Top
logo

తీరు మారని జనం.. మాస్క్ వదిలిన వైనం

తీరు మారని జనం.. మాస్క్ వదిలిన వైనం
X
Highlights

ప్రపంచమంతా కరోనా కోరల్లో చిక్కుకొని విలవిలలాడుతోంది. ఎక్కడ, ఎప్పుడు, ఏవిధంగా ఈ వైరస్ దాడి...

ప్రపంచమంతా కరోనా కోరల్లో చిక్కుకొని విలవిలలాడుతోంది. ఎక్కడ, ఎప్పుడు, ఏవిధంగా ఈ వైరస్ దాడి చేస్తుందో తెలియని పరిస్థితి నెలకొంది. మహమ్మారి బారిన పడకుండా మనల్ని మనం కాపాడుకోవాలని ఇప్పటికే వైద్యులు సెలవిచ్చారు. ముఖానికి మాస్క్, చేతికి గ్లౌజులు, మనుషుల మధ్య ఫిజికల్ డిస్టేన్స్, శానిటైజేషన్ ద్వారా కరోనా బారిన పడకుండా మనల్ని మనం కొంతమేర రక్షించుకోవచ్చు. ప్రపంచదేశాలను కరోనా మహమ్మారి పట్టి పీడిస్తోంది. అత్యవసర పరిస్థితుల్లో తప్పితే ఇంటి నుంచి బయటకు రావడానికి ప్రజలు జంకుతున్నారు. దీంతో మాస్క్ వేసుకోవడాన్ని చాలా దేశాలు తప్పనిసరి చేశాయి. చేతికి వాచీ, చేతిలో ఫోన్ లేకపోయినా ముఖానికి మాత్రం మాస్క్ పక్కా ఉండాల్సిందే. ప్రపంచంలోని అన్ని దేశాల ప్రజల జీవితాల్లోనూ మాస్క్‌ ఇప్పుడు విడదీయరాని భాగమైపోయింది.

కరోనా ఒక భయంకరమైన వైరస్. ఏ మాత్రం నిర్లక్ష్యం చేసినా శరవేగంగా విజృభించే మహమ్మారి. ఈ ప్రాణాంతక వ్యాధికి మందు లేదు. దీనికి అడ్డుకట్ట వేయాలంటే ఒక్కటే మార్గం అది స్వీయ నియంత్రణే. బయటకు వెళ్లినప్పుడు మాస్క్ ధరించటం, భౌతిక దూరం పాటించడం, శానిటైజర్స్ తో చేతులు శుభ్రం చేసుకోవడం. వీటన్నింటికన్నా ముఖ్యంగా అవసరమైతేనే బయటకు రావటం. ఇవే కరోనా కట్టడికి అస్త్రాలు. ఓ వైపు కరోనా మహమ్మారి పంజా విసురుతున్నా కొందరిలో మాత్రం మార్పు రావడం లేదు. కారణం లేకున్నా బయటకు వస్తున్నారు. ముఖానికి మాస్కు ఉండదు భౌతికదూరం అసలే పాటించరు. ఒకరకంగా చెప్పాలంటే మహమ్మారి విజృంభణకు ప్రధాన కారణం వీరి నిర్లక్ష్యమే. మందు లేదని తెలిసి కూడా నియంత్రణ కోల్పోతున్న ఈ కొందరు వైరస్ వ్యాప్తికి పరోక్షంగా కారణమవుతున్నారు. ప్రభుత్వాలు ఎంత మొత్తుకుంటున్నా వైద్యులు హెచ్చరిస్తున్నా పట్టించుకున్న వారే లేరు.

దేశంలో కరోనా కేసులు నలభై లక్షలకు పైగా నమోదయ్యాయి. వైరస్ నియంత్రణకు లాక్ డౌన్ విధించిన ప్రభుత్వాలు తర్వాత సడలించాయి. లాక్ డౌన్ వేళ తరువాత జనాల తీరులో మాత్రం పెద్దగా మార్పులేదు. లాక్ డౌన్ సమయంలోనూ ఆంక్షలను పట్టించుకోకుండా చాలా మంది రోడ్లపైకి వచ్చారు. వాళ్లకు చెప్పలేక, కంట్రోల్ చేయలేక పోలీసులు నరకం చూశారు. లాఠీ ఝలిపించినా కొందరు తీరు మార్చుకోలేదు. మాకేమీ కాదులే అన్నట్లు నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తూ ఇష్టారాజ్యంగా రోడ్లపైకి వచ్చారు. రోడ్డు పైకి వచ్చిన వారు నిబంధనలు పాటించారా అంటే అదీ లేదు. మాస్కు లుండవు భౌతిక దూరం మాటే పట్టదు. చివరకు మాస్కులు పెట్టుకోని వారికి జరిమానాలు విధిస్తున్నా వారి తీరు మాత్రం మార్చుకోవడం లేదు.

నిజానికి ఈ మధ్య వైరస్ సోకిన వారిలోనూ లక్షణాలు కనిపించడం లేదు. దీంతో మాకు లక్షణాలు లేవు కదా అన్న భరోసాతో కొందరు ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తూ కోవిడ్ నిబంధనలు పాటించకుండా ఇతరులకు వ్యాధి సోకేందుకు కారణమవుతున్నారు. HMTV ప్రతినిధులు హైదరాబాద్ నగరంలో రోడ్లపై మాస్క్ లు లేకుండా, భౌతిక దూరం పాటించకుండా తిరుగుతున్న వారిని ప్రశ్నించే ప్రయత్నం చేశారు. కొందరు పొరపాటు జరిగింది మళ్లీ ఇలాంటి పొరపాటు జరగకుండా చూస్తామంటుంటే మరికొందరు నిర్లక్ష్యపు సమాధానాలతో తప్పించుకునే ప్రయత్నం చేశారు. ఇప్పటికైనా ప్రజలు మారి మాస్కులు, భౌతికదూరం పాటించకపోతే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు. అంతేకాదు మరికొంతమంది కరోనా బారిన పడడానికి కారణమవుతారు.

Web TitlePeople let go off covid regulations, give up on mask
Next Story