Ramoji Rao: రామోజీరావు మృతిపై రాజకీయ, సినీ ప్రముఖుల సంతాపం

Ramoji Rao: రామోజీరావు మృతిపట్ల రాజకీయ, సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు.

Arun Chilukuri
Updated on: 8 Jun 2024 2:59 PM IST
Political and Film Celebrities Mourn Ramoji Raos Death
X

Ramoji Rao: రామోజీరావు మృతిపై రాజకీయ, సినీ ప్రముఖుల సంతాపం

Ramoji Rao: రామోజీరావు మృతిపట్ల రాజకీయ, సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు. ప్రధాని మోదీ, చంద్రబాబు, సీఎం రేవంత్, వెంకయ్యనాయుడు, కిషన్ రెడ్డి, మాజీ సీఎం కేసీఆర్, పవన్ కళ్యాణ్, జూనియర్ ఎన్టీఆర్, సంతాపం తెలిపారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న రామోజీరావు ఇవాళ ఉదయం ఆస్పత్రిలో కన్నుమూసిన సంగతి తెలిసిందే.

రామోజీ రావు కుటుంబానికి ప్రధాని తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ మేరకు ఆయన ఎక్స్‌ (ట్విటర్‌)లో పోస్ట్‌ చేశారు. రామోజీరావు మీడియాను విప్లవాత్మకంగా మార్చిన దార్శనికుడు. పాత్రికేయ, సినీ రంగంపై చెరగని ముద్రవేశారు. మీడియాలో సరికొత్త ప్రమాణాలు నెలకొల్పారు. ఆయన ఎప్పుడూ దేశాభివృద్ధి కోసమే ఆలోచించేవారు అని మోదీ తన పోస్టులో పేర్కొన్నారు.

మీడియా దిగ్గజం రామోజీరావుకు మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు సంతాపం తెలిపారు ‘రామోజీ రావు వ్యక్తి కాదు, శక్తివంతమైన వ్యవస్థ. వ్యక్తిగా మొదలై వ్యవస్థగా ఎదిగిన వారి జీవితం నుంచి యువతరం నేర్చుకోవాల్సిన పాఠాలు ఎన్నో ఉన్నాయి. తెలుగు వారందరికీ రామోజీరావు గర్వకారణం’ అని వెంకయ్య నాయుడు Xలో పోస్ట్ చేశారు.

రామోజీ మరణం తనను తీవ్ర ఆవేదనకు గురిచేసిందన్నారు చంద్రబాబు. తిరిగి కోలుకుంటారని అనుకున్నా కానీ..ఇంతలోనే ఇలాంటి వార్త వినాల్సి వస్తుందనుకోలేదన్నారు. రామోజీ మరణం రాష్ట్రానికే కాదు దేశానికి తీరని లోటన్నారు.

రామోజీరావు మృతి పట్ల సీఎం రేవంత్‌రెడ్డి సంతాపం తెలిపారు. రామోజీరావు అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఏర్పాట్లు పర్యవేక్షించాల్సిందిగా రంగారెడ్డి కలెక్టర్, సైబరాబాద్ కమిషనర్ కు సీఎస్ ద్వారా ఆదేశాలు జారీ చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.

రామోజీ రావు మృతిపట్ల బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ సంతాపం తెలిపారు. పలు రంగాల్లో వ్యాపారవేత్తగా, మీడియా సంస్థల వ్యవస్థాపకుడిగా ఆయన అందించిన సేవలను స్మరించుకున్నారు. శోకతప్తులైన రామోజీ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

ఎవ్వరికీ తలవంచని మేరు పర్వతం దివి కేగింది..ఓం శాంతి అని చిరంజీవి ట్వీట్ చేశారు.

రామోజీరావు మృతికి తీవ్ర విచారాన్ని వ్యక్తం చేశారు సీనీనటుడు జూనియర్ ఎన్టీయార్. రామోజీరావు వంటి దార్శనీకులు నూటికో కోటికో ఒకరు ఉంటారన్నారు. తనను నిను చూడాలని సినిమాతో చిత్ర పరిశ్రమకు రామోజీరావు పరిచయం చేశారని జూనియర్ ఎన్టీఆర్ అన్నారు. ఆమహనీయుడికి ఆత్మశాంతి చేకూరాలని కోరుకుంటున్నానని జూనియర్ ఎన్టీఆర్ అన్నారు. రామోజీరావు కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు.

అక్షరయోధుడు రామోజీరావు తుదిశ్వాస విడిచారని తెలిసి తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యాను. ఆయన ఆత్మకు శాంతి కలగాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నా. ఆయన స్థాపించిన ఈనాడు పత్రిక భారతీయ పత్రికా రంగంలో పెను సంచలనమే. అక్షరానికి సామాజిక బాధ్యత ఉందని నిరూపించారు. రామోజీ ఫిల్మ్ సిటీ నిర్మాణంతో భారతీయ చిత్ర పరిశ్రమకు హైదరాబాద్ను వేదికగా చేశారు. ఆయన కుటుంబానికి నా తరఫున, జనసేన తరపున ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను అని అన్నారు పవన్.

దూరదృష్టి గల వ్యక్తి: మల్లికార్జున ఖర్గే

రామోజీరావు మరణం పట్ల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే విచారం వ్యక్తం చేశారు. మీడియా, సినిమా రంగంలో అనేక మార్పులకు రామోజీరావు నాందిపలికిన వ్యక్తి రామోజీరావు అని ఆయన కొనియాడారు. పాత్రికేయ రంగానికి రామోజీరావు విశేషకృషి చేసిన విషయాన్ని ఖర్గే గుర్తు చేశారు.

తెలుగు భాషకు విశేష సేవలు : దత్తాత్రేయ

రామోజీరావు మృతి పట్ల హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ సంతాపం తెలిపారు. పాత్రికేయ రంగంలో రామోజీరావు చెరగని ముద్ర వేశారన్నారు. పత్రికా రంగంలో నూతన ఒరవడి సృష్టించారని దత్తాత్రేయ గుర్తు చేశారు. తెలుగు భాషకు ఆయన చేసిన సేవలు మరువలేనివిగా దత్తాత్రేయ చెప్పారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story