే తెలంగాణలో అధికారానికి కాంగ్రెస్ దూరమవుతుందన్నారు మధుయాష్కి గౌడ్.

కోవర్టులు అనే ముద్ర వేస్తున్నారని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయలేని పరిస్థితుల్లో.. జిల్లా నేతలతో చర్చించి సీఎం జిల్లాలో అభ్యర్థిని పెట్టి ఓట్లు అధికంగా తెచ్చుకున్నామని.. అలాంటి వాళ్లను కోవర్టులు అంటారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు జగ్గారెడ్డి. తాము కాంగ్రెస్ ఉనికి కాపడామా..? చెడగొట్టామా..? అని నిలదీశారు. కోవర్టుల ఆరోపణలపై వలస నాయకులు, ఏఐసీసీ ఎందుకు ఖండించడం లేదన్నారు. రాహుల్ గాంధీ జోడోయాత్ర కష్టపడి సక్సెస్ చేస్తే కోవర్టులు అని ముద్ర వేస్తున్నారుని.. డీసీసీకి నిర్మల పేరు రికమండ్ చేసినా ఎందుకు అపారో తెలియదని ఫైరయ్యారు జగ్గారెడ్డి. మరోవైపు కాంగ్రెస్‎లో పరిణామాలపై కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్పందించారు. సీనియర్ల వాదనకు మద్దతు ప్రకటించారు. భట్టికి ఫోన్ చేసిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తన అభిప్రాయాన్ని చెప్పారు. ఎలాంటి నిర్ణయం తీసుకున్న తాను కూడా సీనియర్ల వెంటే ఉంటానని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories